పైసా లేకుండా.. జ్ఞాన సంచారం!


Wed,February 6, 2019 12:27 AM

అతడి పేరు: అభితేజ్ బోడ
వయస్సు: 22 సంవత్సరాలు
యాత్రా కాలం: 522 రోజులు
ఎన్ని రాష్ర్టాలు: 28
కేంద్ర పాలిత ప్రాంతాలు : 5
ఎన్నివైపులు? : దేశం నాలుగు దిక్కులా
ప్రారంభం: ఢిల్లీ
ముగింపు ఎక్కడ: హైదరాబాద్
ప్రస్తుత విజ్ఞాన స్రవంతిలో సెల్‌ఫోన్‌లేనిదే పూట గడవదు. సహచర స్నేహితుల్లేనిదే కాలు కదలదు. ప్రణాళిక లేనిదే పక్కూరికి కూడా వెళ్లలేరు. కమ్యునికేషన్ లేనిదే కంటికి నిద్ర కూడా పట్టదు. ఇవేవీ లేకుండా కట్టుబట్టలతో భారతయాత్ర పూర్తిచేశాడో యువకుడు! కెమెరా లేకుండానే ట్రావెల్ ఫొటోలు తీసి.. వాటితో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న సందర్భంగా ఈ కథనం.
abhitej-bhoda
ఇయ్యాలరేపు హైదరాబాద్ శివార్లకు వెళ్లాలంటేనే ఒక ప్రణాళిక ఉండాలి. ముందుగా చేతిలో సరిపడా డబ్బుండాలి. మరీ ముఖ్యంగా సమాచారం కోసం సెల్‌ఫోన్ ఉండాలి. బస చేయడానికి వసతి ఉండాలి. ఇవేనా? ఏం తినాలి? ఎక్కడ తినాలి? ఏం కొనాలి? ఎక్కడ కొనాలి? ఎవరిని కలవాలి? అట్నుంచి ఇంకెక్కడికి వెళ్లాలి? వంటివి చాలా ఉంటాయి. కానీ ఇవేవీ అవసరం లేదు అంటున్నాడు హైదరాబాద్ యువకుడు. నయా పైసా చేతిలో లేకుండా కట్టుబట్టలు చేతిలో పట్టుకొని యాత్ర ప్రారంభించి భారతదేశం మొత్తం చుట్టేశాడు.


యాత్ర నేపథ్యం

అభితేజ్ హైదరాబాదీ. మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఎఫ్‌ఏలో ఫొటోగ్రఫీ స్పెషలైజేషన్ డిగ్రీ చేశాడు. సర్టిఫికేట్ చేతిలోకి వచ్చింది. దాంతో ఏ కంపెనీలో చేరినా నెలకు రూ. 30 వేలకు పైనే జీతం వస్తుంది. హాయిగా ఉండొచ్చు. కానీ అతడికి అలా చేయడం ఇష్టం లేదు. జీవితం ఎక్కడ మొదలయ్యిందో అక్కడే ముగిస్తే ప్రయోజనం ఏంటి? అనుకున్నాడు. దేశ సంచారం చేస్తానని పేరెంట్స్‌తో చెప్పాడు. వాళ్లు చీవాట్లు పెట్టారు. తమాషా చేస్తున్నావా? అని కొట్టినంత పనీ చేశారు. మీకు ఇష్టం లేకపోయినా.. మీ నుంచి అనుమతి రాకపోయినా.. నేను మాత్రం ఇండియా మొత్తం తిరగాలనుకుంటున్నాను. నాకు ఒక్క పైసా కూడా వద్దు. చేతిలో డబ్బులు.. ఫోన్ లేకుండా.. ఎలాంటి ప్లాన్ లేకుండా ఈ యాత్ర పూర్తిచేసి రెట్టింపు ఆనందోత్సాహాలతో తిరిగి వస్తా అని పేరెంట్స్‌కు చెప్పి వెళ్లాడు.


abhitej-bhoda6

మిషన్ క్యాష్‌లెస్ ట్రావెల్

డబ్బుల్లేకుండా హైదరాబాద్‌కు చేరుకున్న గుజరాతీ యువకుడు అనే వార్త అభితేజ్‌ను మరింత ఆలోచింపజేసింది. అదేదో బాగుందే అనుకున్నాడు. తాను ఏదో ఒక్క రాష్ట్రంలో కాకుండా దేశమంతా చుట్టేయాలని #MissionCashlesstravel క్యాంపెయిన్‌ను ప్రారంభించాడు. ట్రావెలింగ్‌కు ప్రధాన వనరులైన డబ్బు, వాహనం, కెమెరా, స్మార్ట్‌ఫోన్, తోడు వంటివి లేకుండా సరికొత్త రికార్డు సృష్టించొచ్చు అనేది ఈ క్యాంపెయిన్ ఉద్దేశం. దీంట్లో భాగంగా తన యాత్రను దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించాలి అనుకున్నాడు. తాను చేసే పని యువతకు సందేశంగా.. ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చాడు.


ఢిల్లీలో తొలి అడుగు

స్నేహితుల సహకారంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్నాడు అభితేజ్. 22 మార్చి 2017న చేతిలో రెండు లగేజీ బ్యాగ్‌లు.. జాతీయ జెండా పట్టుకొని జీటీబీ నగర్ చౌరస్తాలో నిల్చున్నాడు. ఎదురైన ప్రతీవారిని లిఫ్ట్ అడిగినా కొందరు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఓ టూవీలర్ అతను.. అభితేజ్ చేతిలో జాతీయ జెండా చూసి ఆశ్చర్యపోయి ఆపాడు. ఏంటీ.. ఈ చేతిలో బ్యాగులు.. ఆ చేతిలో జాతీయజెండా.. పైగా లిఫ్ట్ అడుగుతున్నావ్? ఎవరు నువ్వు? అని అడిగితే.. తన గురించి వివరించాడట అభి. అలా మొదటి లిఫ్ట్ దొరికింది. అతడు ఎర్రకోట వరకు చేరవేశాడు. అక్కడ దిగిన అభి.. ఎర్రకోటను సందర్శించాడు. అక్కడ కొత్తవాళ్లను పరిచయం చేసుకొని ఫొటోలు తీసుకున్నాడు. పెన్‌డ్రైవ్ కొనుక్కొని ఫొటోలు దాంట్లో వేసుకున్నాడు.


abhitej-bhoda2

హిమాచల్ పయనం

ఢిల్లీని చుట్టేసి మళ్లీ రోడ్డుపైకి వచ్చేశాడు. మల్లా అదే సీన్. రోడ్డుపై ఎంతోమందిని లిఫ్ట్ అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. చాలాసేపటికి ఒక కారు ఆగింది. ఎక్కడికి వెళ్లాలి? అని అడిగాడు కారులో ఉన్న వ్యక్తి. మనోడికి ఏమీ తోచలేదు. మీరెక్కడిదాకా వెళ్తారు? అని ప్రశ్నించాడు అభి. ఆయన కాసేపు ఆశ్చర్యంగా చూశాడు. కారు ఎందుకు ఆపాన్రా బాబూ అనే ఎక్స్‌ప్రెషన్స్ ముఖంలో కనిపించాయి. అయినా అభి ఫీల్ కాలేదు. మొత్తానికి అతడిని కన్విన్స్ చేయగలిగాడు. హిమాచల్ వెళ్తున్నా అని అతడు చెప్పడంతో ఓకే అని కార్ ఎక్కాడు అభితేజ్.


abhitej-bhoda4

హిమాలయా రేంజ్ ఆఫ్ ఇండియా

హిమాచల్ ప్రదేశ్‌లో దిగిన అభికి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. మొదటిరోజు ఫ్లాట్‌ఫామ్‌పై పడుకున్నాడు. తెలతెలవారగానే ఎవరో ఒకరు లేపారట. అక్కడున్న ప్రదేశాలను అన్నింటినీ చుట్టేశాడు. ఎక్కడా ఆగకుండా కేవలం లిఫ్ట్‌ల ద్వారానే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హర్యానా, పంజాబ్ తిరిగాడు. ఇక్కడ తినడానికి.. పడుకోవడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ కలగలేదు. హరిద్వార్, రిషికేష్, స్మిత్‌వ్యాలీ, అమృత్‌సర్, గోల్డెన్ టెంపుల్ అతడికి ఆశ్రయం ఇచ్చాయి. అప్పటికి 103 రోజులు పూర్తయ్యాయి. అక్కడ్నుంచే ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ చుట్టేశాడు. ఇవన్నీ తిరగడానికి 125 రోజులు పట్టింది. మొత్తానికి హిమాలయా రేంజ్ ఆఫ్ ఇండియాగా పిలిచే ఒక అసాధారణ టాస్క్ కంప్లీట్ చేశాడు అభి.


జీవితం నేర్పిన నార్త్ ఈస్ట్

తన ఏకాంత పర్యటనలో అభితేజ్ చాలా నేర్చుకున్నాడు. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ర్టాల్లో పర్యటన. అక్కడ భిన్నమైన జీవనశైలి కలిగిన మనుషులు ఉంటారు. 16 కిలోమీటర్లకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. పైగా లిఫ్ట్ సౌకర్యం దొరకదు. 10 సంవత్సరాలు వెనకబడి ఉంటుంది. ఆకలేస్తే అప్పటికప్పుడు చెరువులోకి వెళ్లి చేపలు పట్టుకొని ఇంత ఉప్పు వేసుకొని తింటారు. రుచి.. కారం వంటివి కనిపించవు. మన ఆహార విధానానికి అలవాటుపడ్డ వారికి నార్త్ ఈస్ట్ భోజనం అస్సలు రుచించదు. అందుకే ఒక టెంట్ సంపాదించుకున్నాడు. సుమారు నాలుగు నెలలపాటు టెంట్ నీడనే సేదతీరాడు. ఇలా ఓ కొత్త జీవితాన్ని నేర్పించింది నార్త్ ఈస్ట్ పర్యటన.


abhitej-bhoda3

అందరూ స్నేహితులే

మామూలుగా పోలీసువాళ్లు ఎవ్వరితో స్నేహం చేయరు. మిలటరీ వాళ్లయితే అస్సలు దగ్గరికే రానివ్వరు. రాష్ర్టాల సరిహద్దుల్లో.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఒంటరిగా తిరుగుతూ కనిపించిన అభితేజ్‌కు అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. కానీ చాలా తక్కువ సమయంలో వారితో స్నే హం ఏర్పరచుకున్నాడు అభి. ఎలాంటి వసతి సౌకర్యం లేకపోతే వెంటనే పోలీసు వాళ్లను గానీ.. ఆర్మీనిగానీ సంప్రదించేవాడు. అతి ప్రమాదకరం అని భావించే ట్రక్కు డ్రైవర్లే చా లాసార్లు అతడికి అన్నం పెట్టారు. అడిగిన చోట దింపారట. భాష ఏదైనా.. ఆహారపు అలవాట్లు ఎలాంటివైనా వారందరినీ స్నేహితులుగా మార్చుకొని 522 రోజుల యాత్ర పూర్తి చేసుకొని హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు.

abhitej-bhoda5


ఎగ్జిబిషన్ పెడతా: అభితేజ్

నాకు అంతా తెలుసు అనుకుంటే నాకు ఇవన్నీ ఏవీ తెలియకపోయేవి. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియకున్నా ఇంట్లో నుంచి అడుగు బయటకు వేశా. పైసల్లేకుండా బతకొచ్చు.. ఫోన్లు లేకుండా మనిషి మనుగడ సాధించొచ్చు అనేది నేర్చుకున్నా. కెమెరా లేకున్నా ఎన్నో అద్భుతమైన ఫొటోలు తీశాను. ఎవ్వరు ఏది పెట్టినా తిన్నాను. నా అనుభవాలకు రూపాలైన ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నా. దేశవ్యాప్తంగా తిరిగి నేనెంతో సర్‌ప్రైజ్ అయ్యా. ఆ సర్‌ప్రైజ్‌ను త్వరలో తెలంగాణ ప్రజలకు చూపిస్తా.
-దాయి శ్రీశైలం

454
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles