మన మ్యూజిక్ మ్యాస్ట్రో..!


Wed,December 19, 2018 01:18 AM

అతడి పాటల్లో పల్లెదనం ఉట్టి పడుతుంది. ఆ సంగీత స్వర ఝురికి ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. కమ్మనైన అమ్మపాట, నాన్న త్యాగాల బాట కన్నీరు తెప్పిస్తుంది. బావా మరదళ్లసరస గీతం వీనులకు వినసొంపుగా ఉంటుంది. ఆధ్యాత్మిక స్వరం.. భక్తిలోకంలో విహరింపజేస్తుంది. పల్లెపదమే జానపదమై ఘల్లు ఘల్లున గుండెతో తాళం వేయిస్తుంది. అంతటి మహత్తు కలిగిన సంగీత స్వరం యశో కృష్ణ సొంతం. ఆ సంగీత ప్రతిభా పాటవాలే జాతీయస్థాయి అవార్డు అందుకునేలా చేశాయి. సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న మన వరంగల్ ముద్దు బిడ్డ యశోకృష్ణ పరిచయం ఈ వారం యువ ముఖ్యకథనం.
Krishna
వరంగల్ జిల్లా నర్సక్కపల్లెలో కోడికంటే ముందేలేచి.. పాలేర్లతో పాటు ఊరు దాటేది గోరంట్ల కృష్ణ ఒక్కడే. పొద్దుగాల నాలుగింటికే నర్సక్కపల్లె నుంచి సైకిలెక్కి పరకాల చేరుకునేది. అక్కడ ఫస్ట్‌బస్సెక్కి హన్మకొండ చేరుకునేది. అక్కడి నుంచి ఖాజీపేట్‌కు బస్సు/ ఆటోలో ప్రయాణం. ఖాజీపేట రైల్వేస్టేషన్‌లో హైదరాబాద్ ట్రైన్ ఎక్కేవాడు. సికింద్రాబాద్‌లో దిగి సిటీ బస్కెక్కి రామంతపూర్ చేరుకునే సమయానికి ఉదయం పది, పదకొండు అయ్యేది. అక్కడ సంగీతం నేర్చుకొని మధ్యాహ్నం 3.30కు బయల్దేరితే.. ఇంటికి చేరుకునే సరికి రాత్రి 11, ఒక్కోసారి అర్ధరాత్రి 12 గంటలయ్యేది. తెల్లారి మళ్లీ.. నాలుగింటికే సైకిలెక్కాల్సిందే. సంగీతమంటే అంతటి పిచ్చి ప్రేమ, సంగీత దర్శకుడు అవ్వాలనే తపన, పట్టుదల ఉంది కాబట్టే.. నేడు జాతీయస్థాయి అవార్డు అందుకోగలిగాడు. ఎక్కడి గోరంట్ల కృష్ణాకర్.. ఎక్కడి యశో కృష్ణ.. సినిమా వాళ్లను చూడడమే గగనం అనుకునే స్థాయి నుంచి వారితో పాటలు పాడించే స్థాయికి ఎదిగాడు మన ఓరుగల్లు బిడ్డ.

కృష్ణను వరించిన జాతీయ అవార్డు

సంగీత దర్శకుడిగా సినిమాలు, జానపదాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేశాడు కృష్ణ. ఈ క్రమంలో ఎన్నో అద్భుతమైన పాటలు అందించాడు. పల్లెపాటలు, జానపదాలు, ఉద్యమ గీతాలు నేటికీ ప్రజల గొంతుల్లో తియ్యటి రాగమై జాలువారుతున్నాయి. సంగీతంలో యశో కృష్ణ చేస్తున్న కృషికిగాను.. ఢిల్లీకి చెందిన భారతీయ దళిత్ సాహిత్య అకాడెమీ వారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డుకు యశో కృష్ణను ఎంపిక చేశారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా 2వేలకు పైగా పాటలను స్వరపరిచినందుకు ఈ అవార్డు వరించింది. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో ఆర్ట్స్ అండ్ కల్చర్ 34వ జాతీయ సదస్సులో యశో కృష్ణకు దళిత సాహిత్య అకాడెమీ జాతీయ అధ్యక్షుడు సుమనాక్షర్ అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డుకు యశో కృష్ణను ప్రతిపాదించడంలో ఆ సంస్థ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ జితేందర్ మను ఎంతో కృషి చేశారు.

ఇదీ కృష్ణ ప్రస్థానం..

కృష్ణ తండ్రి రామస్వామి రంగస్థల కళాకారుడు. పేరెన్నిగన్న నాటకాల్లో కీలకమైన పాత్రలు వేసేవాడు. మొత్తం సంతానం నలుగురిలో చిన్నవాడు కృష్ణ. వ్యవసాయంతో పాటు ఫొటో ఫ్రేములు కట్టేవారు. నాటకాలు ప్రాక్టీస్ చేసుకునేందుకు కళాకారులంతా కృష్ణవాళ్ల ఇంటికే రావడంతో.. హార్మోనియం, తబలా, వీణ సంగీత పరికరాలపై కృష్ణకు మక్కువ పెరిగింది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ కంప్లీట్ చేసుకొని రాత్రి 12 గంటల వరకూ వారితోనే ప్రాక్టీస్ చేసేవాడు. అలా వాటిపై ఇష్టం పెరుగడం, కొత్త రాగాలు నేర్చుకోవడం, పాటలు పాడడం, ఇతర సంగీత పరికరాలపై పట్టు సాధించడం అలవాటైంది. పరకాల వెళ్లి అక్కడ పోతన మ్యూజిక్ కాలేజీలో సర్టిఫికెట్ కోర్స్ నేర్చుకున్నాడు. అక్కడి నుంచి గురువు రవీందర్ దగ్గర కీబోర్డు నేర్చుకొని, శంకర్ సారంగపాణి టీంలో సభ్యుడిగా కొనసాగాడు. పండుగలకు, పబ్బాలకు కీబోర్డు వాయించేవాడు. గురువు యోశ మేడమ్ సహకారంతో హైదరాబాద్‌లోని త్యాగరాయ గాన సభకు వచ్చేశాడు. అనీల్ మాస్టర్ దగ్గర వయోలిన్ నేర్చుకున్నాడు. రామంతపూర్‌లోని స్వరమేళ అకాడెమీ చాంద్ భాషా మాస్టర్ దగ్గర పాటల కంపోజింగ్ నేర్చుకున్నాడు. ఇలా అన్ని రాగాలు, తాళాలు, సంగీత వాయిద్యాలపై పట్టు సాధించి సరిపూర్ణత కలిగిన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు.
Krishan-Delli-Award

అవమానాలు ఎదుర్కొని..!

ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో 2006లో కలవరం అనే ఆల్బమ్‌ను రూపొందించాడు కృష్ణ. అప్పుడు కృష్ణ ఫేమస్ కాకపోవడంతో అతని పేరుకు బదులు మరో పేరును ఆల్బమ్‌లో వేశారు. ఆర్నెల్లు కష్టపడినా ఫలితం దక్కలేదు. అప్పుడే నిర్ణయించుకున్నాడు ఎలాగైనా మంచి పేరు తెచ్చుకోవాలని. ఆ తపనతోనే నర్సక్కపల్లె నుంచి పరకాల -హన్మకొండ-ఖాజీపేట - హైదరాబాద్-రామాంతపూర్ వరకు ప్రయాణం జరిగింది. ఇలా రెండున్నరేండ్లు కష్టపడ్డాడు కృష్ణ. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, షయాక్ ఫర్వేజ్ మరికొందరు స్నేహితులు అండగా నిలిచారు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు సమ్మక్క సారక్క పాటల క్యాసెట్లు అమ్మి జీవించాడు.

నామకరణం చేసిన సుద్దాల!

దూరదర్శన్ చానెల్‌లో నీలిమేఘాలు అనే సీరియల్‌లో మొదటిసారిగా మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. మొదటి సీరియల్‌కే అవార్డు వచ్చింది. తర్వాత ఎనిమిది సీరియళ్లకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2006లో డైరెక్టర్ బాలాజీ పరిచయమయ్యాడు. ఆయన వెంకట్‌తో అలివేలు అనే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశాడు. కార్తీక్, టిప్పు వంటి ప్రముఖ సింగర్లతో అప్పుడే పాడించాడు. ఈ క్రమంలో నగరం నిద్రపోతున్న వేళ సినిమాకు అవకాశం వచ్చింది. ఆ సినిమా కమర్షియల్‌గా హిట్ కాకపోయినా, ఆడియో పరంగా సూపర్ హిట్ అయింది. ఇలా ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి కలయికలో 400లకు పైగా పాటలు వచ్చాయి. కృష్ణ పనితనం మెచ్చిన సుద్దాల.. గోరంట్ల కృష్ణాకర్ పేరును యశో కృష్ణగా మార్చాడు. అప్పటి నుంచి యశో కృష్ణ తన లైఫ్ టర్న్ అయిందని చెబుతుంటాడు. ఈ క్రమంలో సినారె అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు యశో కృష్ణను వరించాయి. బాలు, శంకర్‌మహదేవన్, హరిహరన్ వంటి ప్రముఖ సింగర్స్‌తో పాటలు పాడించాడు.

ప్రైవేట్ ఆల్బమ్స్‌తో గుర్తింపు

ఒకవైపు సినిమాలు చేస్తూనే.. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో మంచి పేరు సంపాదించాడు కృష్ణ. పల్లె ప్రజల నోళ్లలోనానే పాటలను ఎంచుకొని.. వాటికి మంచి సంగీతాన్ని అందించి ఫేమస్ అయ్యాడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఊరువాడ ఒక్కటయ్యి ఉద్యమించెరన్నో.. జై కొట్టు తెలంగాణ అనే పాటకు మ్యూజిక్ అందించాడు కృష్ణ. పసునూరి రవీందర్ రాసిన ఈ పాట ఉద్యమ సమయంలో తెలంగాణను ఉర్రూత లూగించింది. బోనాల పాటలు, బతుకమ్మ, హోళీ, ఉగాది, ఆధ్యాత్మిక పాటలు కూడా స్వరపరిచాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని పార్టీలకు ఆయా పార్టీ గీతాలకు సంగీతాన్ని అందించాడు. విదేశాల్లో ఎన్‌ఆర్‌ఐలు నిర్వహించే పలు కార్యక్రమాలకు హాజరై.. అక్కడి తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. మొన్నటి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సార్ రాసిన పాటలకూ సంగీతాన్ని అందించాడు కృష్ణ.
-డప్పు రవి సీఎం ప్రవీణ్‌కుమార్
Krishna1

ఈ అవార్డు నాన్నకు అంకితం

నేను సంగీత దర్శకుడిగా ఈ స్థాయిలో ఉన్నానంటే కచ్చితంగా మా నాన్న, నా కుటుంబ సభ్యులు, స్నేహితుల కృషే. ఎన్నో ఆపద సమయాల్లో నన్ను ఆదుకున్నారు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఈ జాతీయ అవార్డు అంకితమిస్తున్నా. కచ్చితంగా మంచి హిట్ కొడతానని నమ్మకం ఉంది. ఇప్పటి వరకూ మొత్తం 2వేలకు పైగా పాటలకు సంగీతం అందించా. మంచి బ్యానర్‌లో పెద్ద సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదటి నుంచీ నన్ను ప్రోత్సహిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు.
-యశోకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్

1268
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles