ప్రజల కోసం సైన్సు- సైన్సుకోసం ప్రజలు పరిపూర్ణ విజ్ఞాన ప్రపంచం!


Tue,March 5, 2019 03:17 AM

ప్రకృతితో మమేకమవుతూ, జీవకోటిని కలుపుకొనిపోతూ ఒక ఆదర్శవంతమైన పరిపూర్ణ విజ్ఞాన ప్రపంచాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యతను ఈ సంవత్సరం నేషనల్ సైన్స్ డే (ఫిబ్రవరి 28) ఇతివృత్తం గుర్తుచేసింది. ఇందుకోసం ఇటు ప్రజలు, అటు సైన్స్‌రంగ నిపుణులు ఒకరినొకరు అర్థం చేసుకొంటూ, ఒకరికోసం ఒకరు అన్నట్టుగా సానుకూల, సమైక్య పంథాలో ఒదుగుతూ, ఎదగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల కోసం సైన్స్, సైన్స్‌కోసం ప్రజలు అంటూ మన మేధావులు ఇచ్చిన పిలుపును అందరం అందిపుచ్చుకొని ఈ లక్ష్యసాధనకు కృషి చేద్దాం.
sun

మనం కల గనవలసిన పరిపూర్ణ విజ్ఞాన ప్రపంచం ఎలాంటిదంటే, అక్కడి ప్రజలలో ఎలాంటి అజ్ఞానాలుండవు. ఆ సమాజంలో అంధ విశ్వాసాలు, అనాచారాలు, అశాస్త్రీయ విజ్ఞణ అప్రాకృతిక వ్యవస్థలు, అమంగళకరమైన పోకడలు ఏవీ కనిపించవు. మనిషి మేధోతనానికి అదొక పరాకాష్టగా నిలుస్తుంది. అలాంటి సమాజం కోసం అందరం శ్రమిద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రతిదీ ప్రజలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. సైన్సూ ఇందుకు అతీతమేం కాదు. సైన్సు- ప్రజలు పరస్పరం అవినాభావ సంబంధంతో మెలగవలసిందే. ప్రజలతో సంబంధం లేని ఏ పరిశోధనాంశమైనా వృథానే. అలాగే, సైన్సుతో అనుసంధానం కాలేని ప్రజలకు భవిష్యత్తు అంధకారం, అగమ్యగోచరమే.

ప్రకృతిలో ప్రతిదీ శాస్త్రీయమే. ప్రతిదీ సైన్సు సంబంధమైందే. విజ్ఞానశాస్ర్తానికి అతీతమైంది ఏదీ ఉండదు. కాకపోతే, ఏదైనా దాని లోతుపాతులు తెలిసే వరకే రహస్యం. తెలిశాక అది మనిషి మేధోజ్ఞాన విజయం అవుతుంది. కాబట్టి, భారతీయులతో సహా ఆధునిక మానవులం అందరూ సైన్సుకు తలొంచాల్సిందే. సైన్సు ప్రజలకు ఎంత అవసరమో, సైన్సుకు ప్రజల మద్దతు కూడా అంతే అవసరం. ఈ ఏడాది ఇతివృత్తం (Science for the People and People for the Science) దీనినే తెలియజేస్తున్నది. ఒక్క మన భారతదేశంలోనే కాదు, ఇంకా అనేక పేద, బడుగు, సంపన్న దేశాల్లో సైతం సైన్సు ప్రగతిపైనే అక్కడి ప్రజల మనుగడ ఆధారపడి ఉంటుంది. అలాగని, ప్రజలకు వ్యతిరేకంగా వెళతామంటే సైన్సుకు ఆదరణ లభించదు. ఇంతదాక మనం సాధించిన నాగరికత, అభివృద్ధి అంతా సైన్సు పుణ్యమే. అంతేకాదు, భావి సమస్యలకూ శాస్త్రీయ పరిష్కారాలే సరైన మార్గదర్శకాలవుతాయి.

నేషనల్ సైన్స్ డే (ఇటీవలి ఫిబ్రవరి 28) సందర్భంగా 1999 నుంచి ఇప్పటి వరకు ప్రకటించిన అన్ని ఇతివృత్తాలలోకీ ఈ అంశమే విస్తృత ప్రయోజనకారి. కారణం, ఇది సైన్సును నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లింది కాబట్టి. మిగిలిన అన్ని ఇతివృత్తాలు ప్రత్యేకించి (స్పెసిఫిక్‌గా) విజ్ఞాన శాస్త్రీ య, సాంకేతిక అంశాలే. అయితే, ఇది మాత్రమే రెంటిమ ధ్య ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని కోరుకుంటూనే, దానిని పెం పొందించేదిగా ఉంది. ప్రజల మనోభావాలకు అతీతంగా సైన్సురంగం వ్యవహరించకూడదు. ప్రజల విశ్వాసాలు గుడ్డివి, మూర్ఖమైనవి, అజ్ఞానమైనవిగా అనిపించినప్పుడు అవి నిరూపితమయ్యే దాక సైన్సు/ శాస్త్రవేత్తలు ఓపిక పట్టవలసిందే. నిప్పు ముడితే కాలుతుందని తెలిస్తే ఎవరూ ముట్టరు. తెలియక ముడితే, తాకిన తర్వాతైనా వారికి తెలుస్తుంది కదా. కాబట్టి, ఎట్టకేలకు గెలిచేది సత్యమే.

ప్రజలకు- సైన్సుకు మధ్య నిజానికి ఎలాంటి వైరుధ్యాలు లేవు, ఉండవు కూడా. ఎవరి పని వారు చేసుకుంటూ పోతుంటారు. కానీ, కొందరు వ్యక్తులే వారి వ్యక్తిగత అభిరుచులు, సిద్ధాంతాల కోసం రెంటి నడుమ అగాధాన్ని సృష్టిస్తుంటారు. అలాంటి ప్రయత్నాలు అవసరమా అన్నది వారికి వారే ఆలోచించాలి. ఇటువంటి దూరాలు, భేదాలు వుండరాదు. మనం 1987 నుంచీ జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవాన్ని (నేషనల్ సైన్స్ డే) జరుపుకుంటున్నాం. ఈ 32 సంవత్సరాలలో భారతదేశం సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్, లైఫ్ సైన్సెస్, హెల్త్, మెడికల్, ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్, బయోటెక్నాలజీ తదితర రంగాలలో సాధించిన ప్రగతి, అది ప్రజలకు ఏ రకంగా ఉపయోగంలోకి వచ్చిందీ వంటి విషయాలపై స్థూల విశ్లేషణలు, సమీక్షలకు ఈ ఇతివృత్తం చక్కని అవకాశం కల్పిస్తున్నది.

ఇన్నాళ్లుగా, మన దేశంలో, ఇంకా ప్రపంచస్థాయిలో కూడా ప్రజల కోసం సైన్సు ఇప్పటి దాకా ఏం చేసింది? సైన్స్‌ను ప్రజలు ఎలా సొంతం చేసుకున్నారు? భవిష్యత్తులో చేయవలసింది ఏమిటి? వంటి మౌలిక విషయాల్ని చర్చకు పెట్టిన సందర్భాలు లేవు. సైన్సు ప్రగతి అంతా ప్రజల కోసమే, ప్రజలు కూడా సైన్స్ అభివృద్ధిలో భాగస్వాములే అన్న సందేశాన్ని ఈ ఇతివృత్తం ఇప్పటికైనా ఇవ్వడం శుభదాయకం. సమాజంపై సైన్స్ ప్రభావం చాలా వుంటుంది. ఈ అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రజలు- సైన్స్‌రంగ నిపుణుల నడుమ ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు, సేవారంగం, విద్యాసంస్థలు, అధికారులే వారధులుగా పనిచేయాలి. సార్వజనీన అవసరాలు తీర్చే లక్ష్యంతోనే శాస్త్రజ్ఞుల పరిశోధనలు సాగాలి. ముఖ్యంగా విద్యాసంస్థలలో సైన్స్ బోధకుల పాత్ర కీలకం. విద్యార్థులు, యువత, సామాన్యులతో వారు మమేకమవుతూ శాస్త్రీయ అవగాహనను, పరిశోధనా కాంక్షలను వారిలో పెంపొందింపజేయడానికి తగిన కృషి చేయాలి.

అయితే ఇది ఒక రోజులో ముగిసేది కాదు. ఇదొక నిరంతర ప్రక్రియ. దేశంలో మిగిలిన అన్ని రంగాల మాదిరిగానే సైన్సు కూడా ప్రజలకోసమే పునరంకితమవుతున్నది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ, ఇప్పటికి ప్రజలకు అన్ని రంగాలలోనూ ఏర్పడిన ఆధునాతన సౌకర్యాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇదే చిత్తశుద్ధితో పరిశోధనల పరంపరను మరింతగా వేగం పుంజుకొనేలా ముఖ్యంగా ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలి. ఇందుకోసం ప్రజలు, శాస్త్రవేత్తలతోపాటు అన్ని రంగాల వారు తమ తోడ్పాటును విధిగా అందించాలి. సమాజమంటేనే ప్రజలు. సైన్స్‌కు దారిచూపేది సమాజమే. ఎలాంటి పరిశోధనలు జరగాలి? తమకేం కావాలో ఆ మేరకు సమాజమే నిర్ణయిస్తుంది. సామాజిక అవసరాలకు అనుగుణంగానే శాస్త్రవేత్తలు తమ పరిశోధనాంశాలను ఎంచుకోవాలి. అవి ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించేలా ఉండాలి. అలాగే, ఏ పరిశోధనైనా మానవీయ విలువలకు కట్టుబడి ఉండాలి. అప్పుడే వాటి ఫలితాలు లోకకల్యాణానికి ఉపయోగపడతాయి.

శాస్త్రీయ జీవనం

కాలానికి తగ్గట్టుగా ప్రజల ఆలోచనా విధానాలు మారాలి. వారి జీవనం శాస్త్రీయపంథాలోనే వుండాలి. మూఢవిశ్వాసాలు, చాదస్తపు ఆచారాలకు ప్రజలే కాదు, శాస్త్ర సాంకేతిక, వైద్య, విద్యా రంగాలలోని మేధావులు ఎవరైనా తక్షణం స్వస్తి చెప్పాలి. ఈ మేరకు ప్రతి ఒక్కరూ శాస్త్రీయ జీవనశైలికి అలవాటు పడాలి. అప్పుడే మనం కలలు కంటున్న పరిపూర్ణ విజ్ఞాన ప్రపంచాన్ని నిర్మించుకోగలం. ఈ మేరకు విస్తృత వైజ్ఞానిక స్పృహను ప్రజలు అలవరచుకోవాలి. ప్రతి దానినీ వైజ్ఞానిక దృష్టితోనే చూడగలగాలి. శాస్త్రవేత్తలంటే ఎవరో కాదు, వారూ ప్రజలే. సమాజంలో భాగమే. శాస్త్ర పరిశోధనల పట్ల వారు విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి. తాము జరిపే పరిశోధనలు అత్యంత ప్రామాణికంగా ఉండాలి. అలాగే, వారు తమ వ్యక్తిగత ఉద్దేశ్యాలు, అభిప్రాయాలు తమ పరిశోధనలపై ప్రభావం చూపేలా ప్రవర్తించకూడదు. అంతేకాదు, అన్ని వర్గాల వారిని, అందరి విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారానే వారు పరిశోధనలలో పరిపూర్ణతను సాధించగలరు. ప్రజలతో మమేకం అవడం ద్వారా మాత్రమే వారు ఈ విజయాన్ని అందుకోగలరు.
-దోర్బల బాలశేఖరశర్మ

522
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles