మీ పరపతి ఎంత


Sat,September 8, 2018 01:31 AM

రుణం తీసుకోవాలన్నా.. క్రెడిట్ కార్డు పొందాలన్నా.. అది మీ క్రెడిట్ స్కోర్‌పైనే ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా?.. క్రెడిట్ స్కోరేంటి? అనుకుంటున్నారా. మీ రుణ చరిత్ర, ఆర్థిక సామర్థ్యాలకు అంకెల రూపంలో అద్దం పట్టేదే ఈ క్రెడిట్ స్కోర్. మూడంకెలతో ఉండే ఈ స్కోర్ మన ఆర్థిక స్తోమతకు క్వాలిఫికేషన్. ఇదికూడా 300ల నుంచి 900ల మధ్య ఉంటుంది. 750 ఆపై స్కోరు ఉంటే మీకు ఢోకా లేదన్నమాట. రుణాలు, క్రెడిట్ కార్డులు ఇతరత్రా అన్నీకూడా ఇట్టే అందుతాయి. అయితే ఈ స్కోర్‌ను చాలా అంశాలే ప్రభావితం చేస్తాయి. ఎక్స్‌పీరియన్, సిబిల్ వంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు బ్యాంకుల నుంచి మీ రుణ చరిత్ర వివరాలను సేకరిస్తాయి. తమ ప్రమాణాలను ఉపయోగించి ఈ సమాచారం ఆధారంగా మీ క్రెడిట్ స్కోర్‌ను గణిస్తాయి.
CIBIL-SCORE

మీ ఆదాయ

వనరులతో మీ రుణం, క్రెడిట్ కార్డుల వినియోగం, చెల్లింపుల ప్రాతిపదికన క్రెడిట్ స్కోర్‌ను విశ్లేషిస్తాయి. బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో 750 అంతకంటే ఎక్కువ స్కోర్లుంటేనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీకు పెద్ద ఎత్తున రుణాలిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఆర్థిక పరమైన అంశాల్లో డిఫాల్ట్ కాకుండా చూసుకోండి. అసలు ఈ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తున్నవేంటో ఓసారి తెలుసుకుందాం పదండి.

చెల్లింపుల చరిత్ర

క్రెడిట్ స్కోర్‌ను నిర్ణయించడంలో చెల్లింపుల చరిత్ర అత్యంత కీలకమైనది. రుణం తీసుకున్నప్పుడు నెలసరి వాయిదాలు (ఈఎంఐ) లేదా క్రెడిట్ కార్డులు ఇతరత్రా బకాయిలను మనం చెల్లించే తీరు సజావుగా, సక్రమంగా ఉండాలి. సమయానుసారంగా ఉంటే ఫర్వాలేదు. కానీ ఆలస్యమైనా, తరచూ నిర్ణీత వ్యవధిలో చెల్లించకపోయినా, ఎంతకీ చెల్లించక మొండికేసినా మీ క్రెడిట్ స్కోర్ దారుణంగా పడిపోవడం ఖాయం. బ్యాంకర్లకు మీ మీద విశ్వాసం సన్నగిల్లుతుంది. ఈ వివరాలన్నిటినీ కూడా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు అందిస్తాయి. కనుక బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నప్పుడు చెల్లింపుల్లో ఏమరుపాటు పనికిరాదు. ఇది మీ భవిష్యత్ రుణ అవసరాలకు ముప్పు తీసుకురాగలదు. ముఖ్యంగా గృహ, వాహన రుణాలకు ఇబ్బందులు సృష్టించవచ్చు.

క్రెడిట్ కార్డుల వినియోగం

క్రెడిట్ కార్డుల వినియోగం కూడా మీ క్రెడిట్ స్కోర్‌ను శాసించగలదు. ఉదాహరణకు మీరు తీసుకున్న క్రెడిట్ కార్డు వ్యయ పరిమితి లక్ష రూపాయలుగా ఉంది. కానీ నెలకు రూ.50,000 మాత్రమే వాడుకుంటున్నారు. దీంతో రుణ వినియోగ నిష్పత్తి 50 శాతంగా ఉంటుంది. దీనివల్ల క్రెడిట్ స్కోర్ ఆకర్షణీయంగా మారే వీలుంటుంది. అలాకాకుండా పరిమితి మేరకు వాడినా.. దాన్ని మించి వినియోగించినా క్రెడిట్ స్కోర్ తగ్గిపోగలదు. క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించినప్పటికీ.. అదుపు తప్పిన వ్యయ నియంత్రణ కారణంగా క్రెడిట్ స్కోర్ దిగజారే అవకాశాలుంటాయి. తరచూ వ్యయ పరిమితికి చేరువ కావడం వల్ల మీ అవసరాలు ఎక్కువని, స్వల్ప కాలిక రుణాల కోసం మీరు ఎదురుచూస్తున్నారని అర్థం. కాబట్టి ఎప్పుడూ కూడా ఖర్చులను 20-30 శాతం పరిధిలోనే ఉంచుకోవడం ఉత్తమం. ఫలితంగా మీ రుణ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి.

సెటిల్మెంట్లు

రుణాలు తీసుకుని సెటిల్మెంట్లకు వెళ్లినా క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. మీ ఆర్థిక పరిస్థితులు బాగోలేక బ్యాంకర్లు రుణాన్ని రద్దు చేసినా దాని ప్రభావం క్రెడిట్ స్కోర్‌పై తప్పక చూపుతుంది. రుణ చెల్లింపు గడువును పొడిగించినా, క్రెడిట్ కార్డు బకాయిలను తప్పించుకోవాలని చూసినా ప్రమాదమే. ఇక రుణాలు ఎగవేస్తే.. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫాల్టర్ల ముద్రపడిపోతుంది. ముఖ్యంగా రుణాలు తీసుకుని వాటిని చెల్లించే ఆర్థిక స్థోమత ఉన్నా.. చెల్లించకపోతే ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులుగా ప్రకటిస్తారు. ఈ పరిణామం క్రెడిట్ స్కోర్ సంగతి అటుంచి, మనల్ని బ్యాంకింగ్ రంగానికే శాశ్వతంగా దూరం చేయవచ్చు. కాబట్టి రుణాలు తీసుకోగానే అవసరాలు తీరాయనుకోకుండా, వాటిని సక్రమంగా చెల్లిస్తే మన క్రెడిట్ స్కోర్ పెరుగడానికి ఉపయోగపడుతుంది.
money

మీ ఖాతా వయసు

బ్యాంకుల్లో మీ ఖాతా వయసు కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపగలదు. రుణ చరిత్ర బాగున్నవారితోనే బ్యాంకర్లు దగ్గరగా ఉంటారు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించినప్పుడు వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం బ్యాంకర్లే కొత్త రుణాలను ఇచ్చేందుకు ఆసక్తి చూపుతారు. రుణ ప్రయోజనాలను తెలియజెప్పి సాయపడుతారు. ఇలాంటివారిపై సహజంగానే సదభిప్రాయం ఉంటుంది. ఇది మీ గురించిన సమాచారం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు ఇస్తున్న వేళ లాభిస్తుంది. క్రమశిక్షణ కలిగిన ఖాతాదారును ఎవరుమాత్రం ఎందుకు వదులుకుంటారు చెప్పండి. అలాగే ఎగవేతదారులను వీలైనంత దూరంగా పెట్టడమూ జరుగుతుంది. కాబట్టి ఖాతా లావాదేవీలు ఆరోగ్యకరంగా, స్పష్టంగా ఉండటం అనేది మన బకాయిలను మనం పద్ధతిగా తిరుస్తున్నామనే విషయాన్ని చెప్పకనే చెబుతుంది. అది క్రెడిట్ స్కోర్‌నూ బలపరుస్తుంది.

ఎన్ని ఖాతాలు

రుణాలు, క్రెడిట్ కార్డుల కోసం మీరు ఎన్ని ఖాతాలు తెరిచారు? అన్నది కూడా క్రెడిట్ స్కోర్‌కు గండి కొడుతుంది. చాలా బ్యాంకుల్లో ఖాతాలున్నా.. వాటి లావాదేవీల చరిత్ర బాగోలేకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతినవచ్చు. అయితే లావాదేవీలు ఆకర్షణీయంగా ఉంటే మాత్రం లాభిస్తుంది. ఇది బ్యాంకర్లలో మనపట్లగల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. రుణాల సమయంలో పూచీకత్తులు కూడా క్రెడిట్ స్కోర్‌ను నిర్దేశించగలవు. బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థల నిబంధనలకు అనుగుణంగా ఖాతాలను మనం నిర్వహిస్తున్నామా? లేదా? అన్న అంశం కూడా ప్రధానమే. ఖాతాల్లో ఎప్పుడూ ఆకర్షణీయంగా నగదు నిల్వలున్నా.. బ్యాంకుల్లో మీ పరపతిని పెంచుతుంది కాబట్టి డిపాజిట్లూ కీలకమే. రుణాలు తీసుకున్నప్పుడు వాయిదా మొత్తాల్ని నిర్ణీత గడువుకు ఎంత ముందస్తుగా ఖాతాల్లో ఉంచుతున్నామో కూడా ముఖ్యమే.
-అదిల్ శెట్టి, సీఈవో, బ్యాంక్‌బజార్.కామ్

అప్పుకోసంఆరా తీసినా సరే!


creditcard
రుణం లేదా క్రెడిట్ కార్డు కోసం మీరు దరఖాస్తు చేసుకున్న ప్రతీసారి మీ రుణదాత లేదా బ్యాంక్ మీయొక్క రుణ చరిత్రను తప్పక చూస్తారు. ఇలా విచారించిన ప్రతీసారి మీ క్రెడిట్ స్కోర్ స్వల్ప పరిమాణంలో తగ్గిపోతూ ఉంటుంది. అంతేగాక మీకు రుణ అవసరాలు ఎక్కువన్న విషయం తేటతెల్లమవుతుంది. సాధారణంగా మన ఆదాయంతో మన అవసరాలు తీరనప్పుడే అప్పుల కోసం వెళ్తాం. కాబట్టి అదేపనిగా రుణాల కోసం వెళ్లడం, క్రెడిట్ కార్డుల కోసం ప్రయత్నించడం వల్ల క్రెడిట్ స్కోర్ మందగిస్తుందన్న విషయాన్ని మరువరాదు. బలమైన కారణం ఉంటే తప్ప రుణం కోసం వెళ్లకపోవడమే మంచిది. అలాగని మన రుణ చరిత్రను ఎవరు చూసినా మన క్రెడిట్ స్కోర్ తగ్గుతుందనుకుంటే పొరబాటే. మీ అంతట మీరు మీ రుణ చరిత్రను తిరగస్తే మాత్రం క్రెడిట్ స్కోర్‌కు వచ్చిన ఇబ్బందేమీ ఉండదు.

559
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles