e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home జిందగీ మహిళా లోకానికి..డాక్టరు బాబునే!

మహిళా లోకానికి..డాక్టరు బాబునే!

మహిళా లోకానికి..డాక్టరు బాబునే!

సినిమా హీరోలు, క్రికెటర్లకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండటం మామూలే. కానీ ఓ సీరియల్‌ స్టార్‌ను తమ ఇంటి మనిషిలా అభిమానించడం అరుదైన విషయం. కుటుంబ కథా సీరియల్స్‌తో రాణిస్తూ,ప్రతిభ ఉంటే టెలివిజన్‌ ద్వారా కూడా అశేష అభిమాన గణాన్ని సంపాదించుకోవచ్చని నిరూపిస్తున్నారు నిరుపమ్‌ పరిటాల. నటుడిగా నే కాకుండా, చాలామంది ఓ కొడుకులా ఆదరిస్తూ , ఆశీర్వదిస్తున్నారంటూ తన అనుభవాలను ‘జిందగీ’తో ఇలా పంచుకున్నారు నిరుపమ్‌..

పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. ‘అదే చేస్తా, ఇది మాత్రం చేయను’ అని గిరిగీసుకుని కూర్చుంటే కుదరదు. మాది విజయవాడ. పెరిగింది, చదువుకుంది చెన్నై, గుడివాడలలో. తెలుగువారికి సుపరిచితులైన మాటల రచయిత, నటుడు ఓంకార్‌ మా నాన్న. అమ్మ లెక్చరర్‌. నేను మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకునేది. నాన్నకూడా నేను నటుడిని అవుతానని అనుకోలేదు. ఇంజినీరింగ్‌ పూర్తవుతున్న దశలో ‘సినిమాల్లో నటించాలని ఉంది’ అని చెప్పాను. ముందు బుద్ధిగా చదువు పూర్తి చేయమన్నారు నాన్న. చదువయ్యాక, కొంత టైమ్‌ పెట్టుకుని ప్రయత్నించమని సలహా ఇచ్చారు. అప్పటికి సీరియల్స్‌లో బిజీగా ఉన్నా, నాకోసం చెన్నైనుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్‌ కావడానికి సిద్ధపడ్డారు. కానీ, బయలు దేరడానికి రెండురోజుల ముందే హార్ట్‌ ఎటాక్‌తో ఆయన చనిపోయారు.

- Advertisement -

నా సక్సెస్‌ను నాన్న చూడలేక పోయారనే బాధ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఈటీవీ ‘చంద్రముఖి’ సీరియల్‌తో నా కెరీర్‌ ప్రారంభమైంది.సినిమాల్లో చేయాలని..నటనను కెరీర్‌గా ఎంచుకున్నప్పుడు సినిమాలే లక్ష్యంగా పెట్టుకొన్నా. సీరియళ్ళ ఆలోచన లేదు. నాన్నగారు రెండు మూడుసార్లు సీరియళ్ళలో చేయమని అడిగినా చేయలేదు. సినిమా అవకాశాల కోసం కొన్నాళ్ళు ప్రయత్నించా. అప్పుడే ‘చంద్రముఖి’లో అవకాశం వచ్చింది. సినిమా, సీరియల్‌ అనికాదు కానీ, ఎలాగోలా ముందు తెరమీదకు రావాలన్న బలమైన కోరిక ఉండేది. ఆ సీరియల్‌ నా కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. మొదటి సీరియల్‌తోనే అనుకున్న దానికంటే ఎన్నో రెట్ల గుర్తింపు, ఆదరణ లభించాయి. ‘చంద్రముఖి’ సీరియల్‌లో నాకు జతగా నటించిన మంజులనే పెండ్లి చేసుకున్నా. సీరియల్స్‌ చేస్తున్నప్పుడు ఓ సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. తర్వాత, అల్లరి నరేష్‌ ‘ఫిట్టింగ్‌ మాస్టర్‌’లో నెగెటివ్‌ రోల్‌ చేశా. సినిమా ఆడకపోవడంతో అంతగా గుర్తింపు రాలేదు. చొరవగా చొచ్చుకుపోయే మనస్తత్వం కాదు నాది. నాన్నగారికి ఉన్న పేరువల్ల ఎవరి దగ్గరకూ వెళ్ళి అవకాశం ఇవ్వమని అడగాలనిపించదు. కానీ, మంచి పాత్రలు వస్తే సినిమాల్లో చేయాలని ఉంది.

నాన్న బాటలో…
రచయితగా నాన్న దాదాపు ముప్పై సినిమాలకు, యాభై సీరియళ్ళకు పనిచేశారు. నాకూ డైలాగ్స్‌ రాయడం అంటే ఆసక్తి. ‘నెక్ట్స్‌ నువ్వే’ సినిమాకి మాటలు అందించా. నేను నటించే సీరియళ్ళలోనూ కొన్ని సందర్భాల్లో డైలాగ్స్‌ రాస్తుంటా. ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం’తోపాటు జీ తెలుగు ‘హిట్లర్‌గారి పెళ్ళాం’ సీరియల్‌ చేస్తున్నా. కృష్ణకాంత్‌ అనే ఫ్రెండ్‌తో కలిసి ‘హిట్లర్‌గారి పెళ్ళాం’కు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నా. నటించడం అంటే, షూటింగ్‌ వరకు చూసుకుంటే సరిపోతుంది. కానీ, నిర్మాణం అనేది పెద్ద బాధ్యత. ప్రస్తుతం టెలివిజన్‌ రంగం బాగానే ఉన్నా, భవిష్యత్‌ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడంతా వెబ్‌ హవా నడుస్తున్నది. ముఖ్యంగా సీరియల్స్‌ అంటే మహిళలకు మాత్రమే అనే ముద్ర పడిపోయింది. యూత్‌ అంతా వెబ్‌ సిరీస్‌పై ఆసక్తి చూపుతున్నారు. అందుకే, వెబ్‌పైనా దృష్టి పెట్టాలనుకుంటున్నా. పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికను మార్చుకుంటూ, ముందుకు సాగాలనేది నా అభిమతం.

అలా చూడలేమన్నారు..
‘చంద్రముఖి’ తర్వాత పది సీరియళ్ళలో నటించా. దాదాపు అన్నిట్లోనూ పాజిటివ్‌ పాత్రలే చేశాను. అయితే, ఈటీవీలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’లో కాస్త నెగెటివ్‌ షేడ్‌ ఉన్న రోల్‌లో నటించా. ఆ సమయంలో అభిమానులు నన్ను నెగెటివ్‌ పాత్రల్లో చూడలేమన్నారు. అందుకే, ఆ ప్రయత్నాలు చేయడం లేదు. ‘కార్తీక దీపం’ సీరియల్‌లోని డాక్టర్‌ బాబు పాత్రకు విశేషమైన ఆదరణ లభిస్తున్నది. డాక్టర్‌ బాబుగానే గుర్తిస్తున్నారంతా. రోజూ కొన్ని వేల మెసేజ్‌లు వస్తుంటాయి. మీమ్స్‌, కామెంట్స్‌ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. కొందరైతే తిడతారు, బెదిరిస్తారు. ఓ సీరియల్‌ని అంత పర్సనల్‌గా తీసుకుంటున్నందుకు ఆశ్చర్యమేస్తుంది. సినిమా పెద్దలు, రాజకీయవేత్తలు కూడా ఫోన్‌ చేసి అభినందిస్తుంటారు. ఓసారి బ్రహ్మానందం గారు ఫోన్‌ చేసి మెచ్చుకున్నారు. చిరంజీవి అమ్మగారు ఓ కొడుకులా ఆదరిస్తారు. అంతేకాదు, ప్రతి వేసవికి మామిడిపండ్లు పంపిస్తారు. ఇటీవలే ఓ సంస్థ ఇమ్యూనిటీ బూస్టింగ్‌ బిస్కెట్‌ని లాంచ్‌ చేయడానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఇలాగే ఎప్పుడూ అందరి అభిమానంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా.

-ప్రవళిక వేముల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మహిళా లోకానికి..డాక్టరు బాబునే!
మహిళా లోకానికి..డాక్టరు బాబునే!
మహిళా లోకానికి..డాక్టరు బాబునే!

ట్రెండింగ్‌

Advertisement