మందు కొడితే..బండి కదలదు!


Wed,February 13, 2019 12:21 AM

ఏంటి? మద్యం సేవిస్తే పోలీసులు బండి ఆపేస్తారు. అంగుళం కూడా ముందుకు పోనివ్వరు కాబట్టి బండి కదలదు అనుకుంటున్నారా? ఒకవేళ అలా అనుకుంటే మీరు పొరబడినట్లే. అవును.. పోలీసులు కాదు.. మీ బండే మిమ్మల్ని ముందుకు పోనివ్వదు. అలా పోకుండా ఓ పరికరం తయారుచేశాడీ కుర్రాడు. అంతేకాదు.. ప్రధాని, ముఖ్యమంత్రితో ఔరా అనిపించుకున్నాడు.ఇంతకీ ఆ పరికరం ఏంటి? ఈ కుర్రాడెవరు? ఆ వివరాలతో సంకేతలో..
Screenshot
ఆర్థిక ఇబ్బందుల వల్ల పదో తరగతితోనే చదువు మానేశాను. పెద్ద చదువులు చదువడానికి మా దగ్గర సరిపడా డబ్బులు కూడా లేవు. దూరవిద్య ద్వారా డిగ్రీ చదువుతూ పలు సాంకేతిక ఆవిష్కరణలు చేశాను. ప్రభుత్వ పెద్దలు సహకరిస్తే ఈ గడ్డ మీద పుట్టినందుకు నా వంతు రుణం తీర్చుకుంటా.
-సాయితేజ

పెద్దగా చదివిందేం లేదు.. కానీ ఆలోచనలు, ఆవిష్కరణలు మాత్రం శాస్త్రవేత్త స్థాయిలో ఉన్నాయి.. టెక్నాలజీని తమ కోసం వాడుకునేవాళ్లే ఎక్కువమంది కనిపిస్తారు మనకు. కానీ.. ఈ కుర్రాడు మాత్రం టెక్నాలజీని సమాజం కోసం ఉపయోగించాడు. పదిమంది ప్రాణాలు కాపాడడానికి ప్రయోగించాడు. అతడి పేరు సాయితేజ. చదివింది పదో తరగతే. ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే. ఆరోగ్యం కూడా బాలేదు. కానీ.. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అదేదో తన ఆరోగ్యం గురించి, తన పేదరికం గురించి కాదు. ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచిస్తుంటాడు. ఈ ప్రపంచం తనకు ఏమీ ఇవ్వకపోయినా.. ఆ ప్రపంచానికి తన తరపున ఏదో ఇవ్వాలని తపన పడుతుంటాడు.. మదన పడుతుంటాడు. ఆ తపన, మదనంలోంచి ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి. అందులోంచి వచ్చిందే.. ఈ ఆల్కహాల్ డిటెక్షన్ డివైజ్. మద్యం తాగి వాహనాలు నడుపుతూ.. తాము, రోడ్డు మీద వెళ్లేవారిని ప్రమాదాలకు గురి చేస్తున్నారు కొందరు మందు బాబులు. ఈ ప్రమాదాలకు చెక్ పెట్టడానికి సాయితేజ చేసిన ఆలోచనే ఈ ఆల్కహాల్ డిటెక్షన్ డివైజ్.
Screenshot1

ఎలా పనిచేస్తుందంటే..

30 శాతం కంటే ఎక్కువ మద్యం తీసుకొని డ్రైవర్ సీట్లో కూర్చుంటే కారు దానంతట అదే లాక్ అయిపోతుంది. మీరు స్టార్ట్ చేయడానికి ఎంత ప్రయత్నించినా కార్ ఇంజిన్ స్టార్ట్ కాదు. అంతేకాదు.. ఆల్కహాల్ డిటెక్షన్ డివైజ్‌లో ముందే సెట్ చేసిన నెంబర్లకు అలర్ట్ మెసేజ్ కూడా వెళ్లిపోతుంది. ఒక్క కార్ మాత్రమే కాదు. బైక్, లారీ, బస్సు, ఏ వాహనానికైనా ఈ పరికరం సెట్ చేసుకోవచ్చు. ఈ పరికరంలో ఏర్పాటు చేసిన మైక్రో కంట్రోలర్లు ఆల్కహాల్‌ను డిటెక్ట్ చేసి వాహనం స్టార్ట్ కాకుండా చేస్తాయి. దీంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వాహనాన్ని స్టార్ట్ చేయలేడు, డ్రైవ్ చేయలేడన్నమాట. ఈ పరికరం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి అమలైతే మద్యంమత్తులో జరిగే వాహన ప్రమాదాలకు చెక్ పెట్టినట్టే.
Screenshot2

15 రోజుల్లోనే..

చాలామంది ఒక పరికరం తయారుచేయడానికి అన్ని వసతులున్నప్పటికీ నెలలు, ఏండ్లు సమయం తీసుకుంటారు. కానీ.. ఆలోచన వచ్చిన పదిహేను రోజుల్లోనే, కేవలం రూ.2500 ఖర్చుతోనే సాయితేజ ఈ పరికరాన్ని రూపొందించాడు. టెక్నికల్ చదువులు చదువకపోయినా, పెద్ద పెద్ద చదువుల పట్ల అవగాహన లేకపోయినా ఇంటర్నెట్ సాయంతో ఈ పరికరాన్ని రూపొందించాడు సాయితేజ. ఈ పరికరాన్ని పోలీసు, ట్రాఫిక్ విభాగాల అధిపతులకు అందజేసి ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల సమస్యలను కాస్తయిన తగ్గించాలన్నదే సాయితేజ ఆలోచన. ఇప్పటికే పలు డెమోలు ఇచ్చాడు. రాబోయే కార్లలో ఇన్‌బిల్ట్‌గా ఇంజిన్‌లోనే ఈ పరికరం ఏర్పాటు చేసేలా కంపెనీలతో చర్చలు జరుపుతున్నాడు.
Screenshot3

పేదరికాన్ని, అనారోగ్యాన్ని జయించేనా?

చదువుకోలేకపోయినా.. తన తెలివితో ఎన్నో పరికరాలు, ఆవిష్కరణలకు ప్రాణం పోశాడు సాయితేజ. కానీ.. పేదరికాన్ని, అనారోగ్యాన్ని మాత్రం జయించలేకపోతున్నాడు. తన తల్లితో పాటు సాయితేజ కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్‌లో జాయిన్ అయిన సాయితేజ ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. మెదడులో రక్తం గడ్డకట్టింది. చాలారోజులు కాలేజీకి వెళ్లలేకపోయాడు. దీంతో కాలేజీ యాజమాన్యం సాయితేజ అడ్మిషన్ తొలగించింది. అయినా.. తనలోని మేధస్సును చంపుకోకుండా ఏదో ఒక ఆవిష్కరణకు ప్రాణం పోస్తూనే ఉన్నాడు. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేకపోయినా, ఉన్న కొద్దిపాటి డబ్బులతో ఆవిష్కరణలకు కావాల్సిన సామాన్లు కొంటున్నాడు. తనకు కాస్త సాయమందిస్తే తల్లి ఆరోగ్యాన్ని, తన ఆరోగ్యాన్ని బాగు చేసుకొని ఎన్నో ఆవిష్కరణలు చేస్తానని అంటున్నాడు సాయితేజ. ఆల్కహాల్ డిటెక్టర్‌తోపాటు సోలార్ సైకిల్, నీటితో నడిచే సైకిల్, వాటర్ లెవల్ ఇండికేటర్, ఫైరింగ్ జీపీఎస్ ఇలా ఎన్నో ఆవిష్కరణలకు రూపమిచ్చాడు సాయితేజ.
Screenshot5

ప్రముఖులు భేష్ అన్నారు

ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సాయితేజ ఆవిష్కరణలను చూసి మెచ్చుకున్నారు. తమ ట్విట్టర్ ఖాతాల్లో సైతం సాయితేజను అభినందిస్తూ పోస్టులు పెట్టారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నుంచి సాయితేజకు మా సపోర్ట్ ఉంటుంది. సాయితేజ మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ఆశిస్తున్నా అని కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీనికి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వెంటనే స్పందించి సాయితేజకు మెంటర్‌ని ఏర్పాటు చేశారు.
-ప్రవీణ్‌కుమార్ సుంకరి

787
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles