బిగ్‌బాస్ నందిని అంటున్నారు!


Sun,September 9, 2018 01:36 AM

హార్మోన్స్.. మాయ.. మోసగాళ్లకు మోసగాడు.. ఈ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.. బాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేసింది..ఇన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు.. రాత్రికి రాత్రి బిగ్‌బాస్-2లో అడుగు పెట్టడం వల్ల వచ్చింది.. ప్రేమను వెతుక్కుంటూ వెళ్లి..
కన్‌ఫ్యూజ్ అయి.. అటుపై బిగ్‌బాస్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.. ఇప్పుడు సిల్లీ ఫెలోస్ అంటూ తెరపై మెరిసింది.. ఆమే నందిని రాయ్.. ఆమెతో ఈ సండే స్పెషల్ చిట్‌చాట్..

Nandini

సిల్లీ ఫెలోస్ సినిమా సక్సెస్ సాధించింది కదా.. ఎలా ఉంది?

-చాలా సంతోషంగా ఉందండీ! బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక విడుదలైన సినిమా ఇది. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నా. కానీ మంచి సక్సెస్‌ని అందించినందుకు అందరికీ నా ధన్యవాదాలు.

బిగ్‌బాస్ కంటే ముందే ఈ సినిమా చేశారా?

-బిగ్‌బాస్ సైన్ చేశాక ఈ ఆఫర్ వచ్చింది. ఇక నేను బిగ్‌బాస్‌లో అడుగుపెట్టబోతున్నా అన్నప్పుడు నా పార్ట్ వరకు సినిమా కంప్లీట్ చేశారు. బిగ్‌బాస్ నుంచి వచ్చాక కొన్ని టచప్స్ చేశా.

అసలు సినిమాల్లోకి రావాలని ఎందుకనుకున్నారు?

-నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక యాడ్‌లో సౌందర్య గారి కూతురిగా నటించే అవకాశం వచ్చింది. అది జరుగుతున్నప్పుడు ఆమె ఫాలోయింగ్ చూశా. ఇప్పటిలాగా అప్పుడు సెల్ఫీలు లేవు. ఆవిడ ఆటోగ్రాఫ్‌ల కోసం క్యూలు కట్టారు. ఆమె వెనుక బాడీగార్డ్‌లను గమనించా. నిజంగా ఒక నటి అయితేనే ఇంత ఫాలోయింగ్ వస్తుందనిపించింది. అందుకే నటినవ్వాలని ఆ రోజే డిసైడయ్యా.

నటిగా గోల్ ఉన్న మీరు.. ముందుగా మోడల్‌గా మారారెందుకు?

-అది నా నిర్ణయం కాదు. డిగ్రీ చదువుతున్నప్పుడు అమ్మ ఒకరోజు.. నువ్వు బాగుంటావు.. బ్యూటీ పెజేంట్‌కి ట్రై చేయ్ అని సలహా ఇచ్చింది. నేనూ తలాడించా. ఆ తర్వాత అమ్మనే ఫొటోలు పంపించింది. 2008లో మిస్ హైదరాబాద్, 2009లో ప్యాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఏపీ, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్, అందులోనే మిస్ బ్యూటీ ఐస్ కిరీటాలను కూడా దక్కించుకున్నా. ఆ తర్వాత సుమారు 80 నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కి మోడల్‌గా వ్యవహరించాను.

నీలం.. నందినిగా ఎలా మారింది? ఎప్పుడు, ఎందుకు?

-తెలిసిపోయిందా! నా పేరు నాకు నచ్చేది కాదు. ఒక రంగు పేరు తీసుకొచ్చి మనిషికి పెట్టడమేంటని అమ్మానాన్నలని ఒకరోజు అడిగేశా. పైగా నాకు ఆ రంగు అస్సలు నచ్చదు కూడా. నా పేచీ పడలేక వాళ్లు అఫీషియల్‌గా నందినిగా మార్చారు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు పేరు మార్చారు.

బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది?

-బిగ్‌బాస్ 1ని ఆడియన్‌గా చూశా. రెండవ దాంట్లో నాకు చాన్స్ వచ్చిందని చెప్పగానే సంతోషాన్ని ఆపుకోలేకపోయాను. నిజంగా అయితే ఎవరికీ చెప్పకూడదు ఈ విషయాన్ని. కానీ నాకు నలుగురు ఫ్రెండ్స్‌కి కాల్ చేసి ఇంటికి రప్పించి మరీ ఆఫర్ వచ్చిందని చెప్పేశా. రెండు మూడు రోజులు నిద్ర కూడా సరిగా పోలేదు. అద్దం ముందు నిల్చొని ఇలా చేయాలి, అలా చేయాలని ఎన్నో అనుకున్నాను. కానీ వెళ్లే ముందు చిన్న దెబ్బతో వారం రోజుల తర్వాత వెళ్లాను.

వారం రోజులు లేట్‌గా వెళ్లినందుకు ఎలా ఫీలయ్యారు?

-(నవ్వుతూ..) దీనివల్లే నన్ను అందరూ కన్‌ఫ్యూజన్ మాస్టర్ అనడం మొదలుపెట్టారు. ఎందుకంటే నేను బయట ఉన్నప్పుడు షో చూశాను. ఎవరు ఎలాంటివారో అర్థమయిందనుకున్నా. కానీ లోపలికి వెళ్లాక ఆ లోకం వేరుగా ఉంది. బయట నుంచి మనం చూసేది గంటన్నరే. కానీ 24 గంటలు అక్కడ ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారని అర్థమైంది.


బిగ్‌బాస్ మీకు లైఫ్ ఇచ్చిందనుకుంటున్నారా?

-చాలా ఇచ్చింది. నన్ను ప్రేక్షకులకు మరింత దగ్గరకు చేసింది. ఒకప్పుడు నేను హీరోయిన్‌గా కొద్ది మందికే తెలుసు. కానీ, ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా బిగ్‌బాస్ నందిని అని పిలుస్తున్నారు. నా సినిమాల కంటే బిగ్‌బాస్‌నే ఎక్కువ గుర్తు పెట్టుకున్నారు.

బిగ్‌బాస్ ఫైనల్ దగ్గర పడుతున్నది. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు?

-రెండు వారాలుగా నేను సినిమా బిజీలో సరిగా చూడలేదు. కానీ చూసినంతవరకు గీత లేదా కౌషల్‌లో ఒకరు గెలుస్తారనిపిస్తున్నది. వాళ్లిద్దరూ నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ కూడా. వారిలో ఎవరికి టైటిల్ వచ్చినా నాకు సంతోషమే. వీరిద్దరి మధ్యే గట్టి పోటీ ఉండబోతుందని అనుకుంటున్నా.

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని అంటారా?

-ఇది అమ్మాయిలని బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎవరూ కూడా ఎవ్వరినీ ఏమీ అడుగరు. ఒకవేళ అమ్మాయి ఎంటర్‌టైన్ చేస్తుందంటే దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. కాకపోతే ఉందని, లేదని నేను చెప్పలేను. నా విషయంలో మాత్రం ఇలాంటి సంఘటనలేమీ జరుగలేదు.

మీ గురించి.. మీ ఫ్యామిలీ గురించి చెబుతారా?

-సెయింటాన్స్ హై స్కూల్‌లో చదివా. శ్రీ సాయి విజ్ఞాన భారతిలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశా. యూకేలో ఎంబీఏ పూర్తి చేశా. మా నానమ్మ తాతయ్య వాళ్లు యూఎస్‌లో ఉండేవారు. నేను ఎక్కువగా ఇండియాలో కంటే యూఎస్, యూకేల్లో ఉండేదాణ్ని. అందుకే నా తెలుగులో కాస్త ఎక్కువ ఇంగ్లిష్ మిక్స్ అయి ఉంటుంది. నాన్న బిజినెస్, అమ్మ హోమ్‌మేకర్. ఒక అన్న ఉన్నాడు.

కాబోయేవాడిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి?

-మంచి మనిషై ఉండాలి. కాస్త సమాజం కోసం ఏదైనా చేస్తుండాలి. చూడడానికి చక్కగా ఉండాలి. నేను హైట్ తక్కువ.. కాబట్టి వచ్చేవాడు మంచి హైట్ ఉంటే పుట్టే పిల్లలు ఎత్తు ఉంటారు కదా! (నవ్వుతూ..).

కౌషల్‌ని టార్గెట్ చేయడం వల్లే మీరు బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చారని టాక్. మీరేమంటారు?

Kaushal
-కౌషల్‌ని టార్గెట్ చేడయం వల్ల కాదు. కౌషల్ ఆర్మీకి నచ్చకపోవడం వల్ల నన్ను వాళ్లు టార్గెట్ చేసి బయటకు పంపారు. నిజంగా అలాంటి ఆర్మీ నాకు ఎందుకు ఫామ్ కాలేదని ఒక్కోసారి అనిపిస్తుంది. అతని కష్టం వల్లే ఇంతమంది ఫ్యాన్స్ అయ్యారని భావిస్తున్నా.

నందిని ఇప్పటివరకు ప్రేమలో పడలేదా.. మీకోసం ప్రేమలేఖలు రాలేదా?

-(నవ్వుతూ.. ) నాకు క్రష్‌లాంటివి.. డేటింగ్‌లాంటివి ఏమీ లేవు. కాకపోతే నేను ప్రేమించానంటూ చాలామంది చెప్పారు. ఒకరయితే.. ఏడుస్తూ ఫొటోలు పంపించడం చేశారు. అతన్ని చూసి చాలా నవ్వు వచ్చింది. కాస్త జాలేసింది కూడా. కానీ ఎవరూ కనెక్ట్ అవ్వలేదు.
సౌమ్య నాగపురి

1180
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles