ఫ్యాట్ టు ఫిట్ - 22


Sat,July 19, 2014 04:33 AM

yogaచక్రాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనికి చక్రాసనం అని పేరు. దీన్నే ఊర్ధ్వ ధనురాసనం అని కూడా అంటారు. ఒకేసారి చక్రాసనంలో కాకుండా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ సాధన చేస్తే కష్టమైన ఈ ఆసనాన్ని సాధించి అబ్డామినల్ చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకొని ఫిట్‌గా తయారవచ్చు.
ముందుగా వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లనూ పిరుదుల దగ్గరకు తీసుకురావాలి. రెండు మడమలను నడుము దగ్గర ఆన్చాలి. రెండు చేతులను ఒకదాని తరువాత ఒకటి నెమ్మదిగా భుజాల కిందుగా ఉంచాలి. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా తలను, వీపును, నడుమును భూమి నుంచి పైకి లేపాలి. చేతులను, పాదాలను భూమి మీద ప్రెస్ చేస్తూ తలను, నడుమును వీలైనంత పైకి లేపాలి. ఉండగలిగినంత సమయం ఉన్న తరువాత గాలి వదులుతూ యథాస్థితికి రావాలి. అన్ని ఆసనాల కన్నా ఇది కొంచెం కఠినంగా ఉంటుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం.

స్టెప్ బై స్టెప్

1. నడుము, భుజాలు మాత్రమే పైకి లేపి ఈ స్థితిలో ఉండగలిగినంత సమయం ఉండి యథాస్థితికి రావాలి.
2. ఈ స్థితిలో నడుము, భుజాలతోపాటు తలను కొద్దిగా లేపి తల మధ్యభాగం భూమి మీద ఆనేటట్లుగా ఉంచాలి. ఇదే స్థితిలో ఉండగలిగినంత సమయం ఉండి యథాస్థితికి రావాలి.
3. ఇదే చక్రాసనం. 4. చక్రాసన స్థితిలోకి వచ్చాక నెమ్మదిగా పాదాల మడమలను ఎత్తి, వేళ్లమీద మాత్రమే ఉండగలిగినంత సమయం ఉండాలి. తరువాత నెమ్మదిగా మడమలు నేలకు ఆన్చి యథాస్థితికి రావాలి.
5. చక్రాసన స్థితిలోకి వచ్చాక నెమ్మదిగా కుడిపాదం మీద బ్యాలెన్స్ కుదుర్చుకొని, ఎడమ కాలును వీలున్నంతగా పైకి లేపాలి. ఉండగలిగినంత సమయం ఉండి నెమ్మదిగా యథాస్థితికి రావాలి.
ఒకేరోజు అన్ని స్టెప్స్ ప్రయత్నించకూడదు. ఒక్కో స్టెప్ బాగా చేయగలుగుతున్నాం అన్న తరువాత మరో స్టెప్‌కు వెళ్లాలి. అంటే ఒక 15 రోజులు ఒక స్టెప్ మాత్రమే ప్రయత్నం చేయాలి. దీంతో పూర్తి చక్రాసనం వల్ల కలిగే లాభాలు పొందవచ్చు.

ఉపయోగాలు :

-నాడీ వ్యవస్థ సంపూర్ణంగా ఉత్తేజితం అవుతుంది.
- భుజాలు, వీపు దగ్గర పేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది.
- ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది.
- ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి, ఆర్టిస్టులకు, పిల్లలకు చాలా మంచిది.

జాగ్రత్తలు :

- నీరసంగా ఉన్నప్పుడు చేయకూడదు.
- ముంజేతులు బలహీనంగా ఉన్నవారు చేయకూడదు.

గమనిక

- యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.
- నిపుణుల ఆధ్వర్యంలో చేయడం మంచిది.

6202
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles