ప్రజాక్షేమమే పరమావధి


Mon,January 28, 2019 01:23 AM

-రాష్ట్రం కోసమే రాజశ్యామల యాగం

రాజశ్యామల అమ్మవారు మిగిలిన దేవీ స్వరూపాల్లా కాదు. ఈ దేవీ అవతారమే భిన్నం. రాజశ్యామల దేవత.. వనదుర్గ అమ్మవార్ల ఆరాధన దేశంలో ఎక్కడా కనిపించవు. విశాఖలోని శారదాపీఠంలోనే రాజశ్యామల ఆలయం ఉన్నది. పూర్వం రోజుల్లో రాజశ్యామల ఆరాధన, ఉపాసన చాలా ఉండేది. రాజశ్యామల ఉపాసన చేసే ఏకైక పీఠం శారదాపీఠం. ప్రజలు సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ హోమయాగాదులు చేస్తున్నారు అంటున్న విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారితో ఆత్మీయ సంభాషణ.
Yagam
ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలనుకునేవారే రాజశ్యామల హోమం చేస్తారు. కేసీఆర్ గారు అందుకే చేస్తున్నారు. హోమాలను అందరూ చేయలేరు. ప్రతీ హోమానికి కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఎవరు ఎలాంటి హోమం చేయాలనేది నిర్ణయించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎవరైనా.. ఏదో ఒక హోమం చేస్తే సరిపోతుంది అనుకుంటుంటారు చాలామంది. అది తప్పు. ధర్మపరిరక్షణే పీఠాల లక్ష్యం. ధార్మిక పీఠాలు సమాజంలో భాగం అని అంటున్నారు రాజశ్యామల అమ్మవారి ఉపాసకులు, తెలుగు రాష్ర్టాలతోపాటు దేశవ్యాప్తంగా పేరుగాంచిన విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. తెలంగాణ, ఆంధ్ర విడిపోతుందని తాను 2007లోనే చెప్పానని, జ్యోతిషాన్ని ఒక సబ్జెక్టుగా కాకుండా తపస్సును కూడా జోడించినపుడే జ్యోతిషం వాస్తవం అవుతుందని ఆయన అంటున్నారు.

రాజశ్యామల హోమం ఎందుకు చేస్తారు?

రాజ్యక్షేమం కోరేవారు రాజశ్యామల హోమం చేస్తారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమో.. వ్యాపారాల కోసమో.. మరొకటో ఆశించి చేస్తే దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఇది చేయాలంటే ప్రత్యేకత ఉండాలి. ఆ చేసేవారు స్వయంగా ఉపాసకుడై ఉండాలి. చేయించుకునేవారు రాజ్యక్షేమం కోసం చేయాలి.

మంత్రఫలం ఉంటుందంటారా?

అవును. యజ్ఙ, యాగాదులను చేయించే పీఠాధిపతులు గొప్ప ఉపాసకులైతే, చేసేవారిలో నిష్ఠ ఉంటే, రాజుల/యాగకర్తలో నిజాయితీ ఉంటే మంత్రఫలం ఉంటుంది. దీంట్లో ఏ ఒక్కదాంట్లో తేడా వచ్చినా ఉపయోగం ఉండదు. ఈ మూడింటి శక్తి కలిసినపుడు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. దీనికి ఉదాహరణ అయుత చండీయాగమే. కేసీఆర్ అప్పుడు చేయించిన యాగంతో మంచి జరిగింది. పార్టీ పరంగా కావచ్చు. ప్రభుత్వ పరంగా కావచ్చు. ఆయన సాధించిన విజయాలు.. వాటి ఫలితాలు అందరూ చూస్తూనే ఉన్నారు. యాగాలు.. హోమాల విలువ అయనకు తెలుసు కాబట్టే తన కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నారు. నేను ముందే చెప్పినట్లు ఆయనకు అమ్మవారి అనుగ్రహం కూడా ఉన్నది.
Yagam2

పీఠాధిపతులకు ప్రజలతో సంబంధం ఏంటి అంటున్నారుగా కొందరు?

లోకానికి, సమాజానికి కంటకంగా మారిన కొందరు నోటికి వచ్చినట్లు పీఠాల గురించి, పీఠాధిపతుల గురించి మాట్లాడుతుంటారు. పీఠాలు సమాజానికి దూరంగా ఉండవు.. మేం సమాజహితం కోరేవాళ్లమే. మేం కూడా ప్రజల్లో భాగమే. మేం కూడా తల్లిదండ్రులకు పుట్టి.. సమాజంలో పెరిగిన వాళ్లమే. మేం ఆత్మసాక్షాత్కారం పొందినవాళ్లం. మాకు సమాజహితం తప్ప మరేమీ పట్టవు. ధార్మిక ఆలోచనే మాది. కొందరు రాజకీయనాయకులు తమ గుప్పిట ధార్మిక సంస్థలను పెట్టుకుంటున్నారు. దీనివల్ల నష్టం జరుగుతుంది. ఇది సరికాదని చెబుతున్నాం.

పీఠాలు, పిఠాధిపతుల ద్వారానే ధర్మ పరిరక్షణ జరుగుతున్నదంటారా?

పీఠాలు, పీఠాధిపతులు మాట్లాడుతున్నారు కాబట్టే ధర్మపరిరక్షణ జరుగుతున్నది అనేది వందకు వంద శాతం వాస్తవం. మేం పాలనా విషయాల్లో జోక్యం చేసుకోం. శృంగేరి, కంచి, శారదాపీఠంతో సహా ఎవరూ అనవసరంగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. మా తపన ధర్మపరిరక్షణే. సమాజహితం కోరేవాళ్లమే. మేమేమీ రాజకీయ లబ్ది ఆశించేవాళ్లం కాదు. ధర్మపరిరక్షణకు విరుద్దంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే మేం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజలను చైతన్యం చేస్తాం.

హిందూధర్మ సంస్థలపైనా విమర్శలున్నాయి కదా?

కాషాయ జెండా పెట్టుకున్నంత మాత్రాన హిందూ ధర్మరక్షకులు కాలేరు. చాలామందికి ఇదొక కార్యక్రమం అయిపోయింది. కాషాయ జెండా పెట్టుకొని హిందూ ధర్మపరిరక్షకులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది సరికాదు. హిందువులకు ఆయువుపట్టు గోవులు. బీజేపీకి నిజాయితీ ఉంటే, ఈ నేల మీద, ఈ నీటిపై అభిమానం ఉంటే గోవును జాతీయ పశువుగా ప్రకటించాల్సింది. గోరక్షణ జరిగినపుడే హిందూమతం నిలబడినట్టు. గోవులను చంపి దేవాలయాల చుట్టూ తిరిగితే సరిపోదు. గో ధర్మం గొప్పది. పీఠాల ఆధీనంలో ఉన్న దేవాలయాలను, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాలను చూడండి. ప్రభుత్వ ఆధీనంలోని దేవాలయాల్లో పూజా, నిత్యానుష్ఠాన కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ డ్యూటీగానే ఉంటున్నాయి. అదే పీఠాల పరిధిలో ఉండే దేవాలయాల్లో చూడండి. తేడా కనపడుతుంది.

రాజశ్యామల దేవి గురించి?

రాజశ్యామల అమ్మవారు సంక్షేమం, అభివృద్ధిని ఇచ్చే దేవత. అనేక రూపాలతో అమ్మవారి ఆరాధన జరుగుతుంది. గ్రామదేవత మొదలు కామేశ్వరి అమ్మవారు వరకు అనేక రూపాల్లో అమ్మవారిని కొలుస్తుంటాం. రాజశ్యామల అమ్మవారు నానుడిలో ఉండడం చాలా తక్కువ. రాజశ్యామల మాత సామాన్యులకు సంబంధించినది కాదు. శత్రుపీడ తొలగిపోవాలని, దేశం సస్యశ్యామలం కావాలని పూర్వం రాజులు రాజశ్యామల యాగం చేసేవారు. ఇది చాలా పవర్‌ఫుల్. ప్రజాసంక్షేమం కోసం మంత్రులు, ముఖ్యమంత్రులు చేస్తుంటారు. సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి చేసే యాగం ఇది. పరిపాలకుడికి అమ్మవారు అనుగ్రహం ఇస్తుంది.
Yagam3

తెలంగాణ ఏర్పడుతుందని అప్పుడెప్పుడో చెప్పినట్టున్నారు?

తెలంగాణ, ఆంధ్ర విడిపోదని చాలామంది జ్యోతిషం చెప్పారు. పెద్దపెద్ద స్వాములు కూడా చెప్పారు. జ్యోతిషంగా చెప్తే ఫలితం కనపడదు. జ్యోతిష్యానికి తపస్సు కలిస్తేనే ఫలితం కనపడుతుంది. విద్యా తపోభ్యం భూతాత్మ అని శాస్త్రం చెబుతున్నది. విద్యకు తపస్సు కలిస్తేనే ఉపయోగం. ఇంజినీరింగ్, డాక్టర్ చదువుకున్నట్లుగా జ్యోతిషం చెప్తే అవ్వదు. కేసీఆర్‌గారి జాతకం, ఆయన ఆలోచనా విధానాన్ని అంచనా వేసి అమ్మవారి అనుగ్రహంతో మేం రాష్ట్ర విభజనకు అనేక సంవత్సరాల ముందే, రాష్ట్ర విభజన జరుగుతుందని 2007 నవంబరులోనే చెప్పాం. మా శారదాపీఠం ఒక్కటే ఆనాడు తెలంగాణ విభజన తప్పదని చెప్పింది. మాపై అనేకమంది అనేక రకాలుగా వ్యాఖ్యలు చేశారు. అవన్నీ ఇప్పుడు పటాపంచలయినట్టే కదా?

యాగాలు కేసీఆర్‌గారు ఎక్కువగా చేస్తున్నట్లున్నారు కదా? ఆయన పాలనాతీరుపై మీ స్పందనేంటి?

అవును. కేసీఆర్‌కు అమ్మవారి అనుగ్రహం ఉంది. ఆయన ఊరికే చేయడంలేదు. యాగం గురించి తెలిసే చేస్తున్నారు. యాగాలకు విశ్వసనీయత ఉంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనేవాళ్లు కూడా ఉన్నారనుకోండి. అది వేరే విషయం. మీకో సంగతి చెప్తాను. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, 2004కు పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో దుర్భిక్షం నెలకొన్నది. వర్షాలు లేవు. ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలోని నాలుగుమూలాల్లో వరుణ యాగం చేయించాం. పత్రికల్లో అయితే వరుణ యాగమా? మేఘమధనమా? అంటూ ఏవేవో కథనాలు రాశారు. కానీ, మేం నిర్వహించిన వరుణయాగంతో వర్షాలుపడ్డాయి. అప్పుడు పడ్డ వర్షాలతో యాగాలను అపహాస్యం చేసేవాళ్ల నోళ్లు మూతపడ్డాయి.

కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వకముందు కూడా యాగాలు చేశారు. పదవుల కోసమో.. ఏదో రాజకీయ ఉద్దేశాలతోనో ఆయన యజ్ఙ, హోమాలు చేయడంలేదు. ఆయనకు భక్తిభావం ఎక్కువ. దేవుడిని నమ్ముకున్న వ్యక్తి. ఆయనపై అపవాదులు సరికాదు. కేసీఆర్ ఎందరికో ఆదర్శం. ఎంత ఎదిగినా భగవంతుడి వద్ద, గురువు వద్ద సామాన్యులమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదో గొప్ప గుణం. చిన్న పదవి వస్తేనే చాలామంది అహంకారంతో మాట్లాడుతుంటారు. కానీ, కేసీఆర్ అలా కాదు.. ఆయన నడవడిక ఎందరికో ఆదర్శం. నిజాయితీ ఉన్న వ్యక్తి, దేశం కోసం, దైవకృప కోసం హోమాలు చేస్తున్నారు. హిందుత్వమని చెప్పుకుంటున్న బీజేపీనో, ప్రధానమంత్రినో ఎప్పుడైనా ఈ తరహా యాగాలు చేశారా? కేసీఆర్ ప్రతిదాన్నీ భగవంతుడి కృపగా భావిస్తారు. కేసీఆర్ ఓ దమ్మున్న నాయకుడు. దేశంలో ఇలాంటి నేత లేరు. తెలుగునాట ఇలాంటి నాయకుడు ఉండడం మనకు భాగ్యం, అదృష్టం.

సహస్ర చండీయాగం: కలియుగంలో చండీ, వినాయకులు మహాశక్తివంతులు. చండి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. క్రియాశక్తిని ఇస్తుంది. రుద్రుడు ఎటువంటి ఆపదలు, అనారోగ్యం లేకుండా చూస్తాడు. ఈ రెండింటికీ కలిపి విలువకట్టలేని శక్తిని ఇచ్చేది రాజశ్యామల. లోక కళ్యాణానికి, రాజ్యసంరక్షణకు, సుభిక్షానికి ఈ యాగం ఉపయోగపడుతుంది. యాగం తలపెడితే చాలు.

అష్టబంధన మహాకుంభాభిషేకం

Yagam1
విశాఖపట్నంలోని శారదాపీఠంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. 14వ తేదీన కామ్యసిద్ధ్ది హోమంతో కార్యక్రమాలు ముగుస్తాయి. రాజశ్యామల యాగంతోపాటు వనదుర్గ యాగాన్ని కూడా నిర్వహిస్తున్నాం.

సామాజిక కేంద్రం

దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించడంతోపాటు అనేక సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను శారదాపీఠం చేపడుతున్నది. గిరిజన గ్రామాల్లో ఉచితంగా మందులు ఇస్తున్నాం. 400 గోవులను గిరిజనులకు ఇచ్చాం. బట్టలు ఉచితంగా ఇచ్చే పథకం పెట్టాం. కుల, మతాలకు అతీతంగా విద్యార్థులను చదివిస్తున్నాం. గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో వేదపాఠశాలలు నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా 72 అనుబంధ పీఠాలు ఏర్పాటు చేశాం. మరింత విస్తరణ జరుగుతున్నది.

భగీరథుడు కేసీఆర్

మిషన్ కాకతీయ.. మిషన్ భగీరథ సహా అన్ని పథకాలు మూడేండ్లలో పూర్తవుతాయి. కేసీఆర్ తెలంగాణ భగీరథుడు అవబోతున్నారు. అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కూడా ఆయనకు ఉన్నది.

-సతీష్ ఓరుగంటి
-చీఫ్ ఆఫ్ బ్యూరో, నమస్తే తెలంగాణ

2792
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles