బీపీ ఇంత త్వరగానా?


Wed,July 12, 2017 01:15 AM

నా వయసు 30. ఒక మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తాను. ఈ మధ్య చాలా త్వరగా అలసటగా అనిపించడం, ఎక్కువ చెమటలు వస్తుండడం, నీరసంగా అనిపిస్తుండటంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన బీపీ పరీక్షించి ఎక్కువగా ఉందని చెప్పి మందులు రాసిచ్చారు. నాకు పెద్దగా చెడు అలవాట్లేమీ లేవు. చాలా అరుదుగా ఆల్కహాల్ కొద్ది మోతాదులో తీసుకుంటాను. మా అమ్మనాన్నలిద్దరికి బీపీ ఉంది. కానీ ఇంత చిన్న వయసులో వారికి రాలేదు. నాకు ఇంత త్వరగా ఎందుకు వచ్చింది. ఇలా త్వరగా బీపీ రావడం వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు.
ప్రవీణ్, మంచిర్యాల

HYPERTENSION
ధమనుల్లో రక్తపీడనం పెరుగడాన్నే బీపీ లేదా హైపర్ టెన్షన్ అంటారు. ఇలా ధమనుల్లో రక్త పీడనం పెరుగడం వల్ల గుండె మీద భారం పడుతుంది. రక్త పీడనాన్ని సిస్టోలిక్/ డయాస్టోలిక్ అని రెండు విలువలతో కొలుస్తారు. గుండె సంకోచించినపుడు కొలిచేది సిస్టోలిక్ పీడనం, వ్యాకోచించినపుడు కొలిచేది డయాస్టోలిక్ పీడనం. సిస్టోలిక్ పీడనం 100-140 మధ్య, డయాస్టోలిక్ పీడనం 60-90 మధ్య ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని బీపీ లేదా హైపర్ టెన్షన్ అంటారు.

మీ తల్లిదండ్రులిద్దరికీ బీపీ ఉంది కాబట్టి మీకు కూడా వచ్చేందుకు 20-60 శాతం వరకు ఆస్కారాలు ఉన్నాయి. మీ జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లన్ని కూడా బీపీ వచ్చేందుకు అనుకూలంగా ఉన్నందు వల్ల మరింత త్వరగా బీపీ వచ్చింది. అలవాట్లు, శరీర బరువు, చేసే పని, ఎదుర్కునే ఒత్తిడి వంటి ఎన్నో కారణాలు బీపీకి కారణం అవుతాయి.

బీపీ స్థాయి అదుపులో లేకపోతే గుండె, కిడ్నీ, రక్తనాళాలు, మెదడు వంటి ముఖ్యమైన అన్ని అవయవాల మీద దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా బీపీని అదుపులో ఉంచుకోవాలి. అందుకోసం తప్పనిసరిగా క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. బరువు పెరుగకుండా చూసుకోవాలి. ఆహారంలో ఉప్పు రోజకు 3 గ్రాములు మించకూడదు. కొవ్వు పదార్థాలు తగ్గించి తీసుకోవాలి. కొవ్వు తీసిన పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.
dranuju
ఎంత మాత్రం ఒత్తిడికి లోనుకాకుండా జాగ్రత్త పడాలి. అందుకు యోగా, ధ్యానం వంటివి అలవరుచుకుంటే మంచిది. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలతో బీపీని ఎదుర్కోవడం కష్టం కాదు.

535
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles