ఎలాంటి రంగంలోనైనా కొత్తదనానికి ఆదరణ ఉంటుంది. ఆ రంగం చిన్నదా? పెద్దదా? అనే తేడా కూడా ఉండదు. సృజనాత్మకతకు అవధులు ఉండవు అనడానికి ఈ టీ మాస్టర్ చక్కని ఉదాహరణ. తన కళాత్మకతతో టీ కప్పులో ఐదురకాల అరలను రూపొందిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.

తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన మణిక్కం అనే టీ మాస్టర్ వినూత్నంగా టీ కప్పులో ఐదురకాల అరలను రూపొందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. అది కూడా టీ కప్పులో డికాక్షన్, పాలు, బూస్ట్, నీళ్లు ఇలా వేరుగా కనిపించేలా తయారుచేసి తనదైన శైలిని నిరూపించుకుంటున్నాడు. ఐదు రకాల అరల్లో చాయ్‌ను తయారుచేయడానికి మణిక్కం 16 ఏండ్లకుపైగా శ్రమించాడు. జనాలందరకీ భిన్నంగా ఉండే టీని అందించాలనే ఉద్దేశంతో ఆయన దీనిని తయారుచేశాడు. ఒకే కప్పులో విడివిడిగా అందిస్తుండటం వల్ల మణిక్కం చాయ్‌కు భలే డిమాండ్ పెరుగుతున్నది. చాయ్ ప్రియుల అభిరుచి మేరకు ఒకే కప్పులో టీ, పాలు, డికాక్షన్, నీరు,బూస్ట్ కలవనీయకుండా ఐదు రంగులలో, ఐదు అరల్లో అందిస్తున్నాడు. ఇంటి వద్దనే టీ స్టాల్ ఏర్పాటుచేసి కోరినవారికి కోరిన విధంగా అరలతో కూడిన తేనీటిని అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు. రోజుకు వెయ్యి కప్పులకు పైగా లేయర్డ్ టీ అమ్ముతున్నాడు మణిక్కం.