e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home జిందగీ ప్లవ నాయకి!

ప్లవ నాయకి!

ప్లవ నాయకి!

కాకి నలుపు.కోకిల నలుపు.నిటారు స్తంభంపై బికారి అరుపు ఒకదానిది.చిటారు కొమ్మన మిఠాయి గొంతుక మరోదానిది. వసంతం వస్తే గానీ,ఈ రెండిటి మధ్యా తేడా తెలుసుకోలేం!సందర్భం వచ్చినప్పుడే నిరూపించుకోవాలి.ఉగాదిని మించిన సమయం మరేముంటుంది?శార్వరి ఉగాదినాడు, ప్రశాంతంగా ఊపిరి తీసుకోకుండా చేసిన కరోనా విలయం..ఇప్పటికీ మనల్ని వదల్లేదు .కొవిడ్‌ విపత్తుతో తల్లడిల్లుతున్న అవని కష్టాన్ని అతివ తప్ప ఎవరు అర్థం చేసుకోగలరు?ఇంటిని తీర్చిదిద్దే ఇంతి దక్షతే ఇప్పుడు దేశానికి రక్ష. ఆ ప్రయత్నంలో ఆమెకు ‘ప్లవ’ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది.

ప్లవ అంటే ఒడ్డుకు చేర్చే నావ అనే అర్థముంది. కొవిడ్‌ కష్టాల సుడిగుండాల నుంచి ఇంటిల్లిపాదినీ దాటించే దేవత అమ్మ. ఇన్నాళ్లూ ఇంట్లో వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లి ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరించాల్సిందే! ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ పరిస్థితులు గాడి తప్పకుండా చూసుకోవాలంటే ఆమె విభిన్నమైన పాత్రలు పోషించాల్సిందే! తీపి, కారం, పులుపు, వగరు, ఉప్పు, చేదు.. ఇలా షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసి అందరికీ పంచడంతోనే, ఉగాది పండుగ ముగిసిందనుకోవద్దు. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదుఃఖాలను సరైన స్ఫూర్తితో స్వీకరించాలని ఆ రసాలు మనకు పాఠాలు చెబుతాయి. అందులో ఉపయోగించే పదార్థాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఆ స్ఫూర్తిని తీసుకొని, ఆ తత్వాలను సమయోచితంగా ఆవాహన చేసుకొని కొవిడ్‌ ముప్పును దాటించాలి. కాలం రుతురాగాలను మార్చినట్టు, సందర్భోచితంగా నేటి మహిళ పదునైన పాత్రలను మేటిగా పోషించాలి!

ఉగాది పచ్చడి తయారీ మొక్కుబడి తంతు కాదు. పెద్దలు నిర్దేశించిన ప్రకారం చేయాలి. ఇందులో తీపి, కారం సమానంగా ఉండాలి. వీటి మోతాదులో సగం పులుపు, వగరు ఉండాలి. ఇందులో సగం వంతు ఉప్పు, చేదు వేయాలి. రాబోయే రోజుల్లో ఇంతులందరూ ఇదే మోతాదులో తమతమ పాత్రలను పండించగలిగితే ఉగాది ఉషస్సు ఏడాదంతా నిలిచే ఉంటుంది.

ఆప్యాయతే తీపి కానుక
తనను కన్నవారికి, తాను కన్నవారికి ప్రేమను పంచాలని ఏ ఆడకూతురుకూ చెప్పాల్సిన పనిలేదు. కానీ, కొవిడ్‌ కలకలం మొదలవ్వగానే గతేడాది ఎదురైన కఠినమైన అనుభవాలు మళ్లీ కండ్ల ముందుకొస్తున్నాయి. ఆర్థిక మూలాలు దెబ్బతింటాయేమోనన్న భయం, పిల్లల చదువులు మళ్లీ ఆన్‌లైన్‌కే పరిమితమవుతాయా అనే సందేహం, భర్త ఉద్యోగం ఏమవుతుందోనన్న ఆందోళన, వయసు మళ్లిన అత్తామామలపై బెంగ.. ఇన్ని సమస్యలకు పరిష్కారం.. మోవిపై చెరగని చిరునవ్వు. ఆ ఒక్కటీ ఎప్పుడూ కొనసాగిస్తే చిరాకులన్నీ పరారవుతాయి. మన చేతుల్లో లేని వాటి గురించి ఆందోళన పడటంలో అర్థం లేదు. ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ఇల్లాలు మారగలిగితే ఇంట్లోవాళ్లంతా మారడం పెద్ద కష్టమేం కాదు. అందుకే, విపత్కర కాలాన్ని ప్రేమతో నెగ్గుకురావాలి. ఆప్యాయతను పంచుతూ అందరినీ ఆనందంగా ఉంచాలి.

‘వగరు’స్తూ ఉండిపోవద్దు
ఉగాది పచ్చడిలో వగరు కోసం లేత మామిడి కాయలను ఉపయోగిస్తారు. పక్వానికి రాకముందు మామిడి వగరుగానే ఉంటుంది. కానీ, ఆ కాయ తియ్యదనాన్ని పంచుతుందో, పులుపెక్కుతుందో కాలమే సమాధానం చెబుతుంది. ఇంట్లో పరిస్థితులూ అంతే! ఆరంభంలో ఏదీ ఓ పట్టాన అర్థం కాదు. అలాగని ప్రతిదాన్నీ శంకించాల్సిన పనిలేదు. ఆదిలోనే అడ్డు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. దూరదృష్టితో ఆలోచించి, మంచి-చెడు బేరీజు వేసుకొని సరైన నిర్ణయం తీసుకోగలిగితే భవిష్యత్తులో వగరుస్తూ ఉండాల్సిన పరిస్థితి తలెత్తదు. గతేడాది ఏ ఆయుధాలు లేకుండానే కొవిడ్‌పై సమరం సాగించిన మనకు, తాజాగా టీకా రక్షణ అందుబాటులోకి వచ్చింది. ఈ తరుణంలో అనుమానాన్ని పెనుభూతంగా మార్చుకోవద్దు. అలాగని నిర్లక్ష్య వైఖరి కూడా పనికిరాదు. వచ్చుకాలము మేలు గతము కంటెన్‌ అనుకొని ముందడుగు వేయాలి.

గారంగా కారంగా..
మమకారాలు పంచితే సరిపోదు. అవసరమైతే కారాలూ నూరాల్సిందే! పిల్లలంటే ఎంత గారమున్నా అల్లరి శ్రుతి మించితే ఏ తల్లీ ఊరుకోదు. మందలించినా వినకపోతే ఓ దెబ్బ వేస్తుంది. కానీ, ఇంట్లో పెద్దలు దారి తప్పితే మాత్రం, మనసులోనే కుమిలిపోతుంది. మంచంపై అటుపక్కకు తిరిగి కంటనీరు పెట్టుకుంటుంది. ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలుస్తున్నా ఆమెపై ఇంటాయనకు ఎప్పుడూ చిన్నచూపే! కేవలం భర్త ఒక్కడే సంపాదిస్తుంటే, ఆ ఇంట్లో వాతావరణం మరెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ, ఆమె సహకారం లేకుండా ఇంటిని నిర్వహించడం అనుకున్నంత తేలిక కాదు. ఈ విషయం శ్రీవారికి, ఇంట్లో ఉన్న పెద్దలకు అర్థమవ్వాలంటే కాస్త కారంగానే.. అంటే ఘాటుగానే వ్యవహరించాలి. అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తపరచాలి. ఆర్థికాంశాల్లో కటువుగా ఉండాలి! అలాగని తెగేదాకా లాగొద్దు, మొత్తానికే వదులు చేయొద్దు. పట్టువిడుపులు ప్రదర్శిస్తూ పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలి.

పులుపు చెప్పే పాఠం
ఎంత వద్దనుకున్నా పులుపు తినకుండా ఉండలేం. కానీ, పులుపు ఎక్కువైతే శరీరానికి చింతలు అధికమవుతాయి. పదార్థం పులిసే కొద్దీ ఆరోగ్యానికి హానికరం అవుతుంది. ఇదే సూత్రాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. సంసారం అన్నాక చిన్నచిన్న చికాకులు ఉంటాయి. సందేహాలూ తలెత్తుతాయి. వాటిని అప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలే కానీ, ఆరాలు తీయకుండా గుండె అర్రలో వాటికి చోటిచ్చి పులియబెడితే మనసుకు హాని కలుగుతుంది. అది ఊహించని మలుపునకు దారి తీస్తుంది. వంటకాల్లో పులుపును ఎలాగైతే పరిమితంగా వాడుతామో, కుటుంబ అనుబంధాల విషయంలో ఆశలూ అంతే పరిమితం కావాలి. అతి నమ్మకాలు, అత్యాశలు వద్దు. అవి నెరవేరలేదని బాధపడనూ వద్దు. ఇలాంటి సందర్భాల్లో పులుపు పాఠం గుర్తు తెచ్చుకొని హుందాగా వ్యవహరించాలి.

చిటికెడు చాలు
నలభీమ పాకమైనా ఉప్పు లేకపోతే రుచిపుట్టదు. నేటి మహిళకు మల్టీటాస్కింగ్‌ క్వీన్‌ అని పేరు. ఆమె మనసులో చిన్న అపనమ్మకం మొలకెత్తితే, ఆ ప్రభావం ఇంట్లో అందరిపైనా పడుతుంది. చిటికెడంత ఉప్పు పదార్థాన్ని రుచికరంగా మార్చినట్టు, గోరంత నమ్మకం జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ప్రపంచాన్ని కొవిడ్‌ గడగడలాడిస్తున్నా, రానున్న రోజులు బాగుంటాయనే విశ్వాసం మనిషిని ముందుకు నడిపిస్తుంది. క్షమయా ధరిత్రి అన్న కీర్తి మూటగట్టుకున్న తరుణి ఈ తరుణంలో ప్రదర్శించాల్సిన యుక్తి ఇదే! ఇంట్లోవాళ్ల విశ్వాసం సడలకుండా తనే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆన్‌లైన్‌ క్లాసులపై మొహం మొత్తుతున్న పిల్లల్లో, ఆదాయ వ్యయాలపై అసంతృప్తి వ్యక్తం చేసే ఇంటాయనలో స్ఫూర్తి నింపి పునరుత్తేజితుల్ని చేయాలి.

చేదు జ్ఞాపకాల నుంచి
అన్ని రోజులూ ఒకేలా ఉండవు. చీకటి కలకాలం ఉండదు. వెలుతురు రాగానే చీకటి మాయం అవుతుంది. అలాగని వెలుగూ ఎల్లకాలం ఉండదు. మళ్లీ చీకటి తెరలు దాటాల్సిందే! ఇలా చీకటి వెలుగుల కౌగిటిలో జీవితం సాగుతూనే ఉంటుంది. తిమిరాన్ని ఎదుర్కొనే ధైర్యం ప్రోది చేసుకోగలిగితే ఏ భయమూ ఉండదు. అంతేకాదు, చేదును మించిన ఔషధం లేదు. కడుపులో వికారాలన్నిటినీ చేదు కడిగేస్తుంది. కరోనా కాలం అలాంటిదే! ఉన్నంతలో ఎలా బతకాలో నేర్పింది. ఉపాధి అవకాశాలను సృష్టించింది. కొత్త ఆవిష్కరణలకు దారి చూపింది. పరిస్థితులు ఎలాంటివైనా వాటిని స్వీకరించే ధైర్యం అలవర్చుకోవాలి. అందులో నుంచి బయటపడే నేర్పు సంపాదించుకోవాలి. అప్పుడు ప్రతి చేదు జ్ఞాపకం తీపి విజయానికి సోపానం అవుతుంది.
శతాయు వజ్రదేహాయ
సర్వసంపత్‌ కరాయచ
సర్వారిష్ట వినాశాయ
నింబకం దళ బక్షణం

అన్న శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడిని రుచి చూడటం అంటే.. రాబోయే సవాళ్లనూ సంక్షోభాలనూ ఎదుర్కోవడానికి సర్వ సిద్ధంగా ఉన్నామని ప్రకటించడమే!

ఇవీ కూడా చదవండి…

నిరుపేద రాకుమారి..నిలోఫర్‌!

మార్గదర్శి.. పంచాంగం!

సప్త స్వరాలు ఐదు గళాలు

Advertisement
ప్లవ నాయకి!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement