మూగజీవాల సంక్షణాలయం!


Wed,May 8, 2019 01:48 AM

Dog
ఆమె ఇంట్లో గాయపడిన పక్షులుంటాయి.. అయితే అవి సంతోషంతో కిలకిల రావాలు తీస్తాయి. ఆ ఇంట్లోనే పిల్లులు, కుందేళ్లు వంటి పెంపుడు జంతువులుంటాయి.. వాటికి తమ యజమాని లేడన్న బాధే ఉండదు. ఆ ఇంట్లోనే పలు జాతుల పెంపుడు కుక్కలుంటాయి. అవి అల్లరిచిల్లరగా మొరగవు. తమ కేర్ టేకర్ ముఖం చూస్తే.. ముందరి కాళ్లతో నమస్కరిస్తాయి. ప్రేమతో నిమిరితే.. అంతకు రెట్టించిన ప్రేమను చూపుతాయి. కేవలం పెంపుడు కుక్కల కోసమే ఆ ఇంట్లో స్విమ్మింగ్‌పూల్ కూడా ఉన్నది. మొత్తానికి ఆ ఇల్లు ఓ సంరక్షణాలయం. ఆ ఇంటి యజమాని మూగజీవాల బంధువు.

ఆ రోజు సుమతికి నిద్రపట్టడం లేదు. మనసెందుకో స్థిమితంగా లేదు. అయినా కళ్లు మూసుకొని నిద్రపోవడానికి బలవంతంగా ప్రయత్నిస్తున్నది. అప్పటికే అర్ధరాత్రి కావొస్తుంది. మెల్లిగా నిద్రపడుతున్న సమయంలోనే.. భౌ..భౌభౌ.. అనే శబ్దం వినిపించింది.
Dog1
ఆ శబ్దంతోపాటు.. ఓ కుక్క మూలుగులూ వినపడుతున్నాయి. సుమతికి తెలుసు అవి మూలుగులు కావు.. ఆర్తనాదాలని. ఏదో ఒక పెంపుడు కుక్క.. తన యజమానిపై బెంగపెట్టుకొని బాధపడుతుందిలే అనుకున్నది సుమతి. మళ్లీ అవే అరుపులు. అవే మూలుగులు. ఇక ఆలోచించలేదు సుమతి. వెంటనే తన ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్‌కు వెళ్లి చూసింది. అక్కడున్న పెంపుడు కుక్కలన్నీ బాగానే ఉన్నాయి. హాయిగా పడుకున్నాయి. మళ్లీ అరుపులు వినిపించాయి. గేటు దగ్గరకెళ్లి చూడగా.. ఓ పెంపుడు కుక్క చాలా దీనావస్థలో మొరుగుతున్నది. శరీరం మొత్తం చిక్కిపోయింది. కదలలేనిస్థితిలో మూలుగులుతున్నది. ఓపిక తెచ్చుకొని మొరుగుతున్నది. అంతా పరిశీలిస్తే.. ఎవరో పెంచుకున్న కుక్కని తన ఇంటి గేటుకు కట్టేసి వెళ్లారు. ఉదయం డాక్టర్‌కు చూపిస్తే.. ఆ కుక్కకి క్యాన్సర్ అని తేలింది. అలాంటి పరిస్థితుల్లో.. ఎవరో పెంచుకున్న కుక్కను చేరదీసి.. నేటికీ దానికి వైద్యం చేయిస్తున్నది సుమతి. ఇప్పుడా పెంపుడు కుక్క ఆరోగ్యం మెరుగైంది. తోటి కుక్కలతో కలిసిపోయి.. హాయిగా బతుకుతున్నది. అప్పుడే మనకెందుకులే అని ఆ కుక్కను వదిలేసి ఉంటే.. నేను ఈ రోజుకీ మనస్ఫూర్తిగా తినేదాన్ని కాదేమో అంటున్నది సుమతి. ఇదీ మూగజీవాల పట్ల ఆమెకున్న ప్రేమ, వాత్సల్యం. అందుకే మూగజీవాల పాలిట బంధువుగా మారి.. ఆపదలో ఉన్న ఎన్నో పక్షులు, జంతువులను కాపాడుతున్నది సుమతి.

ఏం చేస్తుందంటే?

సుమతి పెంపుడు జంతువుల కేర్ టేకర్. పెంపుడు జంతువులపై ఉన్న ప్రేమతో.. ఇంటినే పెట్‌కేర్ సెంటర్‌గా మార్చింది. కుక్కల్ని ఎవరైనా పెంచుకుంటారు. కానీ ఊరెళ్లినప్పుడు వెంట తీసుకెళ్లాలంటేనే కష్టం. ఇంకెవరికైనా ఆ బాధ్యత అప్పజెప్పాలి. వాటిని ప్రేమగా చూసుకొని, తిండిపెట్టాలంటే ఎవరూ ముందుకురారు. 2011లో సరిగ్గా అలాంటి సమస్యే ఎదుర్కొన్నది సుమతి. ఓవైపు లాంగ్ టూర్‌కు వెళ్తున్నామనే సంతోషం. మరోవైపు తాను పెంచుకుంటున్న మూడు కుక్కల బాగోగులు ఎవరు చూసుకుంటారనే బాధ. అప్పుడు తను ఎదుర్కొన్న సమస్య నగరంలో ఎంతో మంది ఎదుర్కొని ఉంటారని ఆమె గ్రహించింది. ఆ సమస్యకు పరిష్కారం దిశగా తన ఇంటిలోని గ్రౌండ్ ఫ్లోర్‌ను పెట్‌సెట్రా పేరుతో కేర్ సెంటర్‌గా మార్చేసింది. ఈ కేర్ సెంటర్‌లో ఎవరైనా ఊరెళ్తే వారి పెంపుడు జంతువులను కంటికి రెప్పలా చూసుకుంటున్నది సుమతి. వాటికి ఇష్టమైన ఆహారం వండి పెడుతున్నది. ముందుగానే తీసుకున్న హెల్త్‌ప్రొఫైల్ ప్రకారం వాటికి మందులు వేయాల్సి ఉన్నా.. ట్రీట్‌మెంట్ అవసరమైతే చేయిస్తున్నది. ప్రత్యేకంగా కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేసి.. వాటి యజమానులలా చాలా ప్రేమగా చూసుకుంటున్నది సుమతి. ఇందుకు చాలా తక్కువ మొత్తంలో ఫీజు తీసుకుంటున్నది.

మూగజీవాలకు అండగా..

సుమతికి చిన్నప్పటి నుంచి పక్షులు, పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. తన చుట్టు పక్కల ఎక్కడ మూగజీవాలు హింసకు గురైనా సుమతి పరిగెత్తుకు వెళ్తుంది. వాటిని రక్షిస్తుంది. అవసరమైతే చికిత్స అందిస్తుంది. తన ఇంటి ఆవరణలో పలు రకాల పక్షులు, కొన్ని మూగజీవాలున్నాయి. ఇవన్నీ ఏదో ప్రమాదంలో గాయపడినవే. వాటి సమాచారం ఎవరో అందిస్తే.. ఆ ప్రమాద స్థలానికి వెళ్లి వాటిని చేరదీసి, వైద్యం చేసి.. మళ్లీ అడవుల్లో వదిలిపెడుతున్నది సుమతి. అవి పూర్తిగా గాయం నుంచి కోలుకునే వరకూ.. వాటి ఆలనా పాలనా చూస్తున్నది సుమతి. అందుకే ఆమె చేసే పనే ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. మణికొండ ప్రాంతంలో ఎల్‌ఐసీ ఎంప్లాయీస్ కాలనీలో నీలమేఘం సుమతి ఇల్లెక్కడ అంటే ఎవ్వరూ చెప్పరు. కానీ.. కుక్కలున్న మేడం ఇల్లెక్కడ అంటే మాత్రం ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు.

కుక్కల కోసం స్విమ్మింగ్‌పూల్!

చాలామంది తమ ఇండ్లలో కుటుంబ సభ్యుల్లా కుక్కల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. కాలక్షేపం కోసం జాగింగ్‌కు వెళ్తుంటారు. అయితే అవి ఎక్కువ సేపు గొలుసులతో కట్టేసి ఉండడం, పొద్దస్తమానం కూర్చొనే ఉండడంతో హిప్ జాయింట్ పెయిన్‌తో బాధపడుతుంటాయి. పెంపుడు కుక్కలు ఈత కొడితే ఇలాంటి సమస్యలుండవని వైద్యుల ద్వారా తెలుసుకున్నది సుమతి. వెంటనే తన ఇంట్లోనే ఆహ్లాదకర వాతావరణంలో కుక్కల కోసమే ప్రత్యేకంగా ఓ స్విమ్మింగ్‌పూల్ ఏర్పాటు చేసింది. అప్పటినుంచి నగరవాసులు తాము పెంచుకుంటున్న కుక్కలను ఇక్కడికి తీసుకువచ్చి వాటితో స్విమ్మింగ్ చేయిస్తున్నారు. దీంతో హిప్ జాయింట్ పెయిన్ తగ్గిపోయి.. మళ్లీ ఎప్పటిలాగే హుషారుగా ఉంటున్నాయి పెట్స్. అయితే తరచూ స్విమ్మింగ్ పూల్‌లోని నీటిని మార్చడం వీలు కాదు కాబట్టి.. అధునాతన యూవీ ఫిల్టరైజేషన్‌ను ఏర్పాటు చేసింది సుమతి. దీని వల్ల రోగకారక క్రిములు నశించి, నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. ఈ విధానం ద్వారా ఆటోమేటిక్‌గా నీళ్లు ఫిల్టర్ అవుతుంటాయి. నీరు తప్పనిసరిగా మార్చాల్సి వస్తే అలారం మోగుతుంది.

ఇల్లే ఒక పిక్నిక్ స్పాట్

సుమతి చేస్తున్న మంచి పనుల వల్ల.. ఆమె ఇల్లే ఓ పిక్నిక్‌స్పాట్‌గా మారింది. ఇక్కడికి పెట్స్‌ను తీసుకు వచ్చేవారు కుటుంబంతో సహా వస్తున్నారు. పక్షులకు ఆహారం తీసుకొస్తూ.. వాటితో కాసేపు ఆడుకుంటారు. తమ పెట్స్‌ను స్విమ్మింగ్‌పూల్‌లో దించి.. వాటితో కలిసి ఈత కొడుతూ సేద తీరుతున్నారు. ఎండలు బాగా ఉన్న ఈ తరుణంలో.. ఈతతో చాలా రిలీఫ్ పొందుతున్నారు. అయితే ఈ స్విమ్మింగ్ పూల్‌కు కుక్కలను తీసుకొచ్చేవారు ముందుగానే సుమతిని సంప్రదించాలి. ఆ శునకం ఇష్టాలు, భయాలు, ఆనందాలు, తినే తిండి, అనారోగ్య సమస్యలు అన్నీ చెప్పాలి. ఆ వివరాల ఆధారంగా పెంపుడు జంతువులను మచ్చిక చేసుకొని.. వాటికి సంతోషాన్ని అందిస్తున్నది సుమతి. మూగజీవాల కోసం ప్రత్యేకంగా స్విమ్ జాకెట్లు కూడా ఉన్నాయి.
Dog2

మూగజీవాలను ప్రేమించండి

నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేశా. నెలకు లక్షల్లో జీతం వచ్చేది. అయినా ఏదో అసంతృప్తి. దీంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి.. నాకు ఇష్టమైన పనినే చేస్తున్నా. ఈ పెట్‌కేర్ సెంటర్‌తో ఆత్మ సంతృప్తి మిగిలింది. నా పనికి తగిన గుర్తింపు వస్తున్నది. చాలామంది మూగజీవాల పట్ల ప్రేమను చూపించరు. అకారణంగా హింసిస్తుంటారు. అలాంటి సంఘటనలు చాలా బాధిస్తుంటాయి. మనలాగ అవి మాట్లాడలేవు కాబట్టే.. వాటిని ప్రేమిద్దాం.
- సుమతి, జంతు ప్రేమికురాలు

- పడమటింటి రవికుమార్
- జి. చిన్న యాదగిరి గౌడ్

341
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles