మార్పిడి తప్పనిసరా?


Mon,March 4, 2019 01:43 AM

నా వయసు 58సంవత్సరాలు. ప్రభుత్వశాఖలో ఇంజినీరుగా పనిచేస్తున్నాను. గత 20 ఏండ్లుగా మద్యం అలవాటు ఉంది. రెండేండ్ల కిందట తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాను. కాలేయం దెబ్బతిన్నది. మద్యం మానేయమన్నారు. ఇంకా తాగితే కాలేయ మార్పిడి చికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. తగ్గించాను కానీ పూర్తిగా మానలేకపోయాను. ఇటీవల తరచూ నీరసంగా ఉంటుంది. నిద్ర ఎక్కువ అయ్యింది. నోటికి రుచించక తిండి సరిగా తినలేకపోతున్నాను. పదవీ విరమణకు ప్రత్యేక విజ్ఞప్తి చేసుకుంటే మా సొంత ఊరికి బదిలీ చేశారు. ఇప్పుడు ఆ సర్జరీ చేయించుకోవచ్చా? దానివల్ల నా ఆరోగ్యం పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందా? ఆ ఆపరేషన్‌లో సమస్యలేమైనా ఉంటాయా? దయచేసి వివరంగా తెలపండి.?
- ఏ. వేణుగోపాల్‌రావు, నిజామాబాద్

Livertransplantation
మితిమీరిన మద్యపానం వల్ల మీ కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నట్లుంది. కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి సరిచేసుకోవడానికి వ్యక్తికి చాలా అవకాశం ఇస్తుంది. మద్యపానం వంటి అలవాట్ల వల్ల దెబ్బతిన్న తొలిదశలో యధావిధిగా పనిచేస్తుంది. కానీ నిర్లక్ష్యం చేసి, నష్టం కలిగించే అలవాటును మానకపోతే పరిస్థితి పూర్తిగా దిగజారినప్పుడు హఠాత్తుగా కుప్పకూలిపోతుంది. మీరు చెప్పిన దానిని బట్టి రెండేండ్ల క్రితమే మీ కాలేయం ఆ స్థితికి దగ్గరగా వెళ్ళింది. బహుశా సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంటుంది. వెంటనే డాక్టర్‌ను కలవండి. వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దానిని మూడు స్థాయిలుగా గుర్తిస్తారు. వీటిని ఏ,బి,సి. చైల్డ్ పగ్ స్టేజెస్ అంటున్నారు. ఏ చైల్డ్ స్థాయిలోనే డాక్టర్ వద్దకు వెళ్లగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్స చేసి పూర్తి కాలేయాన్ని సాధారణ పరిస్థితికి తీసుకు రావచ్చు. మొదటి రెండు(ఏ, బి చైల్డ్ స్టేజెస్)స్థాయిల్లోనూ చాలావరకు తిరిగి కోలుకోవడానికి కాలేయం అవకాశం ఇస్తుంది. బి, సి స్థాయిల్లో వస్తే వ్యాధి తీవ్రత,వ్యక్తి తట్టుకోగల శక్తిని అంచనావేసి కాలేయ మార్పిడిని సిఫార్సు చేస్తారు.

మీరు తెలిపిన వివరాలు, లక్షణాల ప్రకారం రెండేండ్ల క్రితమే మీ కాలేయ వ్యాధి బి స్థాయికి చేరుకున్నది. మద్యం మానకపోవడం వల్ల అది చివరి దశ ప్రారంభంలోకి ప్రవేశించినట్లు ఉన్నది. ఇప్పుడు మద్యం పూర్తిగా మానివేయడంతోపాటు కాలేయ మార్పిడి ఒక్కటే మిమ్మల్ని కాపాడగలదు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి మీరు ఆందోళన పడాల్సిన పనిలేదు. కాలేయ వ్యాధుల చికిత్స ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో ఆధునికతను సంతరించుకున్నది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శక్తివంతమైన మందులు, ఖచ్చితమైన శస్త్రచికిత్సలు, కాలేయ మార్పిడి సర్జరీలు అత్యధిక శాతం విజయవంతమవుతుండడం కాలేయ వ్యాధుల నుంచి నమ్మకమైన ఉపశమనం కలిగిస్తున్నాయి. వేల కొలది కాలేయ మార్పిడి చికిత్సలు చేసిన అనుభవం కలిగిన సర్జన్లు తెలుగు రాష్ర్టాల్లో స్థానికంగా అందుబాటులో ఉంటున్నారు. దీనివల్ల ఈ శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని వైద్య సంస్థలు, ఆసుపత్రులతో పోలిస్తే దాదాపు సగానికి తగ్గుతున్నది. అందువల్ల ఇక ఆలస్యం చేయకుండా మరోసారి డాక్టర్‌ను కలిసి కాలేయ మార్పిడి చికిత్సకు సిద్ధం కండి.

-డాక్టర్. పి. బాలచంద్రన్ మీనన్
- సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

977
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles