ప్రమోటర్లకు నోటీసులు


Sat,March 2, 2019 12:16 AM

rera
రెరాలో నమోదు చేసుకునే విషయంలో కొందరు డెవలపర్లు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. 2017 జనవరి 1 తర్వాత ప్రాజెక్టుల్ని ప్రారంభించినా.. చకచకా నిర్మాణ పనుల్ని పూర్తి చేసి.. కొనుగోలుదారులకు వీలైనంత త్వరగా అప్పగిస్తున్నారు. వీరంతా రెరా పరిధిలోకి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, ఇలాంటి ప్రాజెక్టులకు సంబంధించి కొనుగోలుదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందినా, వారిపై పది శాతం జరిమానాను విధిస్తామని తెలంగాణ రెరా అథారిటీ చెబుతున్నది.

2017 జనవరి 1 తర్వాత ప్రారంభమైన నిర్మాణాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చినా.. రాకపోయినా.. రెరా అథారిటీ వద్ద నమోదు చేసుకోవాల్సిందే. అట్టి ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొన్నవారు ఆయా డెవలపర్‌పై ఫిర్యాదు చేస్తే.. తెలంగాణ రెరా అథారిటీ కఠినంగా వ్యవహరిస్తుంది. రెరా చట్టం ప్రకారం.. ఆయా డెవలపర్‌పై ప్రాజెక్టు వ్యయంలో పది శాతం జరిమానాను విధిస్తుంది. 2017 జనవరి 1 తర్వాత అనుమతి తీసుకుని ప్రారంభమైన ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొన్నవారు.. రెరా పరిధిలోకి రాకపోతే తమ దృష్టికి తేవాలని తెలంగాణ రెరా అథారిటీ కోరుతున్నది. మోసపూరిత డెవలపర్ల నుంచి కొనుగోలుదారులను రక్షించడమే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు.

587 మందికి..

కొత్త ప్రాజెక్టులను తెలంగాణ రెరా అథారిటీ వద్ద నమోదు చేసుకోవాల్సిందే. అయితే, జరిమానా భారాన్ని తప్పించుకోవడానికి కొందరు ప్రమోటర్లు తెల్ల కాగితాలను పెట్టి మరీ రెరాకు దరఖాస్తు చేసుకున్నారు. అలాంటి వారిలో దాదాపు 587 మంది ప్రమోటర్లకు రెరా అథారిటీ తాజాగా షోకాజ్ నోటీసులిచ్చింది. ప్రాజెక్టులకు సంబంధించిన పత్రాల్ని కొందరు ఆర్కిటెక్టు, స్ట్రక్చరల్ ఇంజినీరు, ఛార్టెడ్ అకౌంటెంట్లు సమర్పించలేదు. అందుకే, వారికి షోకాజ్ నోటీసులను జారీ చేశామని తెలంగాణ రెరా అథారిటీ సభ్యకార్యదర్శి కొమ్ము విద్యాధర్ తెలిపారు. ఇప్పటివరకూ రెరాలో 2,200 దాకా ప్రాజెక్టులు నమోదు అయ్యాయని చెప్పారు. మరో ఎనిమిది వందల ప్రాజెక్టులు రిజిస్టర్ అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2017 జనవరి 1 తర్వాత ప్రారంభమైన నిర్మాణాల్లో రెరా పరిధిలో రాకుండా ప్రయత్నిస్తున్న ప్రమోటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నామన్నారు. క్రెడాయ్ వంటి సంఘాలు రెరాలో డెవలపర్లు నమోదు అయ్యేందుకు ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా.. ఐదు వందల చదరపు మీటర్లు లేదా ఆపై విస్తీర్ణంలో 8 కంటే ఎక్కువ ఫ్లాట్లను నిర్మించే ప్రతిఒక్క ప్రమోటర్ రెరా పరిధిలోకి వస్తారని గుర్తు చేశారు. రెరాలో పాత ప్రాజెక్టులను నమోదు చేసుకునేందుకు ఈ నెల 31 దాకా అవకాశమిచ్చామని తెలిపారు.

209
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles