ఫ్లాట్ ఆలస్యమైతే.. పరిహారమే!


Sat,January 26, 2019 12:46 AM

RERA
ఫ్లాట్లను డెవలపర్లు సకాలంలో అందించకపోతే.. వారి నుంచి కొనుగోలుదారులు వడ్డీ వసూలు చేయవచ్చని మహారాష్ట్ర రెరా ఛైర్మన్ గౌతమ్ ఛటర్జీ స్పష్టం చేశారు. అపార్టుమెంట్ అయినా విల్లా అయినా స్థలయజమానికీ అట్టి నిర్మాణంలో బాధ్యత ఉంటుందన్నారు. రెరాపై అవగాహన సదస్సును ఇటీవల తెలంగాణ రెరా అథారిటీ సీడీఎంఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. 1.1.2017 తర్వాత స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకునే ప్రతి ప్రాజెక్టు రెరా పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. కొందరు డెవలపర్లు ప్లాన్లను మారుస్తుంటారని.. అలాంటి మార్పుల్ని చేసినా.. రెరా పరిధిలోకి వస్తారని
వెల్లడించారు. రెరాకు సంబంధించి పలు కీలకమైన విషయాల్ని వివరించారు. సారాంశం ఆయన మాటల్లోనే..


ఒకవేళ డెవలపర్లు ఫ్లాట్లను అందజేయడం ఆలస్యమైతే.. కొనుగోలుదారులు వడ్డీని వసూలు చేయవచ్చు. రెరాలో పేర్కొన్న తేదీ కంటే ఏమాత్రం ఫ్లాట్ అప్పగింత ఆలస్యమైనా.. ఈ విషయాన్ని రెరా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం లభిస్తుంది. ఒకవేళ, ప్రమోటర్ చెప్పిన తేది కంటే మరీ ఎక్కువ ఆలస్యం జరిగినట్లయితే.. రెరా చట్టం 2016 సెక్షన్ 18 ప్రకారం, ఆయా ప్రాజెక్టులో నుంచి కొనుగోలుదారులు నిష్క్రమించవచ్చు. తనకు రావాల్సిన సొమ్మును తీసుకుని వెనక్కి వచ్చే వెసులుబాటును రెరా చట్టం కల్పిస్తున్నది.


కో- ప్రమోటర్..

హైకోర్టు తీర్పు ప్రకారం కో- ప్రమోటర్ అనే పదం రెరాలో లేనే లేదు. కానీ, రెవెన్యూ రికార్డుల్లో స్థల యజమాని వాటా ఉంటే.. అట్టి స్థల యజమానిని కూడా ప్రమోటర్ (స్థలయజమాని)గా రెరాలో పేర్కొంటారు. స్థల యజమానులు తమ భూమిని అపార్టుమెంట్లు లేదా విల్లాల్ని నిర్మించేందుకు డెవలపర్‌కు అందజేయడాన్ని మనం చూస్తుంటాం. అయితే, నిర్మాణం విషయంలో అంతా డెవలపర్‌దే బాధ్యత అని చాలామంది స్థల యజమానులు భావిస్తుంటారు. ఏదైనా సమస్య వస్తే డెవలపర్ మీదే నెట్టేయడానికి ప్రయత్నిస్తారు. కానీ, స్థల యజమాని కూడా ఆయా ప్రాజెక్టుకు ప్రమోటర్ కాబట్టి.. అతనికీ బాధ్యత ఉంటుంది. రెరా ప్రకారం.. ఎవరి బాధ్యత ఏమిటనే విషయాన్ని నిర్ణయించడానికి, వారి మధ్య కుదిరిన ఒప్పంద పత్రం ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు.


అధిక శాతం యజమానులుంటే?

కొన్ని సందర్భాల్లో బడా ప్రాజెక్టుల్ని చేయాల్సి వచ్చినప్పుడు.. అధిక స్థలం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఎక్కువ మంది స్థలయజమానుల్ని ప్రాజెక్టులో భాగస్వామ్యుల్ని చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో రెరాలో ప్రాజెక్టును నమోదు చేసేటప్పుడు.. అందరి స్థలయజమానుల పేర్లను తప్పకుండా పేర్కొనాల్సి ఉంటుంది. సంబంధిత స్థల యజమానికి గల స్థలాన్ని బట్టి.. అతని వివరాల్ని రెరాలో పొందుపర్చాలి.


ఇప్పటికే ఆలస్యం.. మళ్లీ రెరా అనుమతి?

ఒక నిర్మాణాన్ని ప్రారంభించాలంటే పలు ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలి. దీనికే అధిక సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రెరా వద్ద అనుమతి తీసుకోవడం వల్ల.. ప్రాజెక్టు ఆలస్యమవుతుంది. అయితే, ఇతర విభాగాలకు అనుమతుల్ని త్వరగా మంజూరు చేసేలా.. సూచనల్ని ఇచ్చే విధంగా రెరాను తీర్చిదిద్దాలి. ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లింది. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉన్నది.


ఎస్క్రోలో స్థలయజమాని వాటా..

కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తంలో 70 శాతాన్ని ఎస్క్రో ఖాతా (ప్రత్యేక బ్యాంకు ఖాతా)లో జమ చేయాలన్నది నిబంధన. ఈ మొత్తాన్ని ఎవరి నిష్పత్తి ప్రకారం వారు జమ చేయాలి. అంతేతప్ప, డెవలపర్లే ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి.. స్థల యజమానులు చేయకూడదనే నిబంధన ఏమీ లేదు. రెవెన్యూ వాటా స్థలయజమాని పేరు పొందుపర్చి ఉంటే.. అతను కూడా 70 శాతాన్ని జమ చేయాలన్న దానితో బాధ్యుడు అవుతారు.


ఒకవేళ స్థల యజమానులు ఒప్పుకోకపోతే..

కొన్ని సందర్భాల్లో స్థలయజమానులు రెరా నిబంధనల్ని పాటించడానికి అంగీకరించడం లేదు. డెబ్బయ్ శాతం సొమ్మును ఎస్క్రో ఖాతాలో జమ చేయడానికి ముందుకు రావడం లేదు. అసలు, రెరా నిబంధనల్ని పాటించడానికి సానుకూలంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో డెవలపర్లు.. ఆయా కేసుల్ని రెరా దృష్టికి తీసుకురావాలి. వారిద్దరు రాసుకున్న ఒప్పందం ప్రకారం, సమస్యను రెరా పరిష్కరిస్తుంది.


70-30 శాతం?

రెరా చట్టం ప్రకారం, కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్ములో 70 శాతాన్ని ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి. అట్టి సొమ్ముతో నిర్మాణ పనుల్ని చేపట్టాలి. ఈ లెక్కల్ని రెరా పర్యవేక్షిస్తున్నది. మిగతా ముప్పయ్ శాతం సొమ్మును ఇతర అవసరాల నిమిత్తం వినియోగించుకోవచ్చు.


చిన్న మార్పులుంటే ఏం చేయాలి?

డెవలపర్లు ప్రారంభించిన అపార్టుమెంట్లు 1.1.2017 కంటే ముందే పూర్తయిన తర్వాత.. స్వల్ప మార్పులకు అనుమతిని 1.1.2017 తర్వాత తీసుకుని నిర్మించినా.. అట్టి సముదాయం రెరా పరిధిలోకి వస్తుందని గుర్తుంచుకోండి. ప్రమోటర్ తప్పనిసరిగా ఆయా ప్రాజెక్టును రెరాలో నమోదు చేయించాలి.


ఐదేండ్ల దాకా డెవలపర్‌దే బాధ్యత..

స్ట్రక్చరల్, సేవాలోపాలు వంటి అంశాల్ని రెరా చట్టం 2017 సెక్షన్ 14 (3) లో పేర్కొనలేదు. అయినప్పటికీ, ఐదేండ్ల దాకా నిర్మాణ లోపాల బాధ్యత డెవలపర్‌దే. ఈ విషయంలో ఎలాంటి అస్పష్టత అక్కర్లేదు. కాకపోతే, ఈ చట్టం సక్రమంగా అమలయ్యే విధంగా రెరా అథారిటీ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


సొంతంగా ప్రాజెక్టు చేపడితే..

అమ్మకం నిమిత్తం కాకుండా సొంతంగా ప్రాజెక్టును చేపడితే.. అట్టి నిర్మాణం రెరా పరిధిలోకి రానే రాదు. ఎందుకంటే, ఇక్కడ అమ్మకాలంటూ ఏమీ జరగలేదు. కాబట్టి, రెరా పరిధిలోకి వచ్చే అవకాశమే లేదు.


టైటిల్ ఇన్సూరెన్స్?

రెరా నిబంధనల ప్రకారం.. ప్రతి ప్రాజెక్టుకు టైటిల్ ఇన్సూరెన్స్‌ను తప్పకుండా తీసుకోవాలనే నిబంధన ఏమీ లేదు. కాబట్టి, ఈ విషయంలో చింతించాల్సిన అవసరమేం లేదు.

RERA1

ప్లాట్లు రీసేల్ చేస్తే?

కొంతమంది 2017 కంటే ముందే ప్లాట్లు కొనుగోలు చేసి ఉన్నారు.. అలాంటి వారంతా ప్రస్తుతం విక్రయిస్తున్నారు. ఇలాంటి లావాదేవీలు రెరా పరిధిలోకి రావు. కేవలం 2017 జనవరి 1 తర్వాత ఆరంభమైన వెంచర్లు మాత్రమే రెరా పరిధిలోకి వస్తాయి. అలాంటి వాటిలో కొనుగోలు చేసేవారు.. రెరా నుంచి ప్రమోటర్ అనుమతి తీసుకున్నాడా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆతర్వాతే ముందడుగు వేయాలి. మొదటిసారి ప్లాటు కొన్నవారు.. తిరిగి అదే ప్లాటును విక్రయిస్తే.. రెరా పరిధిలోకి రారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

328
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles