ప్రతి సినిమా ఓ అనుభవ పాఠమే..!

Wed,January 11, 2017 01:07 AM

40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణం.. అప్రతిహత విజయపరంపర.. బాక్సాఫీస్ రికార్డుల మోతలు.. తనదైన శైలిలో పాత్రలకు ప్రాణప్రతిష్ట..అసంఖ్యాక అభిమానం గణం.. అంతులేని ప్రేమాభిమానాలు.. వెరశి నందమూరి బాలకృష్ణ తన వంద సినిమాల మైలురాయిని అందుకున్నారు. మాస్, యాక్షన్, కుటుంబ కథలతో పాటు సమాకాలీన కథానాయకులకు సాధ్యంకాని పౌరాణిక చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారాయన. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న వందో చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ పాత్రికేయులతో ముచ్చటించినవిశేషాలివి..
Balakrishna

సంక్రాంతికి చిరంజీవితో పోటీపడబోతున్నారు?


-పోటీ అనేది మామూలే. ప్రతి సంక్రాంతికి పోటీ ఉంటుంది. దానిని నేను ఎప్పుడూ పట్టించుకోను. నా సినిమాతో పాటు చిరంజీవి నటించిన సినిమా ఆడాలని కోరుకుంటున్నాను.

గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రలో నటించే అవకాశం వస్తుందని ఎప్పుడైనా ఊహించారా?


-నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అని మహాకవి దాశరథి అన్నారు. భరతఖండానికి నూతన శకాన్ని అందించిన తెలుగు వీరుడు గౌతమి పుత్ర శాతకర్ణి గురించి చరిత్ర మర్చిపోయింది. శాతవాహనుల గురించి పుస్తకాల్లో నాలుగు లైన్లకు మించి కనిపించదు. అలాంటి పరాక్రమవంతుడి పాత్రను పోషించే అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.

చారిత్రక కథాంశంతో వందో సినిమా చేయాలనే ఈ చిత్రాన్ని అంగీకరించారా?


-వందో సినిమా కోసం చాలా కథలు విన్నాను. ఆ స్థాయికి తగిన కథలేవీ దొరకలేదు. కాకతాళీయంగా ఈ సినిమా చేసే అవకాశం లభించింది. ఇలాంటి సినిమా చేస్తానని, చేయాలని అనుకోలేదు. 100వ సినిమాగా గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి కథ దొరకడం అదృష్ణంగా భావిస్తున్నాను.

మీ నాన్నగారు ఎన్టీఆర్ చేయాలని కలలు గన్న పాత్రను మీరు చేయడం ఎలా ఉంది?


-గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రను నాన్నగారు చేయాలని సంకల్పించారు. కానీ రాజకీయాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు. నా కోసమే ఈ పాత్రను ఆయన వదిలివేశారు కావచ్చు. ఆదృశ్యరూపంలో నాన్న నన్ను ఈ పాత్ర చేయడానికి ప్రేరేపించారని అనుకుంటున్నాను. మహానటుడి తనయుడిగా ఇలాంటి చారిత్రక సినిమాను తెలుగు ప్రేక్షకకులకు అందించే అవకాశం దొరికినందుకు చాలా గర్వపడుతున్నాను.

నటుడిగా ఈ సినిమా ద్వారా మీరు నేర్చుకున్నదేమిటి?


-ప్రతి సినిమా, ప్రతి పాత్ర నాకు ఓ అనుభవపాఠమే. ఒక్కొక్క దాని ఒక్కో విషయం నేర్చుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ సినిమా నటుడిగా నాకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది.

క్రిష్‌పై నమ్మకంతోనే ఈ సినిమాను ఒప్పుకున్నారా?


-దర్శకుడిగా క్రిష్ వైవిధ్యమైన పంథాలో ముందుకుసాగుతున్నాడు. ఆ తపన అందరి దర్శకుల్లో కనిపించదు. చాలా మంది అగ్ర దర్శకుల సైతం మూసధోరణిలోనే కథలను సిద్ధం చేస్తున్నారు. మీ కోసమే ఈ కథను తయారుచేశానంటూ మరో హీరో తిరస్కరించిన వాటిని వినిపిస్తుంటారు. నా గత చిత్రాలను పోలిన కథలను చెబుతుంటారు.. ఒకసారి చేసిన కథలు, పాత్రలు మరోసారి ఆకట్టుకుంటాయనే నమ్మకం లేదు. ప్రతి సారి కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించాలన్నదే నా సిద్ధాంతం. ఆ సృజనాత్మకత క్రిష్‌లో ఉంది.

సినిమాల్లో యుద్ధ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి? వాటిలో నటించడం రిస్క్ అనే భావన ఎప్పుడైనా కలిగిందా?


-సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం గ్రాఫిక్స్ వాడుదామని అన్నారు. నేను కుదరదని చెప్పాను. ఒక్కసారి చేస్తానని నిర్ణయించుకున్న తర్వాత వెనక్కి తగ్గను. లెజెండ్‌లో గుర్రంపై నుంచి వెళుతూ అద్దాన్ని పగలగొట్టే సన్నివేశం ఒకటి చేయాల్సివచ్చింది. గ్రాఫిక్స్‌లో ఆ సన్నివేశాన్ని తీద్దామని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. అలాంటివేవీ లేకుండా సహజంగా నేను ఆ సన్నివేశాన్ని ధైర్యంగా పూర్తిచేశాను. పాత్ర కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా నేను సిద్ధమే.

101వ సినిమాను కృష్ణవంశీ దర్శకత్వంలోనే చేయబోతున్నారా?


-కృష్ణవంశీ సినిమాకు సంబంధించి కథ సిద్ధమైంది. అందులో ఓ కీలక పాత్ర కోసం అమితాబ్‌బచ్చన్‌ను అనుకుంటున్నాం. ఆ పాత్ర సినిమాకు కీలకంగా నిలుస్తుంది. ఆయన్ని కలిసి కథ వినిపించాం. భవిష్యత్తులో చేయబోయే ప్రతి కథలో కొత్తదనం ఉండేలా చూసుకుంటాను. ఇక నుంచి పాత్రల పరంగా కొత్త బాలకృష్ణను చూస్తారు.
Gautamiputra

గౌతమి పుత్రశాతకర్ణిగా తెరపై చూసుకున్నప్పుడు ఏమనిపించింది?


-అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. సినిమాను అంగీకరించిన క్షణం నుంచి ఇప్పటికీ అదే ఆనందాన్ని అనుభవిస్తున్నాను. కనిపించని శక్తి ఏదో ఇలాంటి కథతో క్రిష్‌ను నా దగ్గరకు పంపించిందని అనుకుంటున్నాను. ఇలాంటి గొప్ప సినిమాను కేవలం 79 రోజుల్లోనే పూర్తిచేశామంటే దైవ సంకల్పంగానే భావిస్తున్నాను.

ఈ పాత్ర కోసం మీరు ఎలా సన్నద్ధమయ్యారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?


-శాతకర్ణి పాత్ర నాకు సవాల్‌గా నిలిచింది. గతంలో శ్రీకృష్ణుడు, రాముడు పాత్రలను చేశాను. నాన్నగారు చేసినవే కాబట్టి ఆయన్ని అనుకరిస్తూ నా శైలిలో రక్తికట్టించే ప్రయత్నం చేశాను. వాటి కోసం నాన్న గారు ఉపయోగించిన ఆభరణాలు, చిత్రాలు ఉపయోగపడ్డాయి. కానీ గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. ఆయన ఎలా ఉండేవారో ఎవరికి తెలియదు. క్రీస్తుపూర్వానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన పాత్ర కోసం సిద్ధమవ్వడం ఛాలెంజింగ్‌గా భావించాను.

2122
Tags

More News

మరిన్ని వార్తలు...