మిల్లెట్ టిఫిన్స్.. C/O శమంతకమణి!


Sat,May 11, 2019 12:49 AM

ఈ మధ్యకాలంలో మిల్లెట్స్‌పై జనాల్లో కొంత అవగాహన ఏర్పడింది. కొర్రలు.. సామలు.. జొన్నలు.. సజ్జలు.. రెగ్యులర్‌గా తినేవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే అవన్నీ భోజనంగా తీసుకుంటున్నారు. కానీ, అల్పాహారంగా తీసుకోవడం లేదు. మనం రోజూ తినే ఇడ్లీ.. దోశ.. వడ.. బోండా.. ఉప్మాలను మిల్లెట్స్‌తో చేసుకోవడమే శమంతకమణి టిఫిన్స్ స్పెషాలిటీ.
టీ తాగారా? టిఫినీలు తిన్నారా? తింటే ఏం తిన్నారు? అదే మైదా.. అదే రవ్వ.. అదే తిండి! ఇంకా ఎన్నాళ్లు ఈ తీరు? తిప్పలు? మన పూర్వీకులు ఏం తినేవారు? వాళ్లెందుకంత ఆరోగ్యంగా ఉండేవారు? ఆలోచించండి. ఇవన్నీ మానేసి.. చిరుధాన్యాల టిఫిన్స్ తినండి అంటున్నారు శమంతకమణి!

mani-millet
పొద్దు పొద్దున్నే అల్పాహారం తింటే మరింత ఆరోగ్యంగా ఉంటామని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తాజా పరిశోధన ద్వారా చెప్పారు. బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల జీవక్రియ సక్రమంగా పనిచేస్తుందనీ.. అలాకాకుండా నేరుగా భోజనమే చేస్తే టైప్-2 డయాబెటీస్.. గుండె సమస్యలు వస్తాయని వారు సూచించారు. ఐతే మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒకటి తినేస్తున్నాం. మన పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయ ఆహారమైన చిరుధాన్యాలతో అల్పాహారం అందిస్తున్నారు నెల్లూరి శమంతకమణి. ఖమ్మంజిల్లా వైరాకు చెందిన ఈవిడ చిరుధాన్యాల అల్పాహారాన్ని వ్యాపారంగా మలుచుకొని ఎందరికో ఆరోగ్యాన్ని పంచుతున్నారు.

ఆలోచన ఎలా వచ్చింది? :

ముప్ఫైయేండ్లకే మోకాళ్ల నొప్పులు.. నలభైయేండ్లకే గుండె సమస్యలు.. సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నది నేటితరం. ఇలాంటి సమస్యలున్నవారు రోజూ ఎక్కడో ఒకచోట తారసపడేవారు. ఇలా ఎందుకు జరుగుతుంది? అని అధ్యయనం చేశారు శమంతకమణి. పోషకాహార లోపం అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. చిరుధాన్యాలు ఆహారంగా తీసుకుంటే ఇలా ంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని డిసైడ్ అయా ్యరు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలను ఫిజ్జా.. బర్గర్లు.. స్పైసీ స్నాక్స్ బారి నుంచి తప్పించాలని మిల్లెట్స్ టిఫిన్స్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇడ్లీ.. దోశ.. పునుగులు.. బూందీ.. మురుకులు వంటి రకరకాల చిరుధాన్యాలతో టిఫిన్స్‌ను అందిస్తున్నారు.

ఆదరణ ఉందా?

చిరుధాన్యాల టిఫిన్స్ ఎవరు కొంటారు? అని చాలామంది అన్నారు. కానీ ఆమె అవన్నీ పట్టించుకోలేదు. ఒక ప్రయత్నమైతే ప్రారంభించాం. అడుగు ముందుకేస్తేనే తెలుస్తుంది అనుకున్నారు. ప్రారంభించిన వెంటనే ఎవరూ కొనకపోయి ఉండొచ్చు.. కానీ ఎప్పటికైనా మిల్లెట్స్ అవసరం ప్రజలకు తెలుస్తుంది.. అప్పుడు వస్తారు అనుకొని దూరదృష్టితో వెనక్కి తిరిగి చూడలేదు. ఒకసారి నుమాయిష్‌లో స్టాల్ ఏర్పాటుచేసింది. ప్రజలు బాగా ఆదరించారు. చిరుధాన్యాలపై ప్రజల్లో ఏర్పడుతున్న అవగాహనను పసిగట్టారు. తీసుకోవాలని జనాలకు ఉన్నా.. సరైన అవగాహన లేక మిల్లెట్స్ జోలికి రావడం లేదని గ్రహించి ఎస్‌ఎం మిల్లెట్స్‌ఫుడ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది మియాపూర్‌లో ఉంది.
mani-millet2

తగిన గుర్తింపు

సెంటర్ ప్రారంభించి చిరుధాన్యాల అల్పాహారం మార్కెట్లోకైతే తీసుకొచ్చారు కానీ పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన మొదట్లో ఉండేది. అమెరికాలో ఉండే సతీశ్‌చంద్ర టిఫిన్ మెటీరియల్ అంతా అగర్ షాప్ వెబ్‌సైట్ ద్వారా అమ్ముతున్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు మిల్లెట్స్ టేస్ట్ చూయించాలన్న ఆమె పట్టుదలకు.. నుమాయిష్‌లో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌కు తగిన గుర్తింపు లభించింది. ఇది మరో అవకాశం తీసుకొచ్చింది. మధురానగర్‌లోని తరుణి ఫెయిర్‌లో 60 రోజుల పాటు స్టాల్ పెట్టుకునేందుకు మెట్రో ఎండీ అవకాశం కల్పించారు. రెండు నెలలకు రూ. 12,000 కిరాయి చెల్లించాలి. ఆదాయం వస్తుందని నమ్మకం లేకపోయినా ప్రయత్నం చేద్దామని సిద్ధమయ్యారు. స్టాల్ పెట్టి పదిరోజులు అవుతుంది. విజయవంతంగా నడుస్తున్నది.

అగ్గువకే లభ్యం

సేంద్రియ చిరుధాన్యాలతో చేసిన నాణ్యమైన టిఫిన్స్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న మణి రేట్లను కూడా ప్రజలకు అందుబాటులో ఉండేట్లుగానే పెట్టారు. ప్రస్తుతం తరుణి ఫెయిర్‌లో ఉన్న స్టాల్ వద్ద లభించే ప్లేట్ దోశకు రూ.40. ఉప్మాకు రూ.30. సేంద్రియ బెల్లంతో చేసిన జావకు రూ.20. ఇడ్లీకి రూ. 30 ధరలు ఉన్నాయి. ఆనిగెపుకాయ చట్నీ, బీరకాయ చట్నీ, దోశ మీద వేసుకునే మసాలాని వంకాయ, బెండకాయ , దొండకాయ, మష్రూమ్, పన్నీర్‌తో చేస్తున్నారు. దోశపిండిలో కూడా క్యారెట్, తోటకూర, బచ్చల కూర, పాలకూర, స్వీట్‌కార్న్ కలిపి చేస్తే రుచిగా ఉంటాయి. చట్నీ కోసం వేయించే మిర్చి కూడా స్టీమ్ చేస్తున్నారు.

శిక్షణా కేంద్రం

బయట దొరికే రవ్వతో ఇడ్లీలు.. ఇతర టిఫిన్లు గట్టిగా అవుతాయి. వీటికి భిన్నంగా ఇడ్లీ రవ్వ తయారు చేస్తున్నారు మణి. ఎలా అంటారా? సేంద్రియ పద్థతిలో పండించిన రైతుల దగ్గర వడ్లు తీసుకొని మొలకెత్తిస్తున్నారు. వాటి నుంచి రవ్వ తయారుచేస్తున్నారు. ఈ రవ్వతో చేసిన ఇడ్లీలు మెత్తగా, మృదువుతో పాటు ఆరోగ్యాన్నిస్తాయి. కొర్ర, సామ, అరికె, ఊదలతో ఇడ్లీ రవ్వ, అరికె జావ పిండి, రాగి, జొన్న, సజ్జలతో కూడా ఇడ్లీ రవ్వ తయారు చేస్తారు. రాగి ఊదా రవ్వ, ఉప్నా రవ్వల తయారీని కొంతమందికి నేర్పించాలని మియాపూర్‌లో ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. నేర్చుకున్న తర్వాత జీతం కూడా ఇస్తానంటున్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సెల్: 8297920623 .

ఆరోగ్యం ముఖ్యం

బాల్యం నుంచే వంటలంటే ఇష్టం. అప్పట్లో మా ఇంట్లో చిరుధాన్యాలతోనే వంటలు తయారుచేసేవారు. ఆ అనుభవంతోనే చిరుధాన్యాలతో అల్పాహారం వెరైటీలు తయారుచేయడం ప్రారంభించాను. వచ్చిన డబ్బుతో ఇల్లు గడుస్తుంది. చిరుధాన్యాల ప్రత్యేకత తెలియజేయడం కోసం స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నాం. మా ప్రయత్నం ఫలిస్తున్నది. చాలామందిలో అవగాహన వస్తుంది. చిరుధాన్యాలకే ఎక్కవ ప్రాధాన్యం ఇస్తున్నారు. నాకు ఆదాయం కన్నా నా వినియోగదారులు ఆరోగ్యమే ముఖ్యం.
నెల్లూరి శమంతకమణి


-వనజ వనిపెంట
-వీరగోని రజనీకాంత్‌గౌడ్

mani-millet1

727
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles