బాలసాహితీ పరిమళం


Wed,March 13, 2019 04:54 AM

స్వర్గం ఉందో లేదో.. నా పుణ్యం నాకిచ్చేయ్..సర్వస్వం నీకర్పిస్తా.. నా బాల్యం నాకిచ్చేయ్ అన్న కవుల మాటలే ఆమెను బాలసాహిత్యం వైపు అడుగు చేశాయి. ఆటపాటలతోనే చదువు అబ్బుతుందంటూ అదే పనిగా తన సాహిత్య యాత్రను కొనసాగిస్తున్నారు. కందేపి రాణీప్రసాద్. సర్ సీవీ రామన్ అకాడమీ వారి బాలసాహిత్యం విభాగంలో జాతీయ స్థాయి సాహిత్య పురస్కారం ఇటీవలే అందుకున్న సందర్భంగా ఆమె పరిచయం మీకోసం..పిల్లల మనోవికాసమే ఆమె కథల లక్ష్యం. ప్రకృతి అంశాలు, పర్యావరణ సంగతులతో ఆకట్టుకునే చిత్రాలు వేయడంలో ఆమె దిట్ట. పొడుపు కథలు, అందమైన బొమ్మలతో పిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తి పెంచుతున్నది. ఆటపాటలతో ఆనందంగా గడిపే బాల్యానికి చదువు భారంగా మారిపోతున్నది. ఉదయం మొదలు రాత్రి పడుకునే వరకు పుస్తకాలే దినచర్యగా సాగుతూ మానసిక ఒత్తిడికి గురవుతున్నాయి చిన్ని మెదళ్లు. అందుకే చందమామను చావగొడితే చల్లదనం రాదు.. తేనేటీగను తెగనరికితే తియ్యదనం రాదు.. పువ్వులను పిప్పిచేస్తే పరిమళం రాదు.. చిన్నారులను చితకబాదితే చదువు రాదంటూ.. లేతమనుసులను అర్థం చేసుకోవాలి అంటూ హితవు పలుకుతున్నారు బాలసాహిత్య కవయిత్రి కందేపి రాణీప్రసాద్.
kandepi-raniprasad
రాణీప్రసాద్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. మంచి వాతావరణంలో పెరిగిన పిల్లలు దేశానికి వెలకట్టలేని సంపద అంటారామె. అందుకే వారికి అర్థమయ్యేలా చిట్టిపొట్టి కథలు రాస్తారు. లేకపోతే చిన్న చిన్న నీతి పద్యాలు, గేయాలు రాస్తారు. సైన్స్‌నూ అందులో మిళితం చేయాలన్నది రాణి ఆలోచన. పైగా డాక్టర్స్ ఫ్యామిలీ కావడం తనకి ప్లస్ అయింది. పిల్లల కోసం రచనలు చేయాలంటే పూర్తిగా వాళ్లలా మారిపోవాలి. వారిలా ఆలోచించాలి. అటు వైద్యం, ఇటు సాహిత్యం రెండింటి మీద పట్టు ఉండడంతో బాలసాహిత్యం రాయడం మొదలుపెట్టింది రాణి. సుమారు 25 పుస్తకాలు రాసింది. అందులో పూర్తి సైన్స్ సబ్జెక్ట్స్‌తో రాసినవి మూడు పుస్తకాలు. ఏడు అనువాద రచనలు. సిరిసిల్లలో వీరికి సృజన్ పేరుతో ఓ పిల్లల హాస్పిటల్ ఉంది. 30 పడక గదులున్న ఆ హాస్పిటల్ గోడల నిండా రాణీప్రసాద్ సాహిత్యమే కనిపిస్తుంది. పిల్లలకు సంబంధించిన కృత్యాలు, పాటలు, కథలు, సైన్స్ మెళకువలు కనిపిస్తాయి. ఇప్పటిదాకా జంతువుల గురించి, కొన్ని వస్తువుల గురించే పొడుపు కథలు చదివి ఉంటారు, విని ఉంటారు. కానీ, శరీరంలోని 30 భాగాలపై, సైన్స్ అంశాల మీద కూడా పొడుపుకథలను రాసింది రాణి. అవి కూడా హాస్పిటల్ గదుల్లో కనిపిస్తాయి. పైగా ఆసుపత్రిలో డాక్టర్ రాసే మందుల చీటీ మీద కూడా ఈ గేయాలు, పొడుపుకథలు దర్శనమిస్తాయి. పూలతోట, సరదా సరదా బొమ్మలు, హరివిల్లు నెలవంక, సైన్స్‌పాయింట్, బాల్యమా ఎక్కడ నీ చిరునామా, విహారం, కస్తూరిబాయి జీవిత చరిత్ర, మిఠాయిపొట్లం, మై పిక్చర్స్, లిటిల్ హార్ట్స్, సైన్స్ వరల్డ్, సీతాకోక చిలుక లాంటి బాలల పుస్తకాలెన్నో రాణీప్రసాద్ కలంతో జీవం పోసుకున్నాయి.

వ్యర్థానికో అర్థం..

ఏదైనా ఆలోచన అంకురార్పణ జరుగాలంటే దానికి సరైన సమయం రావాలి. రాణికి తన పెద్ద కొడుకు పుట్టినప్పుడు ఆ సమయం వచ్చింది. కొడుకు పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు రెస్ట్ దొరికింది. ఎవరైనా దాన్ని విశ్రాంతిగా తీసుకుంటారు. కానీ, రాణి చూపు మాత్రం తమ ఆసుపత్రిలో పడుతున్న వ్యర్థాలపై పడింది. రోజురోజుకి పెరిగిపోతున్న చెత్త ఆమెను నిద్రపట్టకుండా చేసింది. పైగా ఆ వ్యర్థాలతో మరింత నష్టం వాటిల్లుతుందని తెలుసుకుంది. అందుకే తనలో క్రియేటివ్ ఆర్టిస్ట్‌కి పనిచెప్పింది. మెడికల్ వ్యర్థాలన్నింటినీ ఒక చోట చేర్చి ఫ్లవర్‌వాజ్‌లు, ఫొటో ఫ్రేములు.. ఇలా రకరకాల కళాకృతులు తయారుచేసింది. పెండ్లిళ్లు, ఫంక్షన్లకు వాటినే తీసుకెళ్లి బంధువులకు, స్నేహితులకు గిఫ్టులుగా ఇచ్చేది. అలా తాను తయారుచేసిన కళాకృతులన్నీ ఒక గదిలో అలంకరించి దానికి మిల్కీ మ్యూజియం అని పేరు పెట్టింది.
kandepi

విభిన్నత్వం..

రాణీ ప్రసాద్ తండ్రి చిన్నప్పటి నుంచి ఆమెను డాక్టర్ చేయాలని కలలు కన్నాడు. కానీ, రాణి మాత్రం డాక్టర్ చదువుతాను, కానీ ప్రాక్టీస్ అయితే పెట్టాను అని చెప్పేదట. అయినా తల్లిదండ్రులు పట్టుబట్టడంతో ఎంట్రెన్స్ రాసింది. కానీ, వాళ్ల నాన్న కోరిక మాత్రం తీరలేదు. ఆమెకు చిన్నప్పటి నుంచి క్రియేటివ్‌గా ఏదైనా చేయాలని కోరిక. ఆ మేరకు కుట్లు, అల్లికలు, డ్రాయింగ్ బాగా చేసేది. ఎమ్మెస్సీ జువాలజీ పూర్తి చేసింది. అప్పుడే ఆమెకు డాక్టర్ ప్రసాద్‌తో పెండ్లి జరిగింది. ఆయన ప్రోత్సహంతో తెలుగు లిటరేచర్ చదువాలనుకుంది. అలా ఎంఎ.తెలుగు పూర్తి చేసింది. ఆ తర్వాత బాలసాహిత్యంలో వైజ్ఞానిక రచనల మీద పీహెచ్‌డీ పూర్తి చేయాలనుకుంది. అప్పటిదాకా ఈ సబ్జెక్ట్ మీద ఎవరూ పీహెచ్‌డీ చేయలేదు. దీంతో బాలసాహిత్యంలో వైజ్ఞానిక రచనల మీద పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ అందుకున్న తొలి మహిళగా గుర్తింపు పొందింది.

కందేపి రాణీప్రసాద్ అందుకున్న అవార్డులు


-యునెస్కో మిలినీయం బెస్ట్ చిల్డ్రన్ రైటర్ - 2000 గ్రామీణ జ్యోతి కళాపురస్కారం - 2001 *పద్మపురస్కారం - 2002 *కళాభారతి - 2003 *స్వర్ణాంధ్ర పురస్కారం - 2003 * సిరివెలుగుల ఆత్మీయ పురస్కారం - 2003 *సాహిత్య రత్న పురస్కారం - 2009 *సిరిసిల్ల జిల్లా ఉత్తమ సాహితీ వేత్త పురస్కారం - 2015 *రావూరి భరద్వాజ విజ్ఞాన పీఠం ఉత్తమ బాలసాహితీవేత్త పురస్కారం - 2017 *నారంశెట్టి బాలసాహిత్య పురస్కారం -2017 *జాతీయ సాహిత్య ప్రతిభా పురస్కారం - 2017 *సర్ సీవీ రామన్ అకాడమీ తెలుగు జాతీయ ఉగాది పురస్కారం - 2019
-రాపెల్లి సంతోష్‌కుమార్, నమస్తేతెలంగాణ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల

585
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles