భగవంతునిపై శ్రద్ధ అవసరం


Mon,December 31, 2018 01:10 AM

ధనుర్మాసోత్సవాలు హైదరాబాద్ నగరంలో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. నందగిరిహిల్స్‌లోని మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు నివాసంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు ఆదివారంతో 15వ రోజుకు చేరుకున్నాయి. 30రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు జనవరి 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి మాట్లాడుతూ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని గురించి తెలియజేస్తూ, మన ద్వారా చేయిస్తూ తన పాశురాల ద్వారా మనిషికి అవసరమైన జ్ఞానాన్ని అందించిందని అన్నారు. మొదటి ఐదు పాశురాల(పాటలు) ద్వారా ఆండాళ్ తల్లి భగవంతుడంటే ఏమిటో తెలిపిందని, మరో పది పాశురాల్లో భగవత్తత జ్ఞానాన్ని కలిగిన మహనీయులు ఎలా ఉంటారో మనకు పరిచయం చేసిందని ఆయన పేర్కొన్నారు. భగవంతుణ్ణి గుర్తించిన వ్యక్తుల ప్రవృత్తి, అటువంటి వారి అనుగ్రహం మన మీద కలగడం ఎంత అవసరమో గోదాదేవి చెప్పిందని, పదుగురు గోపికలను మేల్కొల్పడమే తిరుప్పావై అని ఆచార్యులు సవివరంగా తెలిపారని స్వామివారు వివరించారు. ఈ కార్యక్రమంలో జూపల్లి రామేశ్వరరావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, మాజీ డిజిపి అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Chinna
మహానుభావులైన పరమ ఋషులు ఈ ప్రపంచాన్నంతటినీ విషవృక్షంలా భావిస్తారని చినజీయర్ స్వామి అన్నారు. మనకు ఉన్న తెలివిని కప్పి పల్లపు ప్రవాహంలోకి జారిపోయేదే ఆహంకారమని, దీనికే సంసారమని పేరు పెట్టారని ఆయన వివరించారు. అయితే కాదాచిత్‌కేశవే భక్తిహీ,తద్ భక్తైర్వా సమాగమహ ప్రపంచంలో బ్రతుకుతున్న వారికి ఏదోకనాటికి భగవంతుని యందు శ్రద్ధ కలగడం గొప్ప పండు వంటిదని, డబ్బు సంపాదించాలి, అది చేద్ద్దాం, ఇది చెద్దామనే ఆలోచనలే ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అది సరికాదని భగవంతుని మీద ప్రేమ కలిగి మనం జీవించాలని ఆయన సూచించారు.


భగవంతుని పై మనస్సును లగ్నం చేయడమనేది అపురూపమైన ఫలమని స్వామి వారు పేర్కొన్నారు. భగవంతుడు కంటికి కనిపించకపోయినా,మనం ఆయన్ను గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు మనతో వివాదం పెట్ట్టుకోడని చిన జీయర్ స్వామి వారు తెలిపారు. భగవద్గ్గీతలో రెండో అధ్యాయంలో దైవాన్ని గుర్తిస్తూనే మనం చేసే ప్రతి పనిలోనూ ఆయన ఉన్నాడని తెలుసుకోవడమే జీవిత సారమని, ఇదే విషయాన్ని భగవంతుడు అర్జనునితో చెప్పాడని స్వామివారు చెప్పారు. మనతోపాటు ఉండే దైవత్వాన్ని గుర్తించడమే విజయమని స్వామివారు వివరించారు.


మనిషిగా పుట్టిన వారందరూ ప్రాపంచిక బాధ్యతలను నెరవేరుస్తూనే భగవతత్వాన్ని తెలుసుకొని, ఆయన పరికరంగా బ్రతకడమే ఆయన్ను గుర్తించినట్లని స్వామివారు వివరించారు. ఎంతో శ్రమ పడి మానవ జన్మలోకి వచ్చామని దానిని సద్వినియోగించుకోవాలని అలా చేయకపోతే ఈ జన్మ వృధా అవుతుందని ఆయన పేర్కొన్నారు. దైవాన్ని గుర్తించడమంటే అమృత ఫలాన్ని అందుకున్నట్లేనని, భగవత్ భక్తులతో మనకు సమాగమం ఏర్పడడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం అని స్వామివారు సూచించారు. భగవతత్వాన్ని గురించి చెప్పేవారికీ మనకు ఏమాత్రం భేదం ఉండదని, కేవలం జ్ఞానం విషయంలోనే మార్పు ఉంటుందని, ఆకృతిలోనూ మార్పు ఉండదని స్వామివారు తెలిపారు.
Chinna1
చిన్న పిల్లకు శబ్దం ద్వారా వస్తువుల పదాలను పరిచయం చేస్తామని, అలా విడమరిచి తెలియజేసినప్పుడే సరిగా తెలుసుకోగలుగుతారన్నారు. శబ్ద జ్ఞానం తరువాతే అర్థజ్ఞానం కలుగుతుందని ఏ భాషలో చెప్పాల్సి వచ్చినా ఇదే విధానాన్ని పాటిస్తామని, అలా తెలుసుకున్న దానిని మననం చేయడం ద్వారానే అసలు జ్ఞానం కలుగుతుందని స్వామివారు చెప్పారు. మనలో ఉండే చెడును తొలగించి, మంచి మార్గంలో నడింపించే వారే ఆచార్యులని, మంచివారితో సహవాసం పెంచుకోవడమే తిరుప్పావై అని చిన జీయర్ స్వామి వారు చెప్పారు. భగవంతుడి సాన్నిహిత్యాన్ని పొందాలంటే మనలోని చెడును వదిలేయాలని, సృష్టిలోని ప్రతి వస్తువు కూడా ఆయనదేనని, అందంగా అద్భుతంగా ప్రకాశించేవన్నీ దైవ సంభూతాలుగా గ్రహించాలని స్వామివారు సూచించారు. దైవాన్ని గుర్తిస్తే ప్రకృతితోనూ, ఇతరుల పట్ల వ్యవహరించే తీరు వేరుగా ఉంటుందని ఆయన వివరించారు. భగవంతుణ్ణి గుర్తించకుండాఎక్కడికి వెళ్లినా నిరుపయోగమేనని, ఒకవేళ ఎన్ని పూజలు, పునస్కారాలు చేసినా ప్రయోజనం ఉండదని,ఆయన్ను విశ్వసించినప్పుడే అసలైన ఫలితం ఉంటుందని స్వామివారు పేర్కొన్నారు.

పసుపులేటి వెంకటేశ్వరరావు

897
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles