బడ్జెట్.. భలే ప్రోత్సాహం


Sat,February 2, 2019 12:18 AM

Investment
అమ్మకాల్లేక కునారిల్లుతున్న దేశీయ నిర్మాణ రంగానికి ఊరటనిచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్‌లో పలు ప్రోత్సాహాకాల్ని ప్రకటించారని భారత డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే, 2019 బడ్జెట్‌ను స్వాగతిస్తుమని ముక్తకంఠంతో చెబుతున్నారు.


అందుబాటు గృహాలను నిర్మించే డెవలపర్లకిచ్చే పన్ను రాయితీని మరో ఏడాది దాకా పొడిగించారు. నిర్మాణం పూర్తయ్యాక అమ్మకాల్లేక ఉన్న గృహాలపై పన్నును మరో రెండేండ్ల వరకూ పెంచారు. దీర్ఘకాలిక మూలధనంపై రూ.2 కోట్ల దాకా పన్ను లాభాన్ని గతంలో ఒక ఇల్లును మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతినిచ్చేవారు. ఇప్పుడా పరిమితిని రెండు ఇండ్లకు పొడిగించారు. రెండో ఇల్లును కొనుగోలు చేస్తే పన్ను మినహాయింపును కల్పించారు. జీవితకాలంలో లభించే ఇదో గొప్ప అవకాశంగా ఇండ్ల కొనుగోలుదారులు భావించే అవకాశముంది. నిర్మాణం పూర్తయ్యాక అమ్మకుండా ఉన్న ఇండ్లపై వసూలు చేసే పన్ను ప్రయోజనాన్ని కేవలం ఏడాది వరకే ఉండేది. ఇప్పుడు దీన్ని రెండేండ్లకు పెంచడం సానుకూలాంశం. ఎందుకంటే, దేశవ్యాప్తంగా అమ్ముడుకాని ఇండ్లు దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల దాకా ఉంటాయని సమాచారం. ప్రాజెక్టు పూర్తయ్యే తేదీ నుంచి వ్యవధిని లెక్కిస్తారు.

- మనదేశంలో అనేక మంది మధ్యతరగతి వేతనజీవులు, ఉద్యోగ నిమిత్తం లేదా పిల్లల ఉన్నత విద్య కోసమో రెండు ప్రాంతాల్లో నివసిస్తుంటారు. ఇలాంటి వారికి గల రెండో ఇంటిపై ఆదాయ పన్ను రాయితీని బడ్జెట్‌లో కల్పించారు. అద్దెలపై టీడీఎస్ పరిమితిని రూ.1.80 లక్షల నుంచి రూ.2.40 లక్షలకు పెంచారు. నిర్మాణంలో ఉన్న ఇండ్ల నుంచి జీఎస్టీని 12 శాతం వసూలు చేస్తున్నారు. అందుబాటు గృహాలైతే 8 శాతం తీసుకుంటున్నారు. ఈ జీఎస్టీని తగ్గించాలని దేశీయ నిర్మాణ రంగమంతా కోరుతున్నది. దీంతో, మంత్రుల బృందం అందజేసే సిఫార్సుల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రెరా, బినామీ లావాదేవీల నియంత్రణ చట్టం వల్ల నిర్మాణ రంగంలో మరింత పారదర్శకత నెలకొన్నదని అన్నారు. 2016లో ప్రవేశపెట్టిన సెక్షన్ 80- ఐబిఏను 2017లో రద్దు చేశారు. మళ్లీ దీన్ని ప్రవేశపెడుతూ.. ప్రాజెక్టుల్ని పూర్తి చేసే వ్యవధిని మూడేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచడం స్వాగతించాల్సిన విషయం.


2022 నాటికి అందరికీ ఇండ్లు

నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఆర్థికమంత్రి నిర్ణయాలు తీసుకున్నందుకు ధన్యవాదాలు. దీర్ఘకాలిక మూలధన లాభంపై పన్ను విధించే విషయంలో మంచి ప్రోత్సాహాన్ని అందించారు. ఇప్పటివరకూ ఒక ఇల్లు విక్రయించడం ద్వారా వచ్చే సొమ్మును మరో ఒక ఇంటిని కొనుగోలు చేస్తేనే పన్ను ప్రయోజనం ఉండేది. ఇప్పుడీ పరిమితిని రెండు ఇండ్లకు పొడిగించారు. టీడీఎస్‌ను 2.40 లక్షలకు పొడిగించడం, అమ్ముడుకాని ఇండ్లపై పన్ను రాయితీని రెండేండ్లకు పెంచడం వంటివి ఆహ్వానించదగ్గ నిర్ణయాలని చెప్పొచ్చు.
- జక్సే షా, అధ్యక్షుడు, క్రెడాయ్ నేషనల్


పీఎంఏవై పథకం ఊసే లేదు..

సామాన్య వేతనజీవులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నది. రూ.5 లక్షల వరకూ ఆదాయ పన్ను రాయితీని కల్పించడం స్వాగతించాల్సిన విషయం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మూడు, నాలుగేండ్ల దాకా పొడిగిస్తారని ఆశించాను. అయితే, రానున్న కొత్త బడ్జెట్‌లోనైనా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. దేశవ్యాప్తంగా భూముల విలువ పెరిగిన నేపథ్యంలో.. వడ్డీ రాయితీని రూ.2.5 లక్షల నుంచి కొంతమేరకు పెంచాలి. అదేవిధంగా, ఈ పథకాన్ని మరికొంతకాలం పొడిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. డెవలపర్ల కోణంలో చూస్తే.. అందుబాటు గృహాల ప్రాజెక్టులకు పన్ను మినహాయింపును కల్పించడం మంచి నిర్ణయం.
- కె.రవీందర్‌రెడ్డి, ఛైర్మన్, జనప్రియ ఇంజినీర్స్


రెండేండ్లకు పెంపుదల

అందుబాటు గృహాల ప్రాజెక్టులపై సెక్షన్ 80 ఐబీఏ కింద పన్ను ప్రయోజనం కేవలం ఒక్క ఏడాదికే ఉండేది. ఇప్పుడీ అవకాశాన్ని రెండేండ్లు పొడిగించారు. దీని వల్ల అందుబాటు గృహాల్ని నిర్మించడానికి అనేకమంది డెవలపర్లు ముందుకొస్తారు. వ్యక్తిగత ఆదాయ పన్ను రాయితీని రూ.5 లక్షలకు పెంచడం వల్ల, ప్రజలు సొంతింటి కొనుగోలును చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది.
- గుమ్మి రాంరెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్ తెలంగాణ


దేశప్రగతికి చక్కటి బాట

2019 బడ్జెట్‌లో విప్లవాత్మక నిర్ణయాల్ని తీసుకున్నందుకు ఆర్థికమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈసారి బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరిచేలా ఉంది. నిర్మాణ రంగానికీ ఎంతో ప్రోత్సాహాకరంగా ఉండటం విశేషం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విజన్ 2030 వల్ల సరికొత్త భారత్ సాక్షాత్కరించే అవకాశముంది. ఇది దేశ ఆర్థిక ప్రగతికి చక్కటి బాట వేస్తుంది.
- గీతాంబర్ ఆనంద్, ఛైర్మన్, క్రెడాయ్ నేషనల్

305
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles