ఫ్యాట్ టు ఫిట్ - 20


Sat,July 5, 2014 01:19 AM

యోగా వల్ల పాంక్రియాస్ ఉత్తేజితం అవుతుంది. అంతేకాదు దాని తీరు కూడా మెరుగుపడుతుంది. అందుకే ఈ సర్వాంగాసనం, హలాసనం. అయితే ఈ రెండు ఆసనాలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. వీలైతే నిపుణుల పర్యవేక్షణలో చేస్తే మరీ మంచిది.

SARVAGASANAM

సర్వాంగాసనం

వెల్లకిలా పడుకోవాలి. గాలి పీల్చి వదిలేస్తూ ఒక నిమిషం రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు గాలి పీల్చుకొని రెండు కాళ్లను 90డిగ్రీల వరకు పైకి లేపాలి. తర్వాత గాలి వదిలేస్తూ నడుము భాగాన్ని, పొట్టభాగాన్ని భూమి మీద నుంచి పైకి లేపాలి. రెండు చేతులతో నడుము వద్ద సపోర్ట్ తీసుకుంటూ మొత్తం శరీర భాగాన్ని నేలకు లంబకోణంలో నిటారుగా నిలపాలి. మోకాళ్లను వంచకూడదు. దష్టిని కాలి వేళ్లమీద నిలపాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సమయం ఉండాలి. ఆ సమయంలో ఊపిరి మామూలుగా తీసుకోవాలి. నెమ్మదిగా వెన్నెముకను భూమి మీదకు తెస్తూ ముందుగా వీపు, నడుము, చివరగా కాళ్లు భూమిని తాకేలా చూడాలి. తరువాత శవాసనంలో రిలాక్స్ అవ్వాలి.

ఉపయోగాలు :
- శరీరంలో శక్తిని ఇనుమడింపచేస్తుంది.
- జుట్టు రాలడం నివారిస్తుంది.
- థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితం అవుతుంది.
- ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
- మెదడుకు రక్తప్రసరణను పెంచుతుంది.

జాగ్రత్తలు :
-సర్వైకల్ స్పాండిలైటిస్, స్లిప్ డిస్క్, హైబీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చెయ్యకూడదు.

HALASANAM

హలాసనం

ముందుగా వెల్లకిలా నేల మీద పడుకోవాలి. గాలి పీల్చుకొని నెమ్మదిగా గాలి వదులుతూ రెండు కాళ్ళను సమాంతరంగా లేపి తలమీదుగా వెనక్కి తీసుకెళ్ళి భూమి మీద ఆన్చాలి. మొదట చేసేటప్పుడు నడుము దగ్గర చేతుల సపోర్టు తీసుకోవచ్చు. సపోర్ట్ అవసరం లేదనుకుంటే చేతులు కింద పెట్టవచ్చు. రెండు మోకాళ్ళు వంచకుండా ఉండాలి. ఆసనస్థితిలో నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇలా ఉండగలిగినంత సమయం ఉండి నెమ్మదిగా యథాస్థితికి రావాలి. కాళ్ళు రెండూ నేలకు ఆనేవరకు మోకాళ్ళు వంచకూడదు. ఆసనం తర్వాత శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. మొదట 20 సెకన్ల నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా ఆసనస్థితిలో ఉండే సమయం పెంచాలి. మొదట కాళ్ళు నేలకు ఆనకున్నా... ప్రయత్నం మీద సాధించవచ్చు.

ఉపయోగాలు :
-కాలిలో ఉన్న అన్ని కండరాలు, లిగమెంట్లు బాగా స్ట్రెచ్ అవ్వడం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
-లెగ్ క్రాంప్స్‌తో బాధపడే వారికి ఇది చాలా ఊరటనిస్తుంది.
-పొట్ట భాగం కుంచింపబడడం వలన ఆసనస్థితి నుంచి బయటికి వచ్చినప్పుడు ఒక్కసారిగా రక్తప్రసరణ పెరుగుతుంది.
-టాక్సిన్లు బయటకి విడుదలవుతాయి. ఇదే స్థితి మెడ వద్ద, ఊపిరితిత్తుల వద్ద కూడా జరుగుతుంది.
-నిద్రపోయినప్పుడు వెన్నెముక కంప్రెస్ అయినట్లు, స్టిఫ్ అయినట్లు అనిపిస్తే ఉదయం లేవగానే వార్మ్ అప్ తర్వాత హలాసనం ప్రాక్టీస్ చెయ్యవచ్చు.
-థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది.
-లివర్, కిడ్నీలను ఉత్తేజితం చేస్తుంది.

గమనిక

- యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

5701
Tags

More News

VIRAL NEWS