ఫుడ్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త ఒరవడి సాక్షిబాసిస్ తుల్సియన్


Mon,April 8, 2019 12:19 AM

ఆమె తన అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇప్పుడు ఒక గొప్ప బిజినెస్‌గా రూపాంతరం చెందింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వివిధ రెస్టారెంట్లకు సంబంధించి టేబుల్స్, డెలివరీ, మెనూకార్డ్ ఖర్చు వివరాలు తెలుసుకోవచ్చు. వేర్వేరు వ్యాపారాల్లో ఉన్న భార్యభర్తలు ఆసక్తి కొద్ది రెస్టారెంట్‌లో పెట్టుబడి పెట్టారు. అది లాభాలు తెచ్చి పెట్టడంతో వారే ఇక స్వయంగా ఒక ఫుడ్ ఫ్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలనుకున్నారు. అలా మొదలైందే పొసిస్ట్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వదులుకొని ఈటరీ మేనేజ్‌మెంట్ ఫ్లాట్‌ఫామ్‌ను నడుపుతున్న పొసిస్ట్ సహవ్యవస్థాపకురాలు సాక్షిబాసిన్ తుల్సియన్ సక్సెస్‌మంత్ర.
yourstory-sakshi
మా అవసరాల నుంచి పోసిస్ట్ ప్రాణం పోసుకుంది అంటారు సాక్షి. దీన్ని బిజినెస్ ఐడియాగా ప్రారంభించలేదు. నేను, మా ఆయన వెబ్ డెవలప్‌మెంట్, టెలికాం వాయిస్ కంపెనీలు నడుపుతున్నాం. వాటితో పాటు మా ఇద్దరికీ ఉన్న ఆసక్తి కొద్దీ రెస్టారెంట్లో పెట్టుబడి పెట్టాం. అది మంచి లాభాలు తెచ్చి పెట్టింది. కాకపోతే స్వయంగా దానికి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవాల్సి వచ్చేది. దాంతో పోసిస్ట్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటుచేయాలనే ఆలోచన కలిగింది. పోసిస్ట్ అనేది సాస్ ఆధారిత ఈటరీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్. రెస్టారెంట్ పరిశ్రమలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు సాక్షి.

ఏం చేయవచ్చు

పోసిస్ట్ ద్వారా టేబుల్ ఆర్డర్లు తీసుకోవచ్చు, డెలివరీ చేయొచ్చు. వాటితో పాటు టేక్ ఎవే, ఖర్చులు, బ్రాంచ్‌లు చూసుకోవడం వంటి వాటికి ఉపయోగపడుతుందని పోసిస్ట్ ఆవిర్భావం గురించి చెప్తారు సాక్షి. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన సాక్షిది న్యూక్లియర్ కుటుంబం. దాంతో కుటుంబ నిర్ణయాల్లో పిల్లలమైన మా భాగస్వామ్యం కూడా ఉండేది. దానివల్లే ఈ స్థాయిలో పనిచేయగలుగుతున్నా అంటారామె. న్యూఢిల్లీలోని భారతి విద్యాపీఠ్ కళాశాలల నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ అందుకున్నారు. గ్రాడ్యుయేషన్ తరువాత పై చదువుల కంటే కూడా జీవితాన్ని చదివి నేర్చుకోవాలనుకున్నాను. మా నాన్న పదహారేళ్లకే పనిచేయడం మొదలుపెట్టారు. ఒక పక్క పనిచేస్తూనే పోస్టు గ్రాడ్యుయేషన్ చదివారాయన. పాతికేళ్లకే సొంతంగా కంపెనీ పెట్టారు. ఆయన స్ఫూర్తితోనే నేను స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకునేదాన్ని. 2012లో నేను, మా ఆయన కలిసి పోసిస్ట్ ప్రారంభించాం. ఇది క్లౌడ్ ఆధారిత రెస్టారెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ అంటున్న ఆమె మహిళలు ఆల్‌రౌండర్‌గా ఉండాలంటున్నారు.

ఉద్యోగంలో చేరి

సాక్షి తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సపియంట్‌లో ఉద్యోగం సంపాదించింది. అయితే తను కోరుకున్నది అది కాదు. ప్రపంచ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేలా తనను తాను తీర్చిదిద్దుకోవాలనుకుంది. అందుకే ఆమె తన భవిష్యత్ విద్యను కొనసాగించడానికి ఇష్టపడలేదు. తండ్రి పనితనమే ఆమె వెనుక ప్రేరణగా ఉందని చెబుతారామె.

ఇద్దరి ప్రోత్సాహం

సాక్షి తండ్రి, భర్త ఆమెను ఎంతో ప్రేరేపించారట. ఆమె భర్త ఆశిష్ కూడా వ్యాపారవేత్తగా ఉన్నారు. ఆయనే సాక్షికి ఎల్లప్పుడూ గురువుగా ఉన్నాడు. సపియంట్‌లో రెండు సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన తరువాత, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే సంకల్పం మరింత బలపడింది సాక్షికి. సపియంట్‌లో పనిచేస్తున్న సమయంలో ఆమె వివిధ విషయాలను అధ్యయనం చేయడానికి అవకాశం కలిగింది. వనరుల ప్రణాళిక, సమావేశ లక్ష్యాలు, బిల్లింగ్ క్లయింట్లు నిర్వహణ డెలివరీలు ఇలా అన్నింటి మీదా అవగాహన పెంచుకున్నారు.

పోసిస్ట్ ప్రారంభం

వెబ్‌చానల్‌ను ప్రారంభించడం ఒక అద్భుతమైన అనుభవం అంటారు సాక్షి. అంతేకాదు ఇది ఒక రోలర్ కోస్టర్ రైడ్ అని ఖచ్చితంగా చెప్పగలనంటారు. నేను టెక్ నుండి ఓప్స్ వరకు ప్రతిదీ చేశాను. అమ్మకాలకు ఏమేం సహయపడుతాయో అన్నింటినీ పరిశీలించాను. దాన్ని వల్ల నా వ్యక్తిత్వాన్ని మరింత పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడింది అని సాక్షి తన అనుభవాన్ని వెల్లడించారు. ఆ తర్వాత 2012లో తన భర్తతో కలిసి పోసిస్ట్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు.
yourstory-sakshi1

మహిళా పారిశ్రామికవేత్తగా

వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా సాక్షి మహిళా పారిశ్రామికవేత్తగా మారింది. అయితే సాక్షి తను ఎప్పుడూ ఆల్‌రౌండర్‌గా ఉండాలనే కోరుకుంది. కొంత సమయం వచ్చిన తర్వాత పురుషులు విరామం కోరుకుంటారు. సామాజికంగా కూడా అది ఆమోదించాల్సిందే. అయితే స్త్రీ మాత్రం తన చుట్టూ ఎన్ని లగ్జరీలు ఉన్నా , ఎంతమంది ఉదారవాదులున్నా విరామానికి అవకాశం లేదు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సంతులినాన్ని సృష్టించగలగడం కేవలం స్త్రీలకు మాత్రమే సాధ్యమని సాక్షి అంటారు. అయితే తనకు తన తల్లిదండ్రులతో పాటు అత్తమామల మద్దతు కూడా లభించడం తన అదృష్టమని సాక్షి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

భవిష్యత్తు ప్రణాళికలు

ప్రస్తుతానికి, ఆమె పోసిస్ట్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు. రెస్టారెంట్ విభాగంలో ఒక బ్రాండ్‌గా నిలపాలన్నదే తన భవిష్యత్ ప్రణాళిక అని సాక్షి స్పష్టం చేశారు. ఆమె ఖాళీగా ఉన్న సమయంలో కొన్ని స్టార్టప్‌లకు సలహాలు సూచనలు ఇవ్వడం చేస్తున్నారు. ఆ స్టార్టప్‌లు కొన్ని పోసిస్ట్‌లో పెట్టుబడులు కూడా పెట్టాయి. మా ప్రయాణంలో మేం సాధించిన విజయం, వైఫల్యాన్ని వారితో పంచుకోవడం నాకు ఆనందం కలిగిస్తుంది అని ఆమె చెప్పింది, రాబోయే కాలంలో అవి తనకు మరింతగా ఉపయోగపడుతాయని ఆమె విశ్వసిస్తుంది. అంతేకాదు సాక్షి తదుపరి వెంచర్‌గా పెద్ద స్టార్టప్‌ను వినియోగదారుల విభాగంలో ప్రారంభించే ఆలోచనలో ఉంది.

తనే రోల్‌మోడల్

ప్రపంచ అతిపెద్ద స్టార్టప్ అధినేత మరిస్సా మేయర్ తన రోల్‌మోడల్ అని సాక్షి చెబుతారు. ఆమె ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగడంతో పాటు అన్ని రకాల పాత్రలను పోషించడంలో విజయం సాధించింది. మహిళా ఒక కుటుంబ వ్యక్తిగా ఉన్నా ఎలాంటి సంస్థనైనా నిర్వహించగలనని ఆమె నిరూపించింది అని సాక్షి తెలిపింది. అమె ఒక మహిళగానే కాకుండా వ్యాపారవేత్తగా నాకు స్ఫూర్తిగా నిలిచారు. నేను పోసిస్ట్‌ను ప్రారంభించడం వెనుక ఆమె ప్రేరణ ఎంతో ఉంది అని చెబుతుంది సాక్షి.

751
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles