ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ఎఫ్‌డీ కన్నా బెటర్


Sat,March 9, 2019 12:12 AM

ఫిక్స్‌డ్ డిపాజిట్లను చాలా మంది సురక్షిత మదుపుగా భావిస్తారు. మన తాతల కాలం నుంచి వాటికి ఆ గుర్తింపు ఉంది. బ్యాంకుకు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేస్తే చాలు ఇక హాయిగా నిద్ర పోవచ్చు. వీటి మీద వచ్చే రిటర్నులు తక్కువే అయినప్పటికీ బ్యాంకులో ఇలా మదుపు చేయడం మనకు ఒక సంస్కృతిగా అలవాటైపోయింది. అయితే రుణ మార్కెట్‌లో తక్కువ రిస్కుతోనే ఇంతకంటే ఎక్కువ రిటర్నులు పొందడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన ఆలోచన తీరును మార్చుకోవాల్సిన
అవసరం ఉంది. మనలో చాలామందికి ఈక్విటీ, డెట్ ఫండ్లు అంటే ఏమిటో తెలుసు. వాటి గురించి చాలానే విన్నాం, వింటున్నాం, చదివాం. ఇవి కాకుండా ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్‌ల (ఎఫ్‌ఎంఫీ) పేరుతో కొన్ని మదుపు అవకాశాలు మన ముందున్నాయి. వాటిపై ఇన్వెస్టర్లకు అవగాహన చాలా తక్కువగా ఉంది. తెలిసినా చాలా తక్కువ విషయాలు మాత్రమే తెలుసు.

fmp

స్థిరంగా ఆదాయాన్ని ఇచ్చే మంచి రేటింగ్ ఉన్న కార్పోరేట్ బాండ్లు, ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, డిపాజిట్ సర్టిఫికెట్లు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు(ఎన్‌సీడీ)లు, మనీ మార్కెట్‌కు సంబంధించిన ఇతర వనరులలో ఎఫ్‌ఎంపీలు మదుపు చేస్తాయి. మామూలుగా ఎఫ్‌ఎంపీల కాలపరిమితిలోనే మదుపు కాలపరిమితి కూడా ఉంటుంది. ఎఫ్‌ఎంపీలు ప్రధానంగా క్లోజ్ ఎండెడ్ పథకాలు. అంటే, ఫండ్ ఆఫర్ చేసినప్పుడు మాత్రమే వాటిని కొనుగోలు చేయడానికి వీలుంటుంది. ఆ తర్వాత వాటిని కొనలేం. ఒక రకంగా ఎఫ్‌ఎంపీ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటిదే. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోల్చితే వీటిలో కొన్ని అదనపు సానుకూలాంశాలున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో మదుపుపరంగా వైవిధ్యత ఏమీ ఉండదు. ఏదో ఒక బ్యాంకు లేదా కార్పోరేట్ సంస్థలో మాత్రమే డబ్బును డిపాజిట్ చేస్తాం. కాబట్టి రిస్క్ ఒకింత ఎక్కువే. ఎఫ్‌ఎంపీలు అలా కాదు. ఇన్వెస్టర్లు మదుపు చేసిన డబ్బును రకరకాల బాండ్లు, కమర్షియల్ పేపర్లలో తిరిగి మదుపు చేస్తాయి. దానివల్ల రిస్క్ తగ్గుతుంది. స్థిరమైన రీతిలో నిర్దిష్ట రాబడులు అందుకోవడానికి వీలు అవుతుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోల్చితే ఎఫ్‌ఎంపీలకున్న మరో సానుకూలత ఏమిటంటే నిధులను ప్రొఫెషనల్ నైపుణ్యంతో నిర్వహించడం ఎఫ్‌డీ నిధుల నిర్వహణలో అలాంటి ప్రొఫెషనల్ నైపుణ్యం కనిపించదు. డెట్ మ్యూచువల్ ఫండ్లతో పోల్చితే కూడా ఎఫ్‌ఎంపీలు చాలా వరకు బెటర్. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ఇన్వెస్టర్లు, రిటైర్‌మెంట్ వయసు దగ్గరపడిన వాళ్లు ఎక్కువగా డెట్ ఫండ్లలో మదుపు చేయడానికి ఆసక్తి చూపుతారు. తాము పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉండడమే కాకుండా క్రమం తప్పకుండా ఆదాయం పొందే అవకాశం వాటిలో ఉండడమే అందుకు కారణం. కానీ, కొంత సునిశితంగా గమనిస్తే, ఎఫ్‌ఎంపీల కన్నా డెట్ ఫండ్లలోనే ప్రతికూలాంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. క్రెడిట్, వడ్డీ రేట్లు తగ్గితే బాండ్ల విలువ పెరుగుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న సమయంలో మీరు మీ దగ్గరున్న బాండ్లను మార్కెట్ రేటు కన్నా తక్కువకు అమ్మేస్తారు. వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు బాండ్లను మార్కెట్ రేటు కన్నా ప్రీమియం రేటుకు అమ్మేస్తారు. ఈ వడ్డీ రేట్ల ఒడిదుడుకుల ప్రభావం ఎఫ్‌ఎంపీల విషయంలో ఉండదు. ఎందుకంటే, ఎఫ్‌ఎంపీలలో చేసిన మదుపుపై వడ్డీ రేటు నిర్దిష్ట కాలానికి స్థిరంగా ఉంటుంది.

బయటి మార్కెట్‌లో వడ్డీరేట్ల ఉత్థాన పతనాలకు దీనికి సంబంధం ఉండదు. ఆ ఒడిదుడుకులతో ఎఫ్‌ఎంపీలపై ప్రభావం ఏమీ ఉండదు. మరో విషయం - ఎఫ్‌ఎంపీలతో పన్ను భారం కూడా అధికంగా ఉండదు. డివిడెండ్లు, వృద్ధిరేటు అవకాశాల ఆధారంగా ఎఫ్‌ఎంపీలు అందించే రాబడులపై పన్నును నిర్ణయిస్తారు. మీరు ఒకవేళ డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, మీరు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్‌ను (డిడిటీ) చెల్లించాల్సి ఉంటుంది. నిధులు నిర్వహించే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ స్థాయిలోనే ఆ పన్నును మినహాయిస్తారు. ఒకవేళ మీరు గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వర్తిస్తుంది. మూడేండ్ల కాలానికి మించి ఎఫ్‌ఎంపీలలో మదుపు చేస్తే, ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో కలిపి రాబడుల మీద 20 శాతం పన్ను ఉంటుంది. అయితే, డిఫాల్ట్ రిస్క్‌ల నుంచి ఎఫ్‌ఎంపీలకు రక్షణ ఏమీ ఉండదు. కానీ, నిధులను నిర్వహించే ఫండ్ మేనేజ్‌మెంట్ జాగ్రత్తగా ఉండే తీరుకు అనుగుణంగా ఈ రిస్క్ తగ్గుతూ ఉంటుంది. ఇక ఎఫ్‌ఎంపీల విషయంలో మరో సమస్య.. నిర్దిష్ట గడువు ముగిసే వరకూ లిక్విడిటీ లేకపోవడం.
fmp1
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ, ఇన్వెస్టర్లు మదుపు పరంగా తాము ఎంచుకున్న భద్రతా పరిధి బయటకు వచ్చి ఎఫ్‌ఎంపీలతో ఉన్న రకరకాల ప్రయోజనాలను అందుకునే ప్రయత్నం చేయాలి. మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు, పెరుగుతున్న వడ్డీ రేట్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, మదుపు పరంగా ఎఫ్‌ఎంపీలు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక బెటర్ ఆప్షన్. పెట్టుబడి పెట్టినప్పుడు ఏ రిటర్నులు ఆశిస్తామో ఆ రిటర్నులు అందుకోవడానికి వీటిలో అవకాశం ఎక్కువ.
sanjay-kumar

258
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles