మూడుతరాల ఉద్యమస్ఫూర్తి!


Sat,March 30, 2019 01:15 AM

కుటుంబం ఒక్కటే.. కానీ తరాలు వేరు. మూడు తరాలుగా ఉద్యమమే ఊపిరిగా.. పోరాటమే ప్రాణంగా భావిస్తున్నది ఆ కుటుంబం. మూడు తరాల్లో ఒక తరం దేశస్వాతంత్య్రం కోసం ఉద్యమబాటలో ఉరికింది. మరో తరం.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమ శంఖారావం పూరించింది. ఇప్పుడు.. మూడో తరం.. మలిదశ ఉద్యమంలో నడిచి.. రాష్ట్ర ఖ్యాతిని ఖండాంతరాలు దాటించింది. తొలిదశ ఉద్యమకారులను సన్మానించి తాజాగా ఆ వంశస్తులు మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇంతకీ వారెవరంటే..మూడు ముక్కల్లో వారి గురించి, వారు చేసిన పని గురించి చెప్పాలనుకున్నాం. కానీ.. మూడు తరాలుగా వారు చేస్తున్న కృషి సామాన్యమైనది కాదు. బ్రిటీష్ బానిస సంకెళ్లను తెంచే ఉద్యమంలో పాల్గొన్న స్ఫూర్తి, వలస పాలకులు రాష్ర్టాన్ని పట్టి పీడిస్తుంటే కొదమ సింహాలై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో దూకారు వారు. తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా పొందిన ఉద్యమ స్ఫూర్తి, పోరాట కాంక్షను తొలి, మలిదశల ఉద్యమంలో చూపించారు. ఈ పోరాట కాంక్షకు, ఉద్యమ స్ఫూర్తికి ఆదర్శ ప్రధాత మక్తాల ఆగయ్య ముదిరాజ్.
Skoch-Award
మన తాతలు, తండ్రులు ఏదైనా సాధిస్తే వారి గురించి పదిమందికి చెప్పుకొని గొప్పగా ఫీలైపోతాం. కానీ.. మక్తాల వంశస్తులు అలా కాదు. తాతల నాటి నుంచి వారసత్వ సంపదగా ఉద్యమాన్ని, పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. మూడు తరాల మక్తాల కుటుంబంలో తొలి వ్యక్తి మక్తాల ఆగయ్య ముదిరాజ్. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి. హైదరాబాద్, తెలంగాణ సాయుధ పోరాటంలో ముందు నడిచిన ఉద్యమకారుడు. ఆవేశం, ఆలోచన రెండూ కలిసిన మనిషి ఆగయ్య. వందేమాతరం ఉద్యమంలో కూడా తెలంగాణ ప్రాంతంలో కీలకపాత్ర పోషించారు. రహస్య జీవితం గడుపుతూ.. టి. అంజయ్య, పీవీ నరసింహారావులతో కలిసి పనిచేశారు. మన వల్ల పదిమందికి మేలు జరుగాలి అనే ఆలోచనతో బోయిగూడలోని తనకున్న స్థలాన్ని ఉచితంగా ముదిరాజ్ సంక్షేమ భవనానికి ఇచ్చేశాడు. ఇప్పుడు అక్కడ కట్టిన ముదిరాజ్ వసతి గృహంలో 200 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.

వారసులు కూడా అదే బాటలో..

ఆగయ్య కొడుకు సురేష్‌బాబు కూడా తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు. టైగర్ స్ఫూరిగా 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూసిన వారి మీద బాంబులు వేసి.. ఉద్యమ ద్రోహుల పాలిట సింహస్వప్నమయ్యాడు. 1972లో సికింద్రాబాద్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయాలని సురేష్‌బాబు చేసిన నిరాహార దీక్ష చరిత్రలో ప్రత్యేకంగా లిఖించబడింది. ఆ దీక్షలో సురేష్‌బాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అయినా.. ఆయన పట్టు వదలలేదు.. రాజీ పడలేదు. ఈ పోరాటంలో సికింద్రాబాద్‌లోని అజంతా థియేటర్ వద్ద జరిగిన కాల్పుల్లో కొంతమంది చనిపోయారు. ఆయన దీక్ష రోజురోజుకు ఉధృత రూపం దాల్చడంతో అసెంబ్లీలో ఆనాటి ఎమ్మెల్యేలు తప్పనిసరి పరిస్థితుల్లో సురేష్‌బాబుకు మద్దతుగా నిలిచారు. సికింద్రాబాద్ క్లాక్‌టవర్ దగ్గరున్న అమరవీరుల స్థూపం సురేష్‌బాబు పోరాట ప్రతిఫలమే. ఆ స్థూపం మీద గళమెత్తి గర్జిస్తున్న బొమ్మ సురేష్‌బాబును పోలి ఉంటుంది. డెక్కన్ క్రానికల్ ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీగా పనిచేసిన ఆయన ఉద్యోగులు సమస్యలకు తనదైన శైలిలో స్పందించి పరిష్కారం చూపారు.

మూడోతరం..

తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమం క్రియాశీలకంగా సాగుతున్న సమయంలో మక్తాల కుటుంబంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ తెలంగాణ ఉద్యమం గురించే మాట్లాడుకునేవారు. ఆ సమయంలోనే సురేష్‌బాబు కొడుకు సందీప్‌కుమార్ తెలంగాణ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. తండ్రి పోరాట వారసత్వం, తాత ఆదర్శం సందీప్‌కుమార్‌లో పోరాటంలో పాల్గొనేలా చేసింది. టెక్నాలజీ మీద పట్టున్న సందీప్ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగి సోషల్ మీడియా ద్వారా నెటిజనులను సమీకరించాడు. 2007 నుంచి 2009 వరకు నిర్విరామంగా వెబ్‌సైట్‌తో లక్షల మందికి తెలంగాణ వస్తే ఏం లాభం? పోరాడాల్సిన అవసరం ఎంత? అనే విషయాలు పూస గుచ్చినట్టు ప్రచారం చేశాడు. 2010లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్‌ను ప్రారంభించి ఉద్యమంలో మరింత మంది పాల్గొనేలా కృషి చేశాడు. కేటీఆర్ అందించిన ప్రోత్సాహంతో ఐటీ పరిశ్రమ పురోభివృద్ధికి పథకాలు రచించి సక్సెస్ అయ్యాడు. ఈ మధ్యే 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరినీ సన్మానించి ఉద్యమ స్ఫూర్తి మీద తనకున్న గౌరవాన్ని చెప్పకనే చెప్పాడు.

టెక్నాలజీ విప్లవం దిశగా..

రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ఐటీ పరిశ్రమలో తెలంగాణ ఉద్యోగుల పాత్రను మరింత పెంచేందుకు సందీప్ అనేక శిక్షణా కార్యక్రమాలు, అవగాహనా శిబిరాలు చేపట్టారు. విద్యార్థులకు శిక్షణ అందించేందుకు యువనిర్మాణ్, ప్రజల్లో సాంకేతిక అక్షరాస్యత కోసం డిజిథాన్, యువతలోని వ్యవస్థాపక లక్షణాలను ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెల్ ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఐటీ పరిశ్రమలో తెలంగాణ సంస్కృతికి ప్రాధాన్యం దక్కని పరిస్థితుల్లో ఐటీ కారిడార్‌లో బోనాలు, బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతోపాటు మెక్సికోలో సైతం ఆ దేశ ప్రజలతో బతుకమ్మ స్వయంగా నిర్వహించేలా చేపట్టారు. కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణ భవన్ ఏర్పాటు చేసేందుకు అధికార ప్రక్రియ పూర్తి చేసి పొరుగు రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి సత్తా చాటారు.
Skoch-Award1

ఫలితం ఇదీ..

2014 జనవరి ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైన యువ నిర్మాణ్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 2లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. ఇతర రాష్ర్టాలు, దేశాల్లో తెలంగాణ సత్తా చాటేందుకు 2015లో ఫిలడెల్పియా టీటా ఎన్నారై చాప్టర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం యూఎస్‌ఏ, కెనడా, మెక్సికో, పారిస్, దక్షిణాఫ్రికా, ఉరుగ్వే, కువైట్ సహా 20 దేశాల్లో ఈ చాప్టర్ పనిచేస్తున్నది. సాంకేతిక అక్షరాస్యత కోసం డిజిథాన్ రూపొందించారు. డిజిటల్ లిటరసీకి చేసిన కృషి ఫలితంగా వరుసగా మూడు సార్లు రాష్ట్రప్రభుత్వం అవార్డులు దక్కాయి. కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ వ్యక్తిగతంగా అభినందించారు. దీనికి రెండు స్కోచ్ అవార్డులు దక్కాయి. 100కే డిజిథాన్ పేరుతో ప్రతీ జిల్లాను చుడుతూ.. 2500 కిలోమీటర్లు పర్యటించి లక్షా83 వేల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు.

గుంటూరు జిల్లా రేపల్లెలో డిజిటల్ అక్షరాస్యత చేపట్టాలని అక్కడి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సందీప్‌ని ఆహ్వానించి, కార్యక్రమ అనంతరం ఘనంగా సన్మానించారు. దక్షిణకొరియా బృందం తెలంగాణలో తమ పెట్టుబడులకు టీటాతో సమన్వయం చేసుకుంది. టీ-హబ్ సహా ఇతర ప్రాంతాల్లో దక్షిణ కొరియా బృందంతో పర్యటన చేశారు. డిజిటల్ వనపర్తి కార్యక్రమంలో 12,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఔత్సాహికులకు అండగా నిలిచారు. కర్ణాటకలో పంపన తెలంగాణ భవన్ ఏర్పాటుకు కృషి చేశారు. అనంతరం సంప్రదింపులు జరిపి ప్రభుత్వంచే ఎకరా స్థలం కేటాయింపజేశారు. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో పర్యటించి విద్యావిధానం గురించి అధ్యయనం చేశారు. తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడి విద్యా కార్యక్రమాలు ఇక్కడ అమలుపరిచే వెసలుబాటు గురించి అధ్యయనం చేస్తున్నారు.

పల్లె సీమకు పట్టం కట్టాలి..

ఒకప్పుడు తెలంగాణ అనే పదం ఉచ్ఛరించడానికే ఐటీ పరిశ్రమ ఇబ్బంది పడింది. ఇప్పుడు టీటా ద్వారా తెలంగాణ సంస్కృతిని ఐటీ పరిశ్రమ మొత్తం పండుగలా జరుపుకొంటున్నది. ఇండస్ట్రీ టూర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పరిశ్రమలపై అవగాహన కల్పించాం. ఈ కార్యక్రమాలకు కొనసాగింపుగా రాబోయే కాలంలో వరల్డ్ తెలంగాణ ఐటీ కాంగ్రెస్ పెట్టాలనే ఆలోచనల్లో ఉన్నాం. ఇటీవల 1969 ఉద్యమకారులను సన్మానించిన రీతిలోనే మరిన్ని కార్యక్రమాలు తీసుకురాబోతున్నాం.
- సందీప్ కుమార్ మక్తాల

ఆశ్చర్యపోయాను

1969 ఉద్యమంలో పాల్గొన్న వారే నాటి ఉద్యమకారులను సన్మానిస్తున్నారనుకున్నాను. కానీ.. అది యువకుడైన సందీప్‌కుమార్ మక్తాల అని తెలిసి ఆశ్చర్యపోయాను. చిన్న వయసులోనే ఇంతటి తెలంగాణ భావన కలిగేందుకు కారణం తాత, తండ్రి నుంచి దక్కిన స్ఫూర్తి అని అర్థమైంది. ఇలాంటి యువకులు తెలంగాణకు అవసరం.
- పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్

-శ్రీధర్ సూరునేని, స్టేట్‌బ్యూరో, హైదరాబాద్

447
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles