ఫ్యాటీ లివర్ ఉంటే ఏం తినాలి?


Sat,May 11, 2019 12:29 AM

నా వయసు 45 ఏండ్లు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. సెటిల్‌మెంట్ల నేపథ్యంలో నేను ఎక్కువగా విందుల్లో పాల్గొంటాను. రెగ్యులర్‌గా నాన్‌వెజ్.. ఆల్కహాల్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ మధ్య ఏదీ పడటం లేదు. కానీ నేనున్న సర్కిల్‌లో అలా ఉంటే నడవదు. నా ఆరోగ్య సమస్య ఏంటో తెలుసుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించా. ఫ్యాటీ లివర్ అన్నారు. ఈ సమస్య ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏం మందులు వాడాలి? దయచేసి తెలుపగలరు.
- రత్నాకర్‌గౌడ్, శంషాబాద్

Councelling
మీరు అధిక కొవ్వులు కలిగిన ఆహారం, ఆల్కహాల్ రోజూ తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఆల్కహాల్ తీసుకుంటేనే బిజినెస్ నడుస్తుంది అనుకోవడం ఒక భ్రమ అంతే. మాకు తెలిసిన చాలామంది స్థిరాస్తి రంగంలో ఉన్నారు. వాళ్లెవరికీ ఆల్కహాల్ అలవాట్లు లేవు. బాగానే సంపాదిస్తున్నారు. అంటే.. మీరు అనుకుంటే ఆల్కహాల్.. నాన్‌వెజ్ మానేయడం పెద్ద విషయమేమీ కాదు. మీ వయసు వారికి మామూలుగా రోజుకు 25-40గ్రాముల కొవ్వు పదార్థాలు సరిపోతాయి. ఇవి 15-30% క్యాలరీలను అందిస్తాయి. మీరు దీనికి మించి తీసుకుంటున్నారు. అదే ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీసింది. కొబ్బరినూనె, పాల పదార్థాలు, జంతు కొవ్వులు శరీరానికి మంచివే అయినప్పటికీ మోతాదు మించితే ప్రమాదం. మీరు ఒక రోజులో వారానికి సరిపడా నాన్‌వెజ్.. ఆల్కహాల్ తీసుకున్నారు. మీకు ఇప్పుడు అది కూడా పడటం లేదు. కాబట్టి మానేయండి. సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్స్, మొక్కజొన్నలు వంటివి చాలా మంచివి. ఇవి తీసుకోండి. మీ శరీర బరువు అధికంగా ఉంది అన్నారు కానీ ఎంత అనేది పర్టిక్యులర్‌గా చెప్పలేదు. మీ శరీర బరువును తగ్గించుకునేందుకు రోజూ వ్యాయామం చేయండి. స్థూలకాయులైతే ORLI, STAT మందులు వాడండి. అధికంగా కొవ్వు ఉంటే STATINS మందులు వాడండి. విటమిన్-ఇ, బెటానైన్, ఎస్‌ఎడినోజిన్, మిథియోనైన్, యూర్సోడియాక్సికోలిక్ యాసిడ్ వంటివి డాక్టర్ సలహా మేరకు వాడితే ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది.

-డాక్టర్ భవానీరాజు
కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
కేర్‌హాస్పిటల్స్, బంజారాహిల్స్

231
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles