భోగి పండుగ వేళ.. గోదా కల్యాణ వేడుక


Thu,January 10, 2019 11:02 PM

పాశురాలతో పరమ సన్నిధి!
bogi-festival
సిరినోము (తిరుప్పావై) పండగా.. గోదా - రంగనాథుల పెండ్లి జరుగగా.. శ్రీ వైష్ణవ ఆలయాలలో ఆ అట్టహాసం చూడటానికి రెండు కండ్లూ చాలవు. ధనుర్మాసంలో 30 రోజులపాటు కన్నె గోదాదేవి పాడిన ప్రేమ పాశురాలు ఆమెను శ్రీ రంగనాథ స్వామి సన్నిధికి చేర్చాయంటే నమ్మశక్యం కాదు. కానీ, 1243 సంవత్సరాల కిందట (క్రీ.శ.776) ఇది నిజంగా జరిగింది. వందలాది మంది విష్ణుభక్తులు కండ్లనిండా చూస్తుండగా గర్భగుడిలోకి వెళ్లిన ఆమె జ్యోతి స్వరూపంగా మారి స్వామి విగ్రహంలో సంలీనమైంది.


శ్రీ విష్ణుమూర్తిని ఆరాధించే భక్తులందరికీ అవి దివ్య ప్రబంధాలే కావచ్చు. కానీ, ఆ కన్నెపిల్లకు మాత్రం ప్రేమ పాశురాలు. రోజుకొక ప్రేమ పావు(శు)రాన్ని గోకులంలోని కన్నయ్య కోసం ఎగురవేస్తూ ఆ తమిళ పాటల్ని అవలీలగా, తనను తాను మైమరిచి పోయి, తమకంగా పాడుతుంటే వినేవారికి, చూసేవారికి ఇది కలియుగమా, ద్వాపరనా అనిపించి ఉంటుంది. ఒక్కోరోజు ఒక్కో పాశురం (పాట) చొప్పున పాడుతూ ఆ కారణజన్మురాలు తన తిరుప్పావై (సిరినోము) వ్రతదీక్షను పూర్తి చేసి శ్రీ రంగనాథుని పెండ్లి యాడిన విధం అద్భుతం, అనితర సాధ్యం!


ఇప్పటికి మన కండ్ల ముందర్నుంచి ఎన్నో మకర సంక్రాంతులు వెళ్లి ఉంటాయి. కానీ, ఈ (2019) పండుగ గత 27 రోజులుగా ఒక అపురూప వేడుకగానే అనిపిస్తున్నది. కారణం, గోదాదేవి తమిళంలో పాడిన 30 పాశురాల పరమార్థాన్ని తెలుగు భక్తుల కోసం ప్రబోధించడానికి శ్రీ వైష్ణవ ఆధ్యాత్మిక గురువు, ఉపదేశకులు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి సమక్షంలో ధనుర్మాసోత్సవం జరుగుతుండడం. ఇన్ని రోజులుగా హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్ నిజంగానే ఆనాటి నందగోకులాన్ని ఎందరికో గుర్తుకు తెస్తున్నది. ఆయన ఇక్కడ ప్రతి రోజూ అందిస్తున్న ప్రవచనాల సుధలు ఆహుతులకు అమృతాక్షర భాండాలే. స్వామి వారి ఆధ్యాత్మిక ప్రసంగం సాగినంతసేపు ఆహుతులైన భక్తుల్లోని శ్రద్ధాసక్తులు, వినయ విధేయతలు కొత్త సందర్శకులను విస్మయ పరుస్తాయి.


bogi-festival2
గోదా తల్లి పాశురాలు ఒక్కమాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుడికి ఆమె సంధించిన ప్రేమ పారవశ్యపు పాశుపతాస్ర్తాలే. నాలుగు వేదాలు, 108 ఉపనిషత్తులు, షట్ దర్శనాలు, మహాభాగవత గాథలు, పురాణాలు మొత్తంగా జగాలనేలే ఆ పరమాత్మ శ్రీమహావిష్ణువు విరాట్ విశ్వరూపాన్ని వాటిలో దర్శిస్తాం. మార్గళి త్తింగళ్ మది నిరైంద నన్నాళాల్... (1)తో మొదలై ఎంగుమ్ తిరువరుళ్ పెత్తు ఇన్బురువర్ ఎంబావాయ్ (30)తో పూర్తయ్యే మూడు పదుల మేలుకొలుపులను మన కండ్ల ముందు సాక్షాత్కరింపజేస్తున్న చిన జీయర్ స్వామి ప్రసంగాలను ప్రత్యక్షంగా విన్న వాళ్లంతా ఎంతో అదృష్టవంతులు. ఇన్ని రోజులూ కనీసం టీవీల ముందు కూర్చుని లైవ్‌లో చూస్తున్న వారూ ఆ సారాన్ని అందుకున్న వాళ్లయ్యారు. సిరితల్లి గోదగా దిగివచ్చి శ్రీహరి రంగనాథునిలో లీనం కావడానికి మరో 3 రోజులే ఉంది. కనుక, ఈ ముగింపు అవకాశం మరెవరికి లభించినా అంతకు మించిన సంతోషం వారికి మరొకటి ఉండదేమో.


ఆళ్వారుల వారి నాలాయిర ప్రబంధంలో మొత్తం 4,000 పాశురాలు ఉంటే, ప్రత్యేకించి గోదాదేవి పాడిన ముప్పది పాటలకు యావత్ విష్ణుభక్తుల లోకమే దాసోహమైంది. దీనినిబట్టి, ఆ పాటల దివ్యత్వం, గొప్పతనం మనకు బోధపడుతాయి. ఆ గోదా తల్లిది ఎంత నిర్మలమైన ప్రేమంటే స్వామిని కోర్కెలేవీ కోరలేదు. ఆఖరకు ముక్తిని సైతం అడగలేదు. కేవలం కన్నయ్య సఖ్యం మాత్రమే కావాలంది. పిల్లా మేలుకో, పల్లెపిల్లా మేలుకో, రేపల్లెపిల్లా మేలుకో.. నల్లాని సామినీ పెళ్లాడ మనసైతే, తెల్లారు జామునే చలిమునక వెయ్యాలి! (తిరుప్పావై దివ్యప్రబంధం : ముళ్లపూడి వెంకటరమణ) అంటూ సాగే ఆ పాటల్లో ఎంత సరళత్వమో, అంత చిక్కదనం. శ్రీహరి జగజ్జాయమానమైన దశావతారాల సారం సహా సర్వాంతర్యామి సకల మహోన్నత శక్తియుక్తులన్నీ కట్టె కొట్టె తెచ్చె అన్నంత సూక్ష్మంలో దర్శింపజేశాయి.


ఈ భోగి పండుగ వేళ చలిమంటల వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూనే అద్భుతమైన గోదా-రంగనాథుల కల్యాణ వైభవాన్ని ఏ మాత్రం అవకాశం ఉన్నా కండ్లారా చూసి, చెవులారా వినే ప్రయత్నం చేద్దాం. మనలాంటి సామాన్యులకు ఇంతకంటే మించిన జన్మసార్థకత మరొకటి ఉండదేమో!
దోర్బల బాలశేఖరశర్మ


bogi-festival3

కొత్త క్రాంతి వైపు..

మకర సంక్రాంతి ఎప్పుడూ, ప్రతి ఏటా వచ్చే పండుగే కదా, ఏముంది ప్రత్యేకత? అనుకుంటారు చాలామంది. రోజూ తినే తిండే అయినా తినక తప్పదు. కాకపోతే, కొత్త రుచులను కోరుకోవడం సహజం. ఈ క్రమంలోనే ఈ పండుగకి కూడా మన మనసుని శుద్ధి చేసుకుందాం. నూతన ఆలోచనలతో కొత్త క్రాంతివైపు ప్రయాణం మొదలు పెడదాం. మిగిలిన రంగాల మాటెలా వున్నా ఆధ్యాత్మిక సాధనపట్ల అనురక్తిని ఇకనైనా పెంచుకుందాం. తద్వారా మానసిక ప్రశాంతతను సాధిద్దాం. నేను, నాది అనే అహం లోంచి బయటపడి.. మనిషి, మానవజాతి అనే విశాలతత్వంలోకి వద్దాం. శాస్త్రీయంగానే దేవుణ్ణి నమ్ముదాం. మానవీయత, జీవకారుణ్యం, ప్రకృతి ప్రేమలను మించిన దైవత్వం మరేముంటుంది!

1362
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles