మనోనేత్రమే జ్ఞానమార్గం!


Sat,December 29, 2018 10:52 PM

ధనుర్మాస మహోత్సవాలు భాగ్యనగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నందగిరి హిల్స్‌లోని మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు నివాసంలో జరుగుతున్న ఈ మహోత్సవాలు శనివారంతో 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజున గోదాదేవి 9వ గోపబాలికను మేల్కొల్పిందని, ఈ సందర్భంగా ఆమె చెప్పిన పాశురంలోని విశేషాలను త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి భక్తులకు సవివరంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరరావుతోపాటు ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
Chinna
ఎనిమిదో గోప బాలికను మేల్కొల్పే సమయంలో పోదు అరి కన్నినాయ్ అంటూ ఓ విశేషణం చేసింది గోదాదేవి. పోదు అంటే పుష్పం, అరి అంటే తమిళభాషలో తుమ్మెద, పోటీ పడే శత్రువు, లేడి అని అర్థాలున్నాయన్నారు. పుష్పంతో పోటీ పడగల నేత్ర సౌందర్యం కలిగింది అని. కమల పుష్పం ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా ఆమె కళ్లు ఉన్నాయని చెబుతుంది. లేడి కండ్ల వంటి కండ్లు కలిగిన దానా అని గోదాదేవి గోపికను విశేషణంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. బయటికి కనిపించే నేత్రాల వలె ఆమె అంతర నేత్రాలు కూడా ఉంటాయని చిన జీయర్ స్వామి తెలిపారు.

అంతర కన్ను అంటే మనోనేత్రం. తామర వంటి నేత్రం. అంటే కలువ బురద లోపల నుంచే వస్తుంది కానీ అది మురికిని అంటించుకోకుండానే ఆకాశాన్ని చూస్తూ ఉండే పుష్పం అని అర్థం. అదే విధంగా ప్రపంచం కూడా ఆహంకారమనే బురదతో కూడుకున్నదని, ఇలాంటి ప్రపంచ దోషాలు అంటకుండా జీవించమని గోదాదేవి తన పాశురం ద్వారా మంచి అర్థాన్ని చెప్పిందని స్వామి వారు అన్నారు. ప్రాపంచిక మాలిన్యాలను వదిలేసి బతికే వారు తమ జీవితాలను అందంగా తీర్చి దిద్దుకుంటారని ఆయన పేర్కొన్నారు. భౌతికమైన చూపుకంటే మనోనేత్రంతో చూసే చూపు ఎవరికి ఉంటుందో వారు గొప్పవాళ్లవ్వడానికి అవకాశం ఉంటుందని స్వామి వారు తెలిపారు.

ఈ లోకంలో చెడుతో సంబంధం లేకుండా ఎవరు తమ జీవితాన్ని ప్రగతిపథంగా మార్చుకుంటారో వారిని పద్మంలోని తేనెను గ్రహించే తుమ్మెదల్లాంటి వారని ఆండాళ్ తల్లి పోల్చిందని చిన జీయర్ స్వామి వివరించారు. లేడి ఎప్పుడూ భయపడినట్లుగా కనిపిస్తుంది. కానీ, తనకు ఎవరైనా హాని కలిగిస్తారేమోనని అడవుల్లో ఉండే లేడి భయపడుతుందని, అదే విధంగా బుద్ధిమంతుడు కూడా కొన్ని సందర్భాల్లో భయపడుతుంటాడని, దైవభక్తి విషయంలో కూడా అలాంటి భయమే ఉంటుందని చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. అన్ని భయాలను పోగొట్టగల ధైర్యం భగవంతుడు మనస్సులో ఉన్నంత వరకూ ఉంటుందని, అప్పుడు ఎటువంటి భయాలుండవని, ఆ పరమాత్మ హృదయంలో ఉంటే ప్రపంచంలో ఎప్పుడూ ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం ఉండదని, జ్ఞాని కూడా అలాగే ధైర్యంగా ఉంటాడని ఆయన అన్నారు.

ప్రతి వస్తువులోనూ భగవత్ స్వరూపాన్ని చూస్తాడని, అదే విధంగా ప్రహ్లాదుడు భక్తితో ఉన్నాడు కాబట్టే ఆయనను తండ్రి హిరణ్యకశిపుడు ఎన్ని రకాలుగా హింసించినా ఆయనకు ఏమీ కాలేదని స్వామి వారు తెలిపారు. పేరు, రూపం ఉన్న ప్రతి వస్తువులోనూ జీవుడు ఉంటాడని, జీవుడి వెంట ఖచ్చితంగా దైవం కూడా ఉంటుందని, ఇదే విషయాన్ని వేదాల్లో కూడా ప్రస్తావించారని చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. కాబట్టి, సృష్టిలో ఉండే ప్రతి ఒక్క వస్తువులో దైవం ఉంటుందనేది ఒక నియమమని ఆయన చెప్పారు. సూర్యుడిలోనూ ఆ రూపు ధరించిన ఒక జీవుడు ఉన్నాడని, ఆ జీవుడితోపాటే దేవుడు కూడా ఉంటాడని స్వామి వివరించారు. సూర్యుడు ఈ లోకంలో జీవించే ప్రాణికోటికి ఆధారమని, సూర్యుడు లేకపోతే ఎన్నో నిత్యకృత్యాలు ఆగిపోతాయని ఆయన వెల్లడించారు.

మానవుడు మాత్రమే మాట్లాడగలుగుతాడు. మరొక వస్తువుకు లేదా జీవికి ఆ అవకాశం లేదు. పూర్వజన్మ సుకృతం వల్లనే జీవికి గానీ, వస్తువుకి గానీ ఆయా రూపాలు వస్తాయని చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మనిషిలో వృద్ధాప్యం పెరిగి చివరకు తనువు చాలించాల్సి వస్తుందన్నారు. మిణుగురు పురుగు స్వయంగా ప్రకాశించే జీవని, అదే విధంగా సూర్యుడు కూడా తనంతట తానే కాంతినివ్వడమే కాకుండా లోకంలోని జీవుల మనుగడ కోసం ఉనికిలో ఉన్నాడని ఆయన అన్నారు. సూర్యుడు ఉత్తమమైన వాడు. సూర్యుడి పుట్టుక ఆయన చేసుకున్న పుణ్య ఫలితమేనని స్వామి వారు వివరించారు. మనుషులు ఈర్ష్యా,ద్వేషాలు లేకుండా ఉండడం వల్లనే జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారని చిన జీయర్ స్వామి వివరించారు. మనిషి అన్నింటి కంటే ప్రమాదమైన వాడని, ఎప్పుడూ ఈర్ష్యా, ద్వేషాలు ఉంటాయని, వాటిని వదిలేయడం వల్ల మేలు కలుగుతుందని స్వామివారు సూచించారు.

అంత:శుద్ధితోనే భగవదనుగ్రహం!

Chinna1
గోదాదేవి గానం చేసింది ముప్పై పాశురాలు. పాశురాలు అంటే పాటలని అర్థం. అవే ఈ ధనుర్మాస వ్రతానికి మూల మంత్రాలు కూడా. తిరుప్పావైలో వేకువ జామున స్నానం ఆచరించడానికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది ఆండాళ్ తల్లి. మనం ప్రతి రోజూ చేసే బాహ్యస్నానంతోపాటు అంతరస్నానం కూడా చేయాలని ఆమె సూచించింది. ఈ అంతర స్నానం వల్ల అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి తిరుప్పావైని నిత్యవ్రతంగా చేయడం ద్వారా భగవదనుగ్రహం కలుగుతుంది. గోదాదేవి తన పాశురాల్లో చెలికత్తెలను సేరిళైఈర్ అని సంబోధించింది. సేరిళైఈర్ అంటే జ్ఞాన, భక్తి, వైరాగ్యాలనే ఆభరణాలను ధరించిన చెలులని అర్థం.
పసుపులేటి వెంకటేశ్వరరావు

437
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles