భలే..భలే..బర్గర్స్!


Thu,January 17, 2019 02:02 AM

BURGER
ఫాస్ట్‌ఫుడ్ తింటే ఆరోగ్యం పరేషాన్ అంటారు.. పిజ్జాలు.. బర్గర్‌ల పేరు చెబితే నోనో అనేస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. కానీ జిహ్వ అక్కడికే లాగేస్తుంది.. వాటిని బయట సెంటర్లల్లో తింటే ప్రమాదం కానీ.. స్వహస్తాలతో.. ఇంట్లో చేసి తింటే చింతేముంది?
పిల్లలు.. పెద్దలు ఇష్టపడే బర్గర్స్‌ని.. టేస్టీగా.. క్రంచీగా ఇంట్లోనే చేసుకోవచ్చు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. ఇక వాటికి పరేషాన్ కాకుండా.. నో చెప్పకుండా ఆరగించేయొచ్చు..

థాయ్ వెజ్ బర్గర్

THAI-VEG-BURGER

కావాల్సినవి :

బర్గర్ బన్ : 1, ఆలుగడ్డ : 1 (ఉడికించింది), మంచి గుమ్మడి తురుము : 2 టేబుల్‌స్పూన్స్, స్వీట్ చిల్లీ సాస్ : ఒక టీస్పూన్, ఓయిస్టర్ సాస్ : ఒక టీస్పూన్, బ్రెడ్ క్రంబ్స్ : ఒక టేబుల్‌స్పూన్, కొబ్బరి పాలు : అర కప్పు, పల్లీలు : అర కప్పు (వేయించినవి), బెల్లం : ఒక టేబుల్‌స్పూన్, చింతపండు రసం : ఒక టేబుల్‌స్పూన్, నూనె : 3 టేబుల్‌స్పూన్స్, క్యారెట్ : 1, క్యాప్సికం : 3 (ఆకుపచ్చ, పసుపు, ఎరుపు), వెనిగర్ : అర టేబుల్‌స్పూన్, చక్కెర : చిటికెడు, కీరదోస : 4 ముక్కలు, బటర్ : ఒక టేబుల్‌స్పూన్, ఉల్లి ఆకు: 1, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : ఆలుగడ్డను చిదిమి పెట్టుకోవాలి. ఇందులో మంచి గుమ్మడి తురుము, స్వీట్ చిల్లీ సాస్, ఒయిస్టర్ సాస్ వేసి బాగా కలుపాలి.
స్టెప్ 2 : బ్రెడ్ క్రంబ్స్ వేసి కలిపి వీటిని గారెల్లా చేసి పెట్టుకోవాలి. మరో కడాయిలో కొబ్బరి పాలు పోసి కాసేపు మరుగనివ్వాలి.
స్టెప్ 3 : దీంట్లో వేయించిన పల్లీలు, బెల్లం, స్వీట్ చిల్లీ సాస్, చింతపండు రసం వేసి కాసేపు మరిగించాలి.
స్టెప్ 4 : ఇది మరిగే లోపు పెనం పెట్టి కొద్దిగా నూనె వేసి గారెల్లా చేసుకున్న వాటిని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇదే పెనం మీద బటర్ వేసి బర్గర్ బన్‌ని రెండు ముక్కలుగా చేసి వేయించాలి.
స్టెప్ 5 : ఈ బన్ మీద క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉప్పు, నూనె, వెనిగర్, చక్కెర చల్లాలి.
స్టెప్ 6 : టమాటా ముక్కలు, కీరదోస ముక్కలు, వేయించుకున్న గారెల్లాంటి వాటిని పెట్టాలి. పై నుంచి ఉల్లి ఆకుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. టేస్టీ బర్గర్ మీ ముందుంటుంది.

క్రిస్పీ చికెన్ బర్గర్

CRISPY-CHICKEN-BURGER

కావాల్సినవి :

చికెన్ : 250 గ్రా., బర్గర్ బన్ : 1, మిరియాల పొడి : ఒక టీస్పూన్, మిక్స్‌డ్ హెర్బ్స్ : ఒక టీస్పూన్, గరం మసాలా : అర టీస్పూన్, కారం : అర టీస్పూన్, మైదా : పావు కప్పు, కార్న్ ఫ్లోర్ : పావు కప్పు, బటర్ : 50 గ్రా., ఉల్లిపాయ ముక్క : 1, టమాటా ముక్క : 1, క్యాబేజీ తురుము : 2 టేబుల్‌స్పూన్స్, టమాటా కెచప్ : 2 టేబుల్‌స్పూన్స్, మయన్నీస్ : 2 టేబుల్‌స్పూన్స్, నూనె, ఉప్పు : తగినంత.

తయారీ :

స్టెప్ 1 : చికెన్‌ని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీంట్లో ఉప్పు, మిరియాల పొడి, మిక్స్‌డ్ హెర్బ్స్, గరం మసాలా, కారం వేసి బాగా కలుపాలి.
స్టెప్ 2 : ఇందులో మైదా, కార్న్‌ఫ్లోర్, కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. వీటిని చిన్న గారెల్లా చేసి పెట్టుకోవాలి. వీటిని కడాయిలో నూనె పోసి డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి.
స్టెప్ 3 : బర్గర్‌ని రెండు ముక్కలుగా చేసి బటర్‌ని రాసి పెనం మీద వేయించాలి.
స్టెప్ 4 : ఈ బన్ మీద ఉల్లిపాయముక్క, టమాటా ముక్క, క్యాబేజీ తురుము, వేసి వేయించిన చికెన్ గారెలని పెట్టాలి. పై నుంచి టమాటా కెచప్ వేసి, మయన్నీస్ పోయాలి.
స్టెప్ 5 : మరో బన్‌ని పైన పెట్టి అప్పటికప్పుడు తింటే క్రిస్పీగా, యమ టేస్టీగా ఉంటుంది.

సోయా గ్రాన్యుల్స్ బర్గర్

SOYA-GRANULES-BURGER

కావాల్సినవి :

బర్గర్ బన్ : 1, సోయాగ్రాన్యుల్స్ : ఒక కప్పు, నూనె : 2 టేబుల్‌స్పూన్స్, వెల్లుల్లిపాయ ముక్కలు : ఒక టీస్పూన్, ఉల్లిగడ్డ : 1, స్వీట్‌కార్న్ : పావు కప్పు, మిరియాల పొడి : అర టీస్పూన్, మిక్స్‌డ్ హెర్బ్స్ : అర టీస్పూన్, ఆలుగడ్డ : 1, మైదా : అర కప్పు, బ్రెడ్ క్రంబ్స్ : అర కప్పు, బటర్ : ఒక టీస్పూన్, మయన్నీస్ : ఒక టీస్పూన్, టమాటా : 3 ముక్కలు, కీరదోస : 2 ముక్కలు, లెట్యూస్ ఆకులు : 3, ఉల్లిపాయ : 2 ముక్కలు, టమాటా కెచప్ : ఒక టేబుల్‌స్పూన్.

తయారీ :

స్టెప్ 1 : సోయాగ్రాన్యుల్స్‌ని మరుగుతున్న నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించి, ఆ తర్వాత నీళ్లు లేకుండా బాగా వంపేసి పక్కన పెట్టాలి. ఆలుగడ్డను కూడా ఉడికించుకోవాలి.
స్టెప్ 2 : కడాయిలో నూనె పోసి వెల్లుల్లి పాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇందులో స్వీట్ కార్న్, మిరియాల పొడి, మిక్స్‌డ్ హెర్బ్స్ వేసి దించేయాలి.
స్టెప్ 3 : ఒక గిన్నెలో సోయా గ్రాన్యుల్స్, ఉడికించిన ఆలుగడ్డ, ఉప్పు, స్వీట్‌కార్న్ వేసి మెత్తగా కలుపుకోవాలి. వీటిని గారెల్లా చేసి మైదాలో ముంచి, బ్రెడ్ క్రంబ్స్‌లో వేసి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 4 : ఇప్పుడు బటర్ వేసి ఈ గారెలాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇదే కడాయిలో బర్గర్ బన్‌ని రెండు ముక్కలుగా చేసి వేయించాలి.
స్టెప్ 5 : వీటి మీద ఆ గారెలను పెట్టాలి. మయన్నీస్ వేసి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, లెట్యూస్ ఆకులు, టమాటా ముక్కలు, టమాటా కెచప్ వేసి, బటర్ రాసి ఒక బ్రెడ్ మీద మరో బ్రెడ్ వచ్చేలా ఉంచి లాగించేయాలి.

మష్రూమ్ బర్గర్

MUSHROOM-BURGER

కావాల్సినవి :

మైదా : ఒక టీస్పూన్, ఉల్లిగడ్డ : 1, పాలు : ఒక టీస్పూన్, మష్రూమ్స్ : ఒక కప్పు, సోయా గ్రాన్యుల్స్ : అర కప్పు, మిరియాల పొడి : అర టీస్పూన్, మిక్స్‌డ్ హెర్బ్స్ : చిటికెడు, ఉలవలు : అర కప్పు, బర్గర్ బ్రెడ్ : 1, టమాటా ైస్లెసెస్ : పావు కప్పు, కీరదోస ముక్కలు : పావు కప్పు, జలపెనోస్ మిర్చీ : 5, టమాటా కెచప్ : ఒక టేబుల్‌స్పూన్, వెల్లుల్లిపాయలు : అర టీస్పూన్, బటర్ : 3 క్యూబ్స్.

తయారీ :

స్టెప్ 1 : ఉలవలను కాసేపు నానబెట్టుకోవాలి. కడాయిలో బటర్ వేసి కరిగాక వెల్లుల్లి పాయ ముక్కలు, మైదా వేసి కొద్దిగా వేయించాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఈలోపు సోయా గ్రాన్యుల్స్‌ని ఉడికించి పెట్టుకోవాలి.
స్టెప్ 2 : ఇవి బాగా వేగాక.. పాలు, మష్రూమ్స్, ఉడికిన సోయా గ్రాన్యుల్స్, నానబెట్టిన ఉలవలు, మిరియాల పొడి, మిక్స్‌డ్ హెర్బ్స్ వేసి వేయించాలి.
స్టెప్ 3 : వీటిని కాస్త చల్లారనిచ్చి వీటిని వడల్లా ఒత్తుకోవాలి. ఇలా రెండు చేసుకోవాల్సి ఉంటుంది.
స్టెప్ 4 : ఇప్పుడు బ్రెడ్‌ని రెండు ముక్కలుగా కట్ చేసి పెనం మీద వేసి వేడి చేయాలి. అదే పెనం మీద కొద్దిగా బటర్ వేసి వడలను వేయించాలి.
స్టెప్ 5 : ముందుగా బర్గర్ బ్రెడ్ ఒక ముక్కని ఉంచి వేయించుకున్న వాటిని టమాటా ముక్కలు, కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను, జలపెనోస్ మిర్చీని అందంగా అలంకరించుకోవాలి. పై నుంచి టమాటా కెచప్ వేసి తింటే ఆ టేస్టే వేరు.

-సంజయ్ తుమ్మ
-సెలబ్రిటీ చెఫ్

845
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles