మృత్యుంజయురాలు!


Sat,April 13, 2019 12:34 AM

సాంకేతికత, అత్యాధునిక వైద్య సౌకర్యాలు పెరిగినా, ప్రపంచ దేశాలను ఇప్పటికీ గడగడలాడిస్తున్నది క్షయవ్యాధి. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు వదలాల్సివస్తున్నది. ఈ తరుణంలోనే ఓ యువతి ఏడేండ్ల పాటు క్షయ వ్యాధితో పోరాడి గెలిచింది.
tb-survivor
మహారాష్ట్రలోని పూణె నగరానికి చెందిన దేవశ్రీలొఖండే అనే యువతికి 24ఏండ్ల వయసులో క్షయవ్యాధి సోకింది. ఏడేండ్లకు పైగా ఆమె ఈ వ్యాధితో పోరాడి కోలుకున్నది. అంతేకాదు తన జీవిత లక్ష్యం వైపు నూతన ప్రయాణాన్ని ప్రారంభించింది. మూడేండ్ల పాటు తనకు అత్యంత శక్తివంతమైన మందులు వాడడం వల్ల వినికిడి శక్తిని కోల్పోయింది. ఆ వ్యాధి సోకకు ముందు దేవశ్రీలొఖండే ఇంటికి ఎంతోమంది బంధువులు, స్నేహితులు వచ్చి వెళుతుండేవాళ్లు. కానీ ఆమెకు క్షయ అని తెలిసిన తర్వాత చాలా మంది ఇంటికి రావడం మానేశారు. అంతేకాదు చుట్టు పక్కల వాళ్లు కూడా తనను పలుకరించడానికి వెనకాడేవాళ్లు. కొంతమంది ఇంటికి రాకుండా ఫోన్‌లోనే పరామర్శించేవాళ్లు. ఇలా వారి ప్రవర్తన ఒక్కసారిగా మారడంతో మొదట్లో కొంచెం బాధపడింది. క్షయ వ్యాధి ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? రాకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలేమీ తనకు ఈ వ్యాధి సోకేంత వరకూ తెలియదు. ఆ తర్వాత ఈ వ్యాధిపై అవగాహన పెంచుకున్నది. ఎటువంటి ప్రాణాంతకమైన వ్యాధి సోకినా రోగాన్ని నయం చేసే మందులకంటే మానసిక స్థయిర్యమే ముఖ్యమని గ్రహించింది. ఆ విధంగా దేవశ్రీలొఖండే క్షయ నుంచి బయటపడే ప్రయత్నం చేసింది. ఏడేండ్ల పాటు ప్రతి రోజూ 20కిపైగా మాత్రలు, ఇంజక్షన్లు తీసుకొంటూ ఏమాత్రం కృంగి పోకుండా తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ, నెట్టుకువచ్చింది. ఏడేండ్ల తర్వాత దేవశ్రీలొఖండే ఆ మహమ్మారి నుంచి బయటపడి మృత్యుంజయురాలైంది. చివరకు ఆమెకు క్షయ వ్యాధి పూర్తిగా నయమైయింది. ఈ విషయం వైద్యనిపుణులందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఎటువంటి రోగం వచ్చినా అత్మైస్థెర్యం కోల్పోకుండా ఉంటే చాలు, దానికి తగిన మందులు వాడుతూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఏ సమస్యా ఉండదని దేవశ్రీలొఖండే చెబుతున్నది. ఇప్పడు ఆమె ఆర్కిటెక్చర్ అవ్వాలన్న జీవితాశయం వైపు తన నూతన ప్రయాణాన్ని మొదలు పెట్టింది.

178
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles