e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home జిందగీ ఫ్యాషన్‌ బ్రాండ్‌సృష్టిస్తా!

ఫ్యాషన్‌ బ్రాండ్‌సృష్టిస్తా!


అరమోడ్పు కండ్లతో, కట్టిపడేసే చూపులతో ‘వరూధిని’గా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచింది బుల్లితెర నటి చందన సాగు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించినా .. మోడలింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వంటి రంగాల్లోనూ ఆమెకు ప్రవేశం ఉంది. తన చిన్నతెర ప్రయాణం గురించి ‘జిందగీ’తో చందన పంచుకున్న ముచ్చట్లు..

ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు?
మాది బెంగళూర్‌. నా చిన్నప్పుడు అమ్మ కన్నడ ఇండస్ట్రీలో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా చేసేది. అమ్మతోపాటు రికార్డింగ్‌ థియేటర్‌కు వెళ్ళేదాన్ని. అక్కడివారికి నా గొంతు నచ్చింది. నన్నూ డబ్బింగ్‌ చెప్పమన్నారు. అలా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలైంది. అప్పుడే కన్నడలో ఒక షార్ట్‌ ఫిల్మ్‌లో, రెండు సీరియళ్లలో చిన్నచిన్న పాత్రలు చేసే అవకాశం వచ్చింది. నటిని అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనే నటించా. నాన్నకూ నటనంటే ఆసక్తి. అప్పుడప్పుడు స్టేజ్‌ షోల్లో చేస్తుండేవారు. నన్నూ ప్రోత్సహించారు. అలా నేను నటించిన ఓ యూట్యూబ్‌ వీడియో ద్వారా ‘వరూధిని పరిణయం’లో అవకాశం వచ్చింది. అప్పటినుంచి తెలుగు, కన్నడ, తమిళ సీరియల్స్‌లో నటిస్తున్నా.

- Advertisement -

నటి కాకపోయి ఉంటే?
నేను ఫ్యాషన్‌ టెక్నాలజీలో డిగ్రీ చేశాను. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అంటే ఇష్టం. నాకు బెస్ట్‌ ఫ్యాషన్‌ కొరియోగ్రఫీ, బెస్ట్‌ మోడల్‌ అవార్డులు కూడా వచ్చాయి. చాలావరకు నా డ్రెస్సులన్నీ నేనే డిజైన్‌ చేసుకుంటా. నాకు మనుషుల్ని చదవడం అంటే ఇష్టం. అందుకే సైకాలజీలో రెండు సర్టిఫికెట్‌ కోర్సులు చేశాను. ఇతరుల మనస్తత్వాలను అధ్యయనం చేయడంతోపాటు నన్ను నేను లోతుగా తెలుసుకునేందుకు ఇష్టపడతాను. నాకు పాటలన్నా ప్రాణమే. సంగీతం నేర్చుకున్నా. కానీ స్వరపేటిక సమస్యతో కొన్నాళ్ళ నుంచీ పాడటం లేదు.

భాష విషయంలో ఇబ్బందిపడ్డారా?
‘వరూధిని పరిణయం’ చేస్తున్నప్పుడు తెలుగు అంతగా అర్థమయ్యేది కాదు. కానీ డైలాగ్స్‌ ఇంగ్లిష్‌లో రాసుకుని, ప్రామ్టింగ్‌ లేకుండా చెప్పేందుకు ప్రయత్నించేదాన్ని. తమిళంలోనూ ఇదే సమస్య ఎదురైంది. కానీ ఇప్పుడు తెలుగు, తమిళం బాగా మాట్లాడగలను. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో భాషతోపాటు కాస్ట్యూమ్స్‌తో కూడా ఇబ్బందిపడ్డా. అప్పటివరకూ వేసుకోని దుస్తులు కాబట్టి, కొంత అసౌకర్యంగా ఉండేది.

ఇండస్ట్రీలో మీరు ఆదర్శంగా తీసుకునే వ్యక్తులు?
ప్రియాంకా చోప్రా అంటే ఇష్టం. నటనలోనే కాదు, వ్యక్తిగతంగానూ నాకు ఆదర్శం. ఒడుదొడుకుల్ని ఎదుర్కొని కెరీర్‌ను చక్కగా మలుచుకున్న శక్తిమంతురాలైన మహిళ తను. లుక్స్‌పరంగా కూడా ప్రతి సినిమాకూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొనే తీరు స్ఫూర్తిదాయకం.

సినిమాల్లో నటించారా?
ప్రస్తుతం కన్నడలో ‘రమేష్‌-సురేష్‌’ అనే సినిమాతోపాటు మరో మూవీ చేస్తున్నాను. జీ తెలుగు ‘వరూధిని పరిణయం’ చేస్తున్నప్పుడు తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ చేయలేదు. మంచి కథ, ప్రాధాన్యం ఉన్న పాత్ర అయితేనే సినిమాల్లో చేస్తాను. నేనువైవిధ్యాన్ని కోరుకుంటాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ భిన్నమైనవే.

ఎప్పుడూ గుర్తుండిపోయే సంఘటన?
‘వరూధిని పరిణయం’ ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఆ సీరియల్‌ ద్వారా చాలా గుర్తింపు వచ్చింది. ఎంతోమంది ఆదరాభిమానాలను పొందాను. ఓ ఫంక్షన్‌లో కలిసినప్పుడు గాయని జానకమ్మగారు నా నటనను మెచ్చుకొన్నారు. రోజూ నా సీరియళ్ళు చూస్తానన్నారు. నా మొదటి సీరియల్‌ నుంచి అన్నీ ఫాలో అవుతున్నానని చెప్పారు. సీనియర్‌ నటి ఖుష్బూ నన్ను ప్రత్యేకంగా కలిసి, తమిళంతోపాటు మరో నాలుగు భాషల్లో నిర్మించిన ‘జ్యోతి’ సీరియల్లో చేయమని అడిగారు.

తెలుగు అభిమానుల గురించి..
నన్ను కుటుంబ సభ్యురాలిగా ప్రోత్సహించి, ఆదరించింది అభిమానులే. కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు.. ఎదురైన ప్రతి సమస్యనూ సవాలుగా తీసుకున్నా. నటిగా నాకు మంచి గుర్తింపునిచ్చింది తెలుగు పరిశ్రమే. అదే నమ్మకంతో మూడేండ్ల తర్వాత జీ తెలుగు ‘స్వర్ణ ప్యాలెస్‌’తో మళ్ళీ తెలుగు అభిమానుల ముందుకొచ్చాను.

భవిష్యత్‌ ప్రణాళిక?
ఫ్యాషన్‌ డిజైనర్‌గా నాదైన ఓ బ్రాండ్‌ క్రియేట్‌ చేయాలని ఉంది. నాకు జంతువులంటే ప్రేమ. ఐదేండ్ల్లుగా యానిమల్‌ రెస్క్యూ టీమ్‌లో స్వచ్ఛందంగా పనిచేస్తున్నా. ఇష్టమైన పనిచేసుకుంటూ, ఆనందంగా ఉండటమే నా జీవిత లక్ష్యం.

  • ప్రవళిక వేముల
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana