మా ఇద్దరి మజిలీ ఓ మ్యాజిక్


Sun,April 14, 2019 01:58 AM

కొన్ని అడుగులకు గొప్ప మహత్తు ఉంటుంది. అవి కేవలం ప్రయాణానికి నాంది పలుకడమే కాదు మనల్ని కోరుకున్న మజిలీకి చేర్చుతాయి. కలల్ని సాకారం చేసి నవజీవనానికి బాటలు వేస్తాయి. తొమ్మిదేండ్ల క్రితం ఏమాయ చేసావె సినిమా సెట్స్‌లోకి నాగచైతన్య, సమంత వేసిన అడుగులు జీవనగమనంలో వారిని సప్తపదుల వైపు నడిపించాయి. మూడుముళ్లతో ముచ్చటైన జోడీ అంటూ దీవించాయి. దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్న ఈ జంట మజిలీ చిత్రం ద్వారా ప్రేక్షకులముందుకొచ్చారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయపథంలో పయనిస్తున్నది. ఈ సందర్భంగా నాగచైతన్య, సమంత దంపతులు జిందగీతో ప్రత్యేకంగా సంభాషించారు.
Samantha-NagaChaitanya

మీ ఇద్దరు కెరీర్‌లో ఎన్నో విజయాల్ని చూశారు. అందులో మజిలీ సక్సెస్‌కున్న ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారు?

సమంత: మజిలీ చిత్రం మా ఇద్దరి సినీ ప్రయాణంలో ఎంతో విశిష్టమైనది. పెండ్లి తర్వాత మేమిద్దరం కలిసి నటించిన తొలి చిత్రమిది. దాంతో అందరూ సినిమా కోసం ఉత్సుకతతో ఎదురుచూశారు. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే ఏదో మిరాకిల్ జరుగబోతుందని అర్థమైంది. నిర్మాణం నుంచి విడుదల వరకు ప్రతీది సానుకూలంగానే కనిపించింది. దేవుడి ఆశీస్సుల వల్ల ప్రేక్షకులు సినిమాకు గొప్ప విజయాన్ని కట్టబెట్టారు.

సమంత మీ లక్కీఛార్మ్ అని మరోసారి ప్రూవ్ అయిందంటున్నారు?

చైతన్య: లక్కీఛార్మ్ అని అభివర్ణించే కంటే సమంత నైతికంగా నాకు పెద్ద సపోర్ట్ అనుకుంటాను. విజయాలు సాధించినప్పుడు సాధారణంగా అందరూ పక్కన ఉంటారు. అయితే అపజయాలు వచ్చినప్పుడు మన పక్షాన నిలిచేవారు ఎవరన్నది చాలా ముఖ్యం. సమంత ఎలాంటి పరిస్థితుల్లోనైనా నన్ను ధైర్యాన్ని కోల్పోనివ్వదు. ప్రతీక్షణం నేనున్నాననే భరోసా ఇస్తుంది.
సమంత: చైతూకి నేను లక్కీఛార్మ్ అనడం కంటే నా పాలిట భాగ్యం చైతన్య అంటే బాగుంటుంది. పెండ్లయిన తర్వాతే నాకు అపూర్వమైన విజయాలు దక్కాయి.

మజిలీ విజయంతో సినిమాల ఎంపికలో మీ ప్రాధాన్యతలు ఏమైనా మార్చుకోవాలనుకుంటున్నారా?

చైతన్య: అలాంటిదేమి లేదు. పెండ్లయ్యాక కూడా కలిసి సినిమాలు చేయాలని ముందే నిర్ణయించుకున్నాం. అయితే మా ఇద్దరికి సరిపోయే కథ తయారుచేయాలని ఏ దర్శకుణ్ణి కోరలేదు. మజిలీ అనుకోకుండా ఓ మ్యాజిక్‌లా జరిగింది. పెళ్లయిన తర్వాత ఓ దంపతుల కథతో సినిమా చేస్తామని అస్సలు ఊహించలేదు. మంచి కథ దొరికితే తప్పకుండా ఇద్దరం కలిసి సినిమాలు చేస్తాం.

పూర్ణ పాత్రలో చైతూని చూస్తున్నప్పుడు ఏమనిపించింది?

సమంత: షూటింగ్ సమయంలోనే చైతన్య కెరీర్‌లో బెస్ట్ పర్‌ఫార్మెన్స్ మూవీ అవుతుందనుకున్నాను. పూర్ణ పాత్రలో చైతూ అద్భుతమైన నటనను కనబరిచాడు. యుక్త వయస్సు నుంచి మొదలుకొని పెండ్ల్లయిన వ్యక్తిగా రెండు భిన్నపార్శాలు కలిగిన పాత్రలో మెప్పించాడు. చైతూ పాత్రలోని పరివర్తన నాకే షాకింగ్‌గా అనిపించింది.

మీరు ప్రయోగాత్మక పాత్రలు చేస్తారా?

Samantha-NagaChaitanya2
చైతన్య: తప్పకుండా చేయాలని ఉంది. అయితే ఇప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్నాను. మరింత పరిణితి వచ్చిన తర్వాత ప్రయోగాత్మక ఇతివృత్తాలపై దృష్టిపెడతాను.
సమంత: ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాను. కానీ క్రీడా నేపథ్యంలో సినిమా చేయాలన్నది నా జీవితకాల కోరిక. దానిని తప్పకుండా నెరవేర్చుకుంటాను. శారీరక శ్రమతో కూడిన చాలెంజింగ్ రోల్స్ అంటే నాకు చాలా ఇష్టం.

శ్రావణిగా సమంత పాత్ర గురించి మీరెమంటారు?

చైతన్య: నా పాత్రలో అంతటి బలమైన ఉద్వేగాలు పండాయంటే అందుకు కారణం శ్రావణి పాత్రనే. ఈ సినిమా విషయంలో సమంత ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్‌స్క్రీన్‌లో కూడా నాకు ఎంతో మద్దతుగా నిలిచింది. సినిమా ైక్లెమాక్స్ హార్ట్‌టచింగ్‌గా అనిపించిందంటే అందుకు కారణం సమంతనే.

సినిమాలో మీరు చైతూకు బైక్ గిఫ్ట్‌గా ఇస్తారు. పెండ్లయిన తర్వాత చైతూకు మీరు ఎలాంటి బహుమతి ఇచ్చారు?

సమంత: చైతూ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్‌గా ఇచ్చాను.

సినిమా గురించి మీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?

చైతన్య: రిలీజ్‌కు ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందికి సినిమా చూపించాను. థియేటర్ నుంచి బయటకు వస్తూ వారెవరూ నాతో మాట్లాడలేదు. అందరి కళ్లలో నీటిపొరలు మాత్రం కనిపించాయి. సినిమాతో వారందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారని అర్థమైంది. ఆ తర్వాత ఉదయం ఫోన్ చేసి సినిమా గురించి అందరూ గొప్పగా చెప్పారు. ఆడియన్స్ కూడా సినిమా చూసిన వెంటనే రియాక్ట్ కావడం లేదు. ఒకరకమైన ఉద్వేగంతో ఇంటికి వెళుతున్నారు. నాన్నగారికి కూడా సినిమా చాలా ఆలస్యంగా చూపించాను. ఆయన సినిమా చూసి ఉద్వేగానికి లోనయ్యారు.

మీ ప్రతీ సినిమా విషయంలో నాన్న సూచనలు తీసుకుంటారని చెబుతుంటారు కదా?

చైతన్య: మామూలుగా అయితే సినిమా ఓకే చేసే ముందు నాన్నగారికి కథ చెబుతాను. అయితే ఈ మధ్యన నాన్నగారితో మాట్లాడినప్పుడు కథ నచ్చితే నువ్వు ప్రోసీడ్ అయిపో. నా దగ్గరకు వచ్చి కథ చెప్పాల్సిన అవసరం లేదు. కాన్ఫిడెన్స్‌తో నిర్ణయం తీసుకో అని సలహా ఇచ్చారు. మజిలీ స్క్రిప్ట్ విన్నప్పుడు ఎలాంటి సందేహాలు రాలేదు. వెంటనే ఓకే చెప్పాను. రెండో అభిప్రాయం తీసుకుందామనే ఆలోచనే రాలేదు. ఎవరికి చెప్పకుండానే మజిలీ చిత్రానికి అంగీకరించాను.

స్క్రిప్ట్ విన్నప్పుడు మీకేమైనా సందేహాలు వచ్చాయా?

సమంత: ఎక్కడో చిన్న అనుమానం కలిగింది కానీ దర్శకుడు శివ నిర్వాణ ప్రతిభపై నాకు చాలా విశ్వాసం ఉంది. దర్శకులు తమ టాలెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉండాలి. రోజూ ఎన్నో కథలు వింటుంటాం. చాలా వరకు బోర్‌గా అనిపిస్తాయి. కానీ మజిలీ కథ చెబుతున్నప్పుడు పూర్ణ, శ్రావణి పాత్రలతో వెంటనే ప్రేమలో పడిపోయాను.

మజిలీ తొలివారంలోనే యాభైకోట్ల వసూళ్ల మైలురాయిని దాటింది. మీ కెరీర్‌లోనే పెద్ద విజయమని అంటున్నారు?

చైతన్య: ఈ స్థాయిలో విజయం దక్కడం చాలా ఆనందంగా ఉంది. అయితే నేను స్క్రిప్ట్ అంగీకరించే ముందు వసూళ్ల లెక్కల గురించి అస్సలు ఆలోచించను. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకుండా ఉంటే చాలనుకుంటాను. మొదటివారంలోనే లాభల్లోకి వచ్చామంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. నాకంటే అభిమానులు కలెక్షన్స్ పట్ల ఎంతో ఆనందంగా ఉన్నారు.

సినిమా చూశాక నాగార్జునగారు ఏమన్నారు?

సమంత: మావయ్య మా ఇంటికి వస్తే ముందే చెప్పి వస్తారు. కానీ మజిలీ చూసిన తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా ఒక్కసారిగా ఇంటికి వచ్చి ఆశ్చర్యపరిచారు. సినిమా విజయాన్ని మాతో పంచుకొని ఎంతో సంతోషపడ్డారు.

సమంత నటించిన సూపర్‌డీలక్స్ సినిమా మంచి విజయాన్ని సాధించింది? అందులో సమంతను నెగెటివ్ రోల్‌లో చూస్తే మీకేమనిపించింది?

చైతన్య: సినిమా ఫస్టాఫ్ చూశాను. ఇంకా సెకండాఫ్ చూడాలి (నవ్వుతూ). తన పాత్ర గురించి సమంత నాకు ముందే చెప్పింది. దాంతో సినిమా చూసి ఎక్కువ షాక్ అవలేదు. సూపర్‌డీలక్స్ మంచి సినిమా. అలాంటి రోల్స్ చేయడానికి చాలా ధైర్యం ఉండాలి. సినిమాలోని సందేశం కూడా నాకు బాగా నచ్చింది.
సమంత: చైతూ జిమ్‌లో ఉన్నప్పుడు సూపర్‌డీలక్స్ కథ గురించి చెప్పాను. వెంటనే నావైపు అదోలా చూశారు. ఈ సినిమా చేస్తున్నావా? సరే చేయి అంటూ నవ్వి ఊరుకున్నాడు.

ఏదైనా సినిమా చేయొద్దని చైతన్య సలహా ఇస్తే దానికి మీరు ఒప్పుకొంటారా?

సమంత: చైతూ ఎప్పుడూ అలాంటి సలహాలు ఇవ్వరు. పెండ్ల్లయిన తర్వాత కథాంశాల ఎంపికలో నాకు స్పష్టత వచ్చింది. నేను తెరపై ధైర్యంగా కనిపిస్తున్నానంటే చైతూనే కారణం అనుకుంటున్నాను. పెండ్ల్లయిన తర్వాత తెలియని శక్తి నాలో ప్రవేశించిందనిపిస్తున్నది. ఎలాంటి పాత్రనైనా గతంలో కంటే కాన్ఫిడెంట్‌తో చేయగలుగుతున్నాను.

సమంతకు తమిళ చిత్రసీమలో మంచి స్టార్‌డమ్ ఉంది. మీరు అటువైపు ప్రయత్నాలు చేసే ఆలోచన ఏమైనా ఉందా?

చైతన్య: నాకు తమిళ సినిమాలు అంటే చాలా ఇష్టం. చెన్నైలో చాలాకాలం పెరిగాను. అప్పుడు తమిళ సినిమాలు చూసేవాణ్ణి. అయితే భవిష్యత్తులో ఎక్కడ సినిమాలు చేసిన నా హృదయం మాత్రం తెలుగు చిత్రసీమలోనే ఉంటుంది. ఇక్కడే ఎంతో ఆకలిగా ఉన్నా. ఇంకా ఎన్నో హిట్స్ ఇవ్వాలనుకుంటున్నా. తమిళ సినిమాల గురించి కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచిస్తాను.
సమంత: మజిలీ చిత్రం చెన్నైలో కూడా బాగా నడుస్తున్నది. అక్కడి ప్రేక్షకులు కూడా మా ఇద్దరిని ఆదరించారు.

ఈ మధ్యన రీమేక్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నట్టున్నారు?

సమంత: అవును. మొన్న యూ టర్న్ చేశాను. ప్రస్తుతం 96 చేస్తున్నాను. వాస్తవానికి రీమేక్ సినిమాలంటే కొంచెం రిస్క్. అయితే కథలు నచ్చడం వల్ల రీమేక్‌లు చేయాల్సి వస్తున్నది. సాధారణంగా కథానాయికలకు బలమైన పాత్రలు దొరకడమే తక్కువ. 96లో హీరోయిన్ పాత్ర హృదయాల్ని హత్తుకునేలా ఉంటుంది.

సమ్మర్ వెకేషన్స్‌కు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?

Samantha-NagaChaitanya1
చైతన్య: ప్రస్తుతం వెంకీమామ షూటింగ్‌లో ఉన్నాను.
మే నెల మొదటివారంలో టూర్ ప్లాన్ చేస్తున్నాం.
సమంత: తప్పకుండా మాకు విశ్రాంతి కావాలనిపిస్తున్నది. ఈ మధ్యకాలంలో వరుస షూటింగ్‌లతో చాలా ఒత్తిడిగా ఫీలయ్యాను.

చైతూ కెరీర్‌ను పరిశీలిస్తే నటుడిగా ఆయనలో మీరు గమనించిన మార్పులేమిటి?

సమంత: ఏ మాయ చేశావె చిత్రం నుంచి మొదలుకొని ఇప్పటివరకు మా ఇద్దరి కెరీర్‌లను పరిశీలించి చూస్తే నటులుగా ఎంతో పరిణితి సాధించాం. కాలక్రమంలో మన వ్యక్తిత్వాలు మారుతుంటాయి. అది తెరపై నటనలో కూడా కనిపిస్తుంది. చైతన్య నటుడిగా గొప్పగా ఎదిగాడు. నాకు తెలిసిన చైతన్య స్క్రీన్‌మీద ఎందుకు కనిపించడం లేదు అని ఎప్పుడూ ఒక బాధ ఉండేది. బయటి ప్రపంచంలో చైతూ ప్రవర్తించే విధానం, అతని వ్యక్తిత్వం అద్భుతమనిపిస్తాయి. ఆ లక్షణాలు ఎక్కువగా తెరపై ఆవిష్కృతం కాలేదు. ఇప్పుడు నాకు తెలిసిన చైతూను తెరపై చూస్తున్నాను. తన నిజమైన వ్యక్తిత్వాని చైతన్య స్క్రీన్ మీద ప్రదర్శిస్తున్నాడు.

బంగార్రాజు చిత్రంలో మీరు నటించబోతున్నారా?

చైతన్య: అవును. నాన్నతో కలిసి సినిమా చేస్తున్నాను. జూలైలో సెట్స్‌మీదకు వెళ్తుందనుకుంటున్నాను.

ఏ మాయ చేశావె షూటింగ్ టైమ్‌లో తొలిసారి చైతూని చూసినప్పుడు మీకేమనిపించింది?

సమంత: చైతన్య అప్పుడు, ఇప్పుడూ కూడా ఇన్నోసెంటే (నవ్వుతూ). తొలిసినిమా కాబట్టి అప్పటికి నేను తెలుగు నేర్చుకోలేదు. స్క్రిప్ట్‌తో కుస్తీ పట్టడమే సరిపోయింది. ఎవరి గురించి ఆలోచించలేదు.
చైతన్య: ఏ మాయ చేశావె షూటింగ్‌కు ముందు సమంత ఫోటోలు నాకు చూపించారు. ఫొటో చూడగానే..అమ్మాయి చాలా అందంగా ఉందనిపించింది. ఆ తర్వాత మా ఇద్దరికి కలిపి చెన్నైలో లుక్ టెస్ట్ చేశారు. అదంతా మధురానుభూతులతో కూడిన ప్రయాణం.

మన్మథుడు-2లో మీరు ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారని తెలిసింది?

సమంత: అవును. ఆ సినిమా విశేషాల్ని తర్వాత మీతో పంచుకుంటాను.

- కళాధర్‌రావు
-సిఎం. ప్రవీణ్

516
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles