బాత్ రూం టైళ్లు.. భలే గిరాకీ


Sat,February 16, 2019 01:34 AM

bath-room
ఇంటి నిర్మాణంలో టైళ్లకు గల ప్రత్యేకత అందరికి తెలిసిందే. ఆదనపు అంగులను హద్దుతూ, ఇంటిలో కాంతులను వెదజల్లే టైళ్ల మార్కెట్‌లో పలు డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. గదికి అనుగుణంగా ప్రత్యేక టైల్ ఉన్నట్లుగానే బాత్‌రూంకి కూడా ప్రత్యేక డిజైన్లతో టైళ్లు ఉన్నాయి. అయితే ఇక మీదట భారత్‌లో బాత్‌రూం రకాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని ఇటీవల ఒక ప్రైవేటు కంపెనీ జరిపిన సర్వేలో వెల్లడైంది. దీనికి కారణం కూడా వివరించిందా సంస్థ. పరిశుభ్రత విషయంలో భారతీయుల్లో జాగ్రత్త పడుతున్నారని, అందుకే పరిశుభ్రత సదుపాయాలు కల్పించుకునేందుకు ఖర్చుకు వెనకాడటం లేదని తెలిపింది. ఇందులో భాగంగా బాత్‌రూం, టాయ్‌లెట్లలో నాణ్యమైన టైళ్లు వేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది.

బ్యాక్టీరియా, ఇతర క్రిములను నిరోధించే నానో టెక్నాలజీ ద్వారా తయారైన టైళ్లు.. ఈ రంగంలో కొత్త మార్పుకు నాంది పలకనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ తరహా టైళ్లను క్లినిక్స్, హాస్పిటల్స్, లాబోరేటరీస్, ఆహార పదార్థాల శుద్ధీకరణ ప్లాంట్లలో వినియోగిస్తున్నట్లు చెప్పింది. నూతన హంగులతో ఇంట్లో సైతం ఇలాంటి టైళ్లు వేసుకునే రోజులు ముందున్నట్లు వెల్లడించింది. 2017 నాటికి భారత బాత్‌రూం టైళ్ల వ్యాపారం 5,945 మిలియన్ డాలర్ల జరిగిందని, ఇది 2023 నాటికి 10,480 మిలియన్ డాలర్లకు చేరుతుందని స్పష్టం చేసింది.

అందానికి, ఆరోగ్యానికి మెట్లు!

గృహ నిర్మాణంలో మెట్లకున్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మెట్ల నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు. మెట్లు నిర్దేశించిన రీతిలో ఉంటే జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు మార్గంగా ఉపయోగపడుతాయని గృహరంగ నిపుణులు చెబుతుంటారు. అందుకే, చిన్నారులు, వృద్ధులు సహా ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోకుండా మెట్ల నిర్మాణం చేసుకోవాలి.
-ఇంట్లో లేదా ఇంటి బయట ఉన్న మెట్ల మీద సరైన వెలుతురు పడేలా ఏర్పాటు చేసుకోవాలి. లేకుంటే మెట్లు కనిపించకపోవటం వల్ల కిందపడిపోతారు. మెట్ల వద్ద ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేసి, స్విచ్ అక్కడే అందుబాటులో ఏర్పాటు చేస్తే రాత్రివేళలో ఇబ్బందులు ఉండవు.
-మెట్లకు రంగులు వేయడం వల్ల అవి స్పష్టంగా కనిపిస్తాయి. రెండు మెట్లకు మధ్యలో మరొక రంగు ఉండేలా చూసుకోవాలి. నచ్చిన రంగులను వాడుకొని మెట్లను స్పష్టంగా విభజించాలి. మెట్లపై ఉండే పైభాగం మరీ నునుపుగా ఉండకుండా చూసుకోవాలి. టైల్స్ వేసినప్పటికీ కాస్త గరుకుగా ఉండేలా చూసుకుంటే మంచిది.
-హ్యాండ్ రెయిలింగ్ మెట్లకు రెండు పక్కలా ఉండేలా చూసుకోవాలి. నూతన హంగులతో కూడిన డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. మెట్లు ఉన్నంత మేర ఇవి ఉండాలి. పెద్దవారి మోచేతికి ఆధారం ఇచ్చేలా ఉంటే మేలు.
-ఇంట్లో చిన్నపిల్లలు, లేదా అనారోగ్యంతో ఉన్న పెద్దలు, పెంపుడు జంతువులు గనుక ఉంటే మెట్లకు ప్రత్యేకంగా చిన్న గేటు ఏర్పాటు చేసుకోవాలి.
-మెట్ల పైన ఎలాంటి ఇతర వస్తువులు ఉండకుండా చూసుకోవాలి. పిల్లల ఆడుతూ మెట్ల మీద కొన్ని వస్తువులు పడేస్తుంటారు. మెట్లు ఎక్కే సమయంలో ఇవి ఇబ్బందులకు గురి చేస్తాయి. మెట్ల పక్కనే విద్యుత్తు బోర్డులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
-మెట్ల నిర్మాణంలోనే కాదు, మెట్లు ఎక్కుతున్న క్రమంలోనూ జాగ్రత్తగా ఉండాలి. హ్యాండ్ రెయిలింగ్‌పై ఒక చేతిని ఉంచి మెట్లు ఎక్కడం అన్ని వేళలా మంచిది. ఇక మెట్లు ఎక్కుతూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల పడిపోయే అవకాశం ఉంటుంది. నడిచే సమయంలో ధ్యాస మెట్లపైనే ఉండాలని గుర్తుంచుకోండి.

748
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles