బాలలత..ఓ స్పూర్తిదాత


Mon,April 15, 2019 11:53 PM

వైకల్యం రాకుండా నయం చేయాల్సిన పోలియో మందు వికటించింది.అదే అదునుగా విధి కూడా ఆమె రాతలో వంకర గీతలు గీయాలని ప్రయత్నించింది.. ఫలితంగా.. నడిచే సామర్థ్యాన్ని, బడికెళ్లే అదృష్టాన్ని కోల్పోయింది. కానీ.. ఆత్మైస్థెర్యాన్ని మాత్రం కోల్పోలేదు..ఎంతోమంది తలరాతలను మారుస్తూ.. ఆ బ్రహ్మ రాసిన రాతనే సవాల్ చేస్తున్నది. ఆమె ఇప్పుడు చరిత్ర సృష్టిస్తున్న విధాత..సివిల్స్‌కి ప్రిపేరయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇస్తూ.. సమాజానికి దారిచూపే.. అధికారులను తయారుచేస్తున్నది. ఆ స్ఫూర్తిప్రదాత.. మల్లవరపు బాలలత. ఆమె గాథ మీకోసం..
Balalatha1
గెలుపు కోసం పని చేస్తున్నప్పుడు, ఓ అద్భుతాన్ని సృష్టించడం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దేన్నీ పట్టించుకోకూడదు. మనల్ని వేలెత్తి దెప్పి పొడిచిన వారే.. మన విజయాన్ని చూసి నివ్వెరపోవాలి. బాలలత అదే చేసింది. కాలాన్నే గెలిచి చూపించింది. ఆ గెలుపు కోసం, ఎండా, వాన, చలి, ఆకలి, నిద్ర ఏదీ పట్టించుకోలేదు. తొంభై శాతం వైకల్యం. దానికి పదిరెట్లు ఆత్మవిశ్వాసం. అందరూ ఆమెను దివ్యాంగురాలిగానే చూశారు. కానీ ఆమె ఒక ఆఫీసర్‌గా తనను ఈ లోకానికి కొత్తగా పరిచయం చేసుకోవాలనుకున్నది. తొంభై శాతం వైకల్యం వల్ల తన పనులు కూడా తను చేసుకోవడానికి కుదిరేది కాదు. దీంతో స్కూల్‌కి వెళ్లలేకపోయింది. ఇంట్లోనే తల్లిదండ్రులే ఆమెకు గురువులయ్యారు. టెన్త్ పరీక్ష ప్రైవేట్‌గానే రాసింది. ఇంటర్మీడియట్ అత్తెసరు మార్కులతో గట్టెక్కింది. అందరూ తన మీద జాలి చూపించడం ఆమెకు నచ్చలేదు. నేనెవ్వరి సహాయం కోరడం లేదు కదా.. నా మీదెందుకు జాలి చూపిస్తున్నారు వీరంతా అనుకునేది.

ఓపెన్ డిగ్రీలో జాయిన్ అయింది. చూస్తుండగానే డిగ్రీ పూర్తయింది. ఈసారి అత్తెసరు మార్కులు కాదు.. మంచి మార్కులే వచ్చాయి. సమాజం మీద కసిని పుస్తకాల మీద తీర్చుకుంది. కొత్తపేటలోని మహాత్మాగాంధీ లా కాలేజీలో ఎల్.ఎల్.బీ చదివింది. అది కూడా పూర్తయింది. ఎల్.ఎం.ఎల్ ఎంట్రెన్స్ పరీక్ష రాసింది. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్. ఆశ్చర్యపోయింది. మనసు పెట్టి చేస్తే ఏదైనా సాధించగలను అన్న నమ్మకం కుదిరింది. బషీర్‌బాగ్‌లోని ఈవినింగ్ కాలేజీలో లా చేస్తూనే సివిల్స్ రాసింది. తనలా సివిల్స్ రాసేవారికి గైడెన్స్ ఇస్తూ, క్లాసులు చెప్పింది. ఉద్యోగం సాధించాలన్న కసితో అద్దంలో ముఖం చూసుకునేంత తీరిక కూడా లేకుండా చదివింది. ఉదయం ఐదు గంటలకు మొదలుపెడితే.. రాత్రి పన్నెండు, ఒంటిగంట వరకు చదువుతూనే ఉండేది. ఆ కష్టానికి ప్రతిఫలం సివిల్స్‌కి సెలక్ట్ అయింది. కానీ వైకల్యం కారణంగా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో తెలియక బాలలతను వెయిటింగ్ లిస్టులో పెట్టారు. మూడేండ్ల తాత్సారం 2007లో చెన్నైలో పోస్టింగ్ ఇచ్చారు. 2012 వరకు ఐదేండ్లు అక్కడ విధులు నిర్వహించింది. ఆ తర్వాత హైదరాబాద్‌కి వచ్చింది.

అందరి కోసం ఆమె..

సివిల్స్‌లో 399వ ర్యాంక్ సాధించినప్పటికీ మూడు సంవత్సరాలు వెయిటింగ్‌లో పెట్టారు. ఆ మూడేండ్లు ఆమె ఖాళీగా కూర్చోలేదు. కానీ.. రాత్రనకా, పగలనకా కష్టపడుతూ, తిండీతిప్పలు మాని ప్రిపేరయ్యేవాళ్లు చాలామంది ఉంటారు. వస్తుందో.. రాదో అని మదనపడేవారు వేలల్లో ఉన్నారు. వారిలో చైతన్యాన్ని నింపాలని నిశ్చయించుకుంది. కోచింగ్ సెంటర్లలో క్లాసులు చెప్పడం మొదలుపెట్టింది. సబ్జెక్ట్ ఎలా గుర్తు పెట్టుకోవాలి అనే అంశం నుంచి.. మౌఖిక పరీక్ష దాకా ఎలా నెగ్గాలో పాఠాలు బోధించింది. వారిలో చైతన్యాన్ని రగిలించేందుకు తన జీవితాన్నే ఉదాహరణగా చెప్పింది. తెలంగాణ స్టడీ సర్కిల్‌లో కూడా క్లాసులు చెప్పింది. ఈ సమయం ఆమెను సబ్జెక్ట్ పరంగా బాగా పదును పెట్టింది. ఆమె క్లాసులు విని పరీక్ష రాసిన వారికి మంచి ర్యాంకులు వచ్చాయి. ఉన్నతాధికారులుగా ఉద్యోగాలు సాధించారు. అయినా.. ఆమెలో ఏదో తెలియని నిరాశ, ఇంకా ఏదో సాధించాలన్న కసి, ఏదో చేయాలన్న తపన ఇవన్నీ ఆమెను ఖాళీగా ఉండనివ్వలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది నిరాశతో ఏమీ చేయలేక, కుటుంబ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏదో పనిచేసుకుంటూ లైఫ్‌లో కాంప్రమైజ్ అయి బతుకుతున్నారు. వారికి స్ఫూర్తిగా నిలవాలనుకున్నది. అందుకే తను మళ్లీ సివిల్స్ రాసి ంది. ఈసారి 167వ ర్యాంక్ సాధించింది. ఆమె సాధించిన రిజల్ట్ ఎంతోమందిలో స్ఫూర్తిని రగిలించింది.

హోదా కాదు.. బాధ్యత

ఉద్యోగం ఎవరైనా సంపాదిస్తారు. కాస్త కష్టపడితే ఉద్యోగం వస్తుంది. కానీ.. ఆ ఉద్యోగం ఎవరి కోసం? మన కోసమా? మన కుటుంబం కోసమా? సమాజం కోసమా? అనే ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉండాలి. చాలామంది సివిల్స్‌కి ప్రిపేరవుతారు. కానీ.. కొందరే ఎంపికవుతారు. సివిల్స్‌లో ఏదో ఒక శాఖలో తూతూమంత్రంగా ఉద్యోగం చేసి, ప్రతీ నెల ఒకటో తారీఖున జీతం తీసుకోవడం కాదు. ప్రజలకు, సమాజానికి మనం ఉపయోగపడాలి. ప్రభుత్వ సేవలు ఎలా పొందాలో తెలియని అమాయకులు, రైతులు, పేదలు, మహిళలు ఎంతోమంది ఉన్నారు. వారికి బాసటగా నిలువాలి. హోదా మరిచి సహృదయంతో అందరికీ సాయమందించగలుగాలి. ఉన్నత ఉద్యోగం అంటే.. ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కాదు. ఎక్కువ బాధ్యతలున్న ఉద్యోగం. ఉన్నతంగా ఆలోచించగలరు అని పరీక్షించి ఇచ్చే ఉద్యోగం. మొన్న కేరళ వరదల సమయంలో మనం చూశాం. హోదా మరిచి ఐఏఎస్‌లు బురదలో దిగి మరీ సేవలందించారు. క్రిష్ణతేజ, రోణంకి గోపాలకృష్ణ, ప్రశాంత, ఆనంద్ ఇలా ఎందరో నా దగ్గర సివిల్స్‌కి శిక్షణ తీసుకున్నారు. నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి, నా దగ్గరికి శిక్షణకు వచ్చే అభ్యర్థులకు స్ఫూర్తిగా, పోటీగా ఉండడానికి వారితో పాటు నేను కూడా పరీక్ష రాస్తాను. కొన్నిసార్లు నా స్టూడెంట్స్ నా కంటే మెరుగైన ర్యాంక్స్ సాధిస్తారు. అలా చాలామంది సివిల్స్ అధికారులుగా సేవలందిస్తున్నారు అంటున్నది బాలలత.
Balalatha

నేనున్నానని చెప్పేలా..

ఒకప్పుడు అందరూ నన్ను నడవలేని అమ్మాయిగానే గుర్తించారు. ఒక రకమైన జాలి, దయతో నన్ను చూశారు. ఆ చూపులు నాలో కసిని పెంచాయి. శరీరంలో లోపం ఉన్నవాళ్లు జీవితంలో ఏదీ సాధించలేరా? అనిపించింది. నేను ఇలా పుట్టాను సరే.. ఇలాగే ఉండిపోతే.. జీవితానికి అర్థం ఏంటి? ఈ ప్రశ్నల్లోంచి పుట్టిన ఆలోచన నన్ను ఖాళీగా ఉండనివ్వలేదు. ఏదో చేయాలని తరిమేది. చదువుకుని, నాలుగు పరీక్షలు రాసి, మెరిట్ కొట్టి, ర్యాంకులతో, మంచి ఉద్యోగం సంపాదించి లైఫ్‌లో సెటిలైపోవడం కాదు జీవితమంటే. సాధించాలన్న తపన ఉండి చేయూత లేక, ప్రోత్సాహం లేక, చేతకాక, చేయందించేవారు లేక వెనకబడిపోతున్న ఎంతోమందికి నేను చేయందించాలి.
- మల్లవరపు బాలలత
-ప్రవీణ్‌కుమార్ సుంకరి గడసంతల శ్రీనివాస్

607
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles