మా అమ్మాయి ప్రమాదంలో ఉందా?


Wed,July 19, 2017 12:47 AM

మా అమ్మాయి వయసు 20 సంవత్సరాలు. మెదడుకు టీబీ సోకింది. తరచుగా ఫిట్స్ వస్తుంది. జ్వరం కూడా వస్తూనే ఉంది. మా అమ్మాయి ప్రాణాలకు ప్రమాదమా? తను తిరిగి కోలుకుంటుందా? ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలు తెలియజేయగలరు.
రాంబాబు, నర్సంపేట

shutterstock
టీబీ ఇప్పటికీ మనదేశంలో ఎక్కువగానే కనిపిస్త్తూనే ఉంది. సాధారణంగా టీబీ ఊపిరితిత్తులకు వస్తుంది. దీనికి 6 నెలల కోర్సు మందులు వాడితే నయమవుతుంది. అయితే ఇది శరీరంలోని ఏ భాగానికైనా సోకవచ్చు. ఊపిరితిత్తులకు టీబీ సోకిన వారు మందులు పూర్తిగా వాడకుండా నిర్లక్ష్యం చేస్తే అది ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. మెదడుకు టీబీ సోకడం చాలా ప్రమాదకరం. ఒకసారి ఇది మెదడుకు పాకితే తీవ్రమైన తలనొప్పి, మెడనొప్పి, వాంతులు, మూర్చ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి కోమాలోకి కూడా పోవచ్చు. తలకి స్కానింగ్, లాంబార్ పంక్చర్ అనే పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. చాలా మందిలో బాక్టీరియా కనిపించదు. లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభిస్తారు.

ఒకసారి మందులు వాడడం ప్రారంభించాక అవి పనిచేయడానికి మూడు నుంచి నాలుగు వారాల వరకు సమయం పట్టవచ్చు. అయితే అంతలోగా మెదడులో మార్పులు జరిగి కణాలు దెబ్బతినడం, ఫిట్స్‌రావడం జరుగవచ్చు. మెదడులోని నీరు బయటికి వెళ్లే దారి మూసుకుపోవడం వల్ల నీరు ఎక్కువగా చేరి మెదడులో ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి సందర్భాల్లో వీపీ షంట్ పద్ధతిలో నీరు తొలగించాల్సి ఉంటుంది. మెదడు టీబీకి దీర్ఘకాలిక చికిత్స అవసరమవుతుంది. దాదాపుగా 2 సంవత్సరాల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎడీఆర్ టీబీ అయితే ఎనిమిది రకాల మందులు కూడా వాడాల్సి రావచ్చు. మీ అమ్మాయిలో టీబీ ఏ స్థాయిలో ఉందో తెలిస్తే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చికిత్సను నిర్లక్ష్యం చెయ్యకూడదు. డాక్టర్ సూచనల మేరకు చికిత్స పూర్తి స్థాయిలో తీసుకుంటే మీ అమ్మాయి కోలుకునేందుకు అవకాశాలు పూర్తిగా ఉంటాయి.
drmurali

348
Tags

More News

VIRAL NEWS