మహావిజ్ఞాని మళ్లీ పుట్టాలి!


Tue,February 26, 2019 01:43 AM

సర్ సి. వి. రామన్‌కు భారతజాతి సెల్యూట్ చేస్తున్నది

విజ్ఞానులు ఎప్పుడూ పుడుతుంటారు. కానీ, మహావిజ్ఞానులు, మహానుభావులు ఎప్పుడో కానీ పుట్టరు. విజ్ఙానశాస్త్రం (సైన్స్)లో మన మొట్టమొదటి నోబెల్ పురస్కార గ్రహీత, జాతి యావత్తూ గర్వించదగిన భారతరత్నమైన మహావిజ్ఞాని సర్ సి.వి.రామన్ ప్రపంచానికంతటికీ ఆదర్శవంతమైన విజ్ఞానకాంతి మానవుడు. కాంతి వ్యాప్తీకరణ (Light Scattering) రహస్యాన్ని శోధించి, ఛేదించిన భారతీయ అగ్రశ్రేణి మేధావి ఆయన. తన పేరుకు ముందు సర్ అన్న సంబోధనే వారికిచ్చే అత్యున్నత గౌరవానికి సూచన. ఇటువంటి వారివల్లే విజ్ఞానజ్యోతులు భూమిపై ప్రజ్వరిల్లుతుంటాయి.
C.V.-Raman
సర్ సి.వి.రామన్ పేరు వింటేనే విజ్ఞానశాస్త్ర అభిమానుల హృదయాలు పులకిస్తాయి. ఆయనకు భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్‌ను అందించిన రామన్ ఎఫెక్ట్ ఆవిష్కృతమైన ఫిబ్రవరి 28ని భారతదేశం జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం (నేషనల్ సైన్స్ డే)గా గత 37 సంవత్సరాలుగా జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ప్రత్యేక ఇతివృత్తాలతో విజ్ఞానశాస్త్ర స్పృహను, పరిశోధనల ప్రాధాన్యాన్ని ప్రజలలో పెంపొందింపజేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోనూ విశేషరీతిలో వేడుకలు జరుగుతుంటై. ఈ ఏడాది ప్రజలకోసం సైన్సు, సైన్స్‌కోసం ప్రజలు అంశాన్ని ప్రకటించారు.


సి.వి.రామన్ వంటి వారిని కన్నందుకు మన నేలతల్లి సైతం గర్వంతో తలెత్తుకుంటున్నది. వారే మానవజాతికి తలమానికంగానూ నిలుస్తారు. రామన్ కాంతి వ్యాప్తీకరణ రహస్యాన్ని ఛేదించిన విధానం ఆశ్చర్యకరం. ఆ స్ఫూర్తిలో ఇసుమంతైనా మన భారతీయులంతా పుణికి పుచ్చుకోగలిగితే మరెన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఆయనకు నోబెల్ పురస్కారం లభించి (1930లో) ఇప్పటికి 89 సంవత్సరాలు అవుతున్నవి. వారి అద్భుత ఆవిష్కరణ (రామన్ ఎఫెక్ట్) ఆవిర్భవించిన రోజు (ఫిబ్రవరి 28)ను నేషనల్ సైన్స్ డేగా గుర్తించాలని 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యునికేషన్ (ఎన్‌సిఎస్‌టిసి) ప్రభుత్వానికి నివేదించడంతో మరుసటి ఏడాది (1987) నుంచి ఈ వేడుకను దేశమంతా జరుపుకుంటున్నాం. ఈ మేరకు ప్రతీ ఏడాది విద్య, పరిశోధనా సంస్థలు, రేడియో, టీవీలలో ఇంకా అనేక చోట్ల సైన్స్ డే వేడుకలు పోటెత్తి పోతుంటాయి. బహిరంగ సభలలో అధికారులు, ప్రజా నాయకులు, ప్రముఖుల ప్రసంగాలు, విజ్ఞానశాస్త్రీయ అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, బహుమతి ప్రదానాలు, చలనచిత్రాలు, ప్రత్యేక వైజ్ఞానిక ప్రదర్శనలు, ప్రత్యక్ష నిరూపణలు, సైన్సు నమూనా ప్రయోగాలు వంటి అనేక కార్యక్రమాలు విధిగా జరుగుతుంటాయి.


C.V.-Raman1
అయితే, మొక్కుబడిగా, లాంఛనంగా చేసే పనులకు, చిత్తశుద్ధితో స్ఫూర్తిదాయకంగా ఉండేలా చేసే కార్యక్రమాలకు చాలా తేడా ఉంటుంది. మనం రెండో రకంవైపు నిలబడినప్పుడే వాటికి సార్థకత లభిస్తుంది. దేశంలో ఎందరో శాస్త్రవేత్తలు, మేధావులూ ఉండగా, కేవలం ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చిన రోజునే జాతీయ సైన్సు దినోత్సవం మనమెందుకు జరుపుకుంటున్నాం? మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడేళ్లకు 1954లో అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను వ్యవస్థాపితం చేసుకున్న తొలి ఏడాదే, ఆ గొప్ప గౌరవంతో జాతి, వారిని ఎందుకు గుర్తించింది? ఎపిజె అబ్దుల్ కలాం, అమర్త్యసేన్, సిఎన్‌ఆర్ రావు వంటివారి కన్నా ముందే రామన్‌ను దేనికోసం మనం గౌరవించుకుంటున్నాం? ఇవాళ ప్రపంచమే మెచ్చదగ్గ మహామేధావిగా ఆయన ఎలా ఎదగగలిగారు? ఏమిటి వారిలోని గొప్పతనం? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోగలిగితే వారిపట్ల మనలోని ఆరాధనా భావం అంతకంతకూ పెరుగుతుంది.


సర్ చంద్రశేఖర్ వెంకట రామన్ (7 నవంబర్ 1888- 21 నవంబర్ 1970) ఒక సామాన్య వ్యక్తి నుంచి అనూహ్య మేధావిగా, అసాధారణ ఆదర్శవంతునిగా ఎదగడం వెనుక వారి అనితర సాధ్యమైన కృషి, పట్టుదల నిక్షిప్తమై ఉన్నాయి. వారి జీవితం ఎంత తెరిచిన పుస్తకమో అంత స్ఫూర్తిదాయకం కూడా. 11 ఏండ్ల వయసులోనే మెట్రిక్యులేషన్, 13 ఏండ్లకే ఎఫ్‌ఎ (ప్రస్తుత ఇంటర్మీడియట్, పియుసిపిడిసి, 10+2కు సమానం) ఉత్తీర్ణుడైన ఆయన చిన్నతనం నుంచీ 82 ఏండ్ల వయసులో మరణించే దాకా జీవితాన్ని ఏనాడూ ఆయన తేలిగ్గా తీసుకోలేదు. మేథమెటిక్స్, ఫిజిక్స్‌లలో లెక్చరర్ అయిన తండ్రి సి. రామనాథన్ అయ్యర్ అడుగుజాడల్లోనే పెరుగుతూ, ఆయన పనిచేసిన అప్పటి మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజ్‌లోనే 1902లో చేరారు.


అంతకంటే ముందు విశాఖపట్నంలోని సెయింట్ అలోషియస్ (Aloysius) ఆంగ్లో ఇండియన్ హైస్కూల్‌లో చదివారు. 1904లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ. ఆర్ట్స్ చదివి, ఫిజిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. 1907లో అదే విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ సైన్సెస్‌లో అత్యున్నత స్థాయిలో ఉత్తీర్ణుడైనాడు. ఎదిగే కొద్దీ ఒదగాలని, కన్నతల్లి వంటి మాతృదేశానికే ఆజన్మాంతం మనం సేవకులుగా ఉండాలని, విజ్ఞాన పరిశోధనలే ప్రజలకు దారిచూపే దిక్సూచులని సర్ సి.వి.రామన్ జీవిత విశేషాలను తెలుసుకొంటే అర్థమవుతుంది. సైన్సు అధ్యయనాలే ఆయనకు నిరంతర వ్యాపకమైనాయి. తన వెంట ఎప్పుడూ ఒక చిన్నసైజు స్పెక్ట్రోస్కోప్ (వర్ణపట దర్శిని) ఉండేది. 1917లో రామన్ ప్రభుత్వ సర్వీసు నుంచి తప్పుకొన్నాక యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలో భౌతికశాస్త్రంలో తొలి పాలిత్ (Palit) ప్రొఫెసర్‌గా నియమితులైనారు. ఉద్యోగాలలోనూ తన అధ్యయనాలను ఆయన ఎప్పుడూ ఆపలేదు. ఆఖరకు మరణావస్థలోనూ ఆయన విజ్ఞానశాస్త్ర వృత్తి సంబంధ విషయాలపట్లనే దృష్టిని లగ్నం చేశారు.


అప్పట్లో ఉద్యోగపరంగా అదొక స్వర్ణయుగమని తానే అభివర్ణించే వారు. 1926లోనే తన అభిరుచి మేరకు ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ పత్రికను స్థాపించి, దానికి తొలి సంపాదకులుగా వ్యవహరించారు. ఇందులోని రెండో వాల్యూమ్‌లోనే రామన్ ఎఫెక్ట్ సిద్ధాంత నివేదికను ఎ న్యూ రేడియేషన్ పేరున (సుప్రసిద్ధ పరిశోధనా వ్యాసం) ప్రచురించారు. తన విద్యార్థి కె.ఎస్.కృష్ణన్‌తో కలిసి సర్ సి.వి.రామన్ నిర్వహించిన ప్రయోగ ఫలితమే రామన్ ఎఫెక్ట్. కాంతి వ్యాప్తీకరణ సిద్ధాంత ఆవిష్కరణ ఎంత గొప్పదో మరో రెండేండ్ల (1930)కే ఆయనను నోబెల్ ప్రైజ్ వరించడంతో తేటతెల్లమైంది. కాంతి పరిమాణ స్వభావంపై మరింత శాస్త్రీయాధారాన్ని అది అందించింది. తనతో ఎంతో సంక్లిష్టమైన వృత్తి సంబంధాన్ని కలిగి ఉన్న కృష్ణన్ ఆశ్చర్యకరంగా నోబెల్ అవార్డును వారితో పంచుకోకున్నా తన నోబెల్ ప్రసంగంలో చాలా ప్రముఖంగా ఆయన గురించి వారు ఉదహరించడం గమనార్హం. వరించి వచ్చిన ప్రపంచ ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని దేశం పట్ల ప్రేమతో తృణప్రాయంగా వదిలిన సర్ రామన్ ఉత్తమ వ్యక్తిత్వం, ఉత్తేజభరితమైన పరిశోధనా దృష్టి, ఉదాత్త జీవితం ప్రతీ భారతీయునికీ గొప్ప స్ఫూర్తి సంపద.


sky

నీలవర్ణానికి మూలం

స్వచ్ఛమైన సాగరజలాలు ముదురు నీలవర్ణంలో కనిపించడానికి మూలం కాంతి వ్యాప్తీకరణ స్వభావమేనని సర్ సి.వి.రామన్ మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. అదే రామన్ ఎఫెక్ట్‌గా ప్రసిద్ధం. కాంతి కిరణాలు నీరు వంటి ద్రవాలపై పడిన కొన్ని కాంతి కణాలు ఎలా పరివ్యాప్తం (పరిక్షేపం) చెందుతాయన్న దానిని ఆయన శాస్ర్తోక్తంగా నిరూపించారు. ఆకాశంలోని నీలవర్ణానికి తోడు కాంతిలోని నీలం రంగు పరిక్షేపం చెందడం వల్లే సాగరజలాలు అలా ముదురు నీలవర్ణంలో కనిపిస్తాయని ఆయన తేల్చారు. కొన్ని కాంతికణాల తరంగదైర్ఘ్యంలో ఆ వేళ వచ్చే ఒక మార్పు పర్యవసానమే ఇదన్న సంగతి అప్పుడే తొలిసారిగా ప్రపంచానికి తెలిసివచ్చింది.
-దోర్బల బాలశేఖరశర్మ

735
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles