పేదరికాన్ని గెలిచిన.. పోలీస్ సిస్టర్స్


Mon,April 8, 2019 11:53 PM

ఇది ఓ అక్క కథ. ఐదుగురు జీవితాలను నిలబెట్టిన ఓ త్యాగమూర్తి కథ. అమ్మ తమకోసం త్యాగం చేసిన అన్నం.. తన చెల్లెళ్లు, తమ్ముళ్లకు పెట్టి.. కన్నీళ్లతో కడుపు నింపుకొన్న దీనగాథ. పేదరికాన్ని జయించాలంటే చదువొక్కటే మార్గమని నమ్మి.. అర్ధాకలిని తమ దరిదాపుల్లోకి రాకుండా పారదోలిన అక్కాచెల్లెళ్ల విజయగాథ. తాను నడిచిన ముళ్లదారిని.. చెల్లెళ్ల కోసం పూలబాటగా మార్చిన ఆ అక్క ఎవరో కాదు.. వనస్థలిపురం పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమలాబాయి. అక్కను ఆదర్శంగా తీసుకొని హెడ్‌కానిస్టేబుళ్లుగా ఎదిగారు చెల్లెళ్లు జ్యోతి, సుశీల. ఆ గిరిజన ముద్దుబిడ్డల్ని జిందగీ పలుకరిస్తే.. మనసు చలించే విషయాలు పంచుకున్నారు.

R-Kamala
ఆకలి.. కడుపులో పేగుల్ని మెలివేసే ఆకలి. కన్నీళ్లను దిగమింగుకుంటూ అర్ధాకలితో బతుకుతున్న సందర్భమది. ఓ పూటకు అన్నం దొరికితే.. తన పిల్లల కోసం త్యాగం చేసింది అమ్మ. దాన్నే చెల్లెల్ల కోసం దాచింది ఆ అక్క. ఆ అన్నాన్నే తన చెల్లెళ్లకు, తమ్ముళ్లకు తినిపించి.. నీళ్లుతాగి అర్ధాకలితో గడిపారు అక్కచెల్లెళ్లు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. మొత్తం ఎనిమిదిమంది సంతానం. ఉండేదేమో మారుమూల తండాలోని గుడిసెలో. తండ్రి.. అనారోగ్యంతో అర్ధాంతరంగా కన్నుమూశాడు. తల్లిపైనే కుటుంబ భారం పడింది. పట్టుమని పదేండ్లు కూడా నిండని పిల్లలకు పూట గడవడమే గగనమైన దుస్థితి. ఆకలి తీరాలంటే.. కష్టాలు గట్టెక్కాలంటే చదువొక్కటే మార్గమని నమ్మారు. పుస్తకాలతో దో(కు)స్తీ చేశారు. వారి చదువుకు శ్రమ తోడైంది. అంచెలంచెలుగా ఎదిగారు. అర్ధాకలిని పారదోలి పేదరికాన్ని గెలిచారు. ఒకే ఇంట్లో మూడు పోలీసు ఉద్యోగాలు సంపాదించి.. ఎంతోమంది అన్నార్థులకు ఆదర్శంగా నిలిచారు ఈ పోలీస్ సిస్టర్స్. నల్లగొండకు చెందిన ఈ పోలీస్ సిస్టర్స్ ప్రస్థానం.. ప్రతి ఆడబిడ్డకు ఆదర్శప్రాయమే. మారుమూల తండా నుంచి మహానగరం నడిగడ్డ వరకూ వీరి ప్రయాణం అనన్యసామాన్యం.

ఆశపురితండా నుంచి హైదరాబాద్‌కు..

ఆకలితో ఉన్న కడుపు.. ఖాళీ జేబులే గిరిజన కుటుంబంలో పుట్టిన వీరికి గురువులు. అందుకే ఎంతో కష్టపడి.. నేడు ఉన్నతస్థానానికి చేరుకున్నారు. వారే కమలాబాయి, సుశీల, జ్యోతి. వీరు ముగ్గురూ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో కమలాబాయి వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా సేవలందిస్తున్నది. సరూర్‌నగర్ మహిళా పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నది సుశీల. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో షీ టీం హెడ్ కానిస్టేబుల్‌గా జ్యోతి విధులు నిర్వర్తిస్తున్నది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలోని ఆశపురితండాకు చెందిన లాల్‌సింగ్, సాలమ్మ దంపతుల బిడ్డలు వీరు. చిన్నబాయి, రాధాబాయి, కమలాబాయి, సరోజ, సుశీల, జ్యోతి, నగేశ్, రమేశ్.. మొత్తం 8 మంది సంతానం. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇంట్లో అంతమందిని సాకే పరిస్థితి లేకపోవడంతో నల్లగొండ జిల్లాలోని గిరిజన ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నారు. ఇద్దరు బిడ్డలకు పెండ్లి చేసిన తర్వాత.. అనారోగ్యంతో తండ్రి చనిపోవడంతో అమ్మ ఒంటరైంది. దీంతో కమలాబాయి కుటుంబ భారమంతా మోసింది.

ఇంటికి పెద్ద కొడుకులా..

తండ్రి బతికున్నప్పుడు ఆయనతో కలిసి వ్యవసాయం చేసేది కమలాబాయి. రాత్రిళ్లు పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లేది. తమ మూడెకరాల్లో పండిన పంటను సంతకు తీసుకెళ్లి అమ్మేది. అకస్మాత్తుగా తండ్రి చనిపోవడంతో చెల్లెళ్లు, తమ్ముళ్ల కోసం తన సంతోషాలన్నీ త్యాగం చేసింది కమలాబాయి. తన కలలను సాకారం చేసుకునేందుకు చదువునే అస్త్రంగా మలుచుకుంది. పదో తరగతి వరకు నల్గొండ జిల్లా నాంపల్లిలోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నది. ఇంటర్ మర్రిగూడలోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ పూర్తి చేసింది. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి అంగన్ వాడీ కేంద్రంలో వెలుగు జ్యోతి టీచర్‌గా పనిచేసింది కమలాబాయి. తర్వాత నల్లగొండలో నర్సింగ్ ట్రైనింగ్‌లో చేరింది. బంధువు లచ్చిరాం నాయక్ చొరవతో కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది.

కల సాకారమైన రోజు..

కమలాబాయి లక్ష్యం ఒక్కటే.. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని బాగా చూసుకోవాలని. తన లక్ష్యానికి తపన తోడైంది. కానిస్టేబుల్ ఉద్యోగానికి అహర్నిశలు కష్టపడింది. కానిస్టేబుల్ ఈవెంట్స్ అన్నీ కసితో పాసైంది. ఫైనల్ ఎగ్జామ్‌కు ఎలాంటి కోచింగ్‌లకు వెళ్లకుండా.. సొంతంగా, ప్రణాళికాబద్ధంగా సిద్ధమై లక్ష్యాన్ని చేరుకున్నది. 1994లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై అనంతపురంలో 9నెలలు శిక్షణ పూర్తి చేసింది. మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా మొదటి పోస్టింగ్ రాగా.. తొలి జీతం తీసుకెళ్లి.. అమ్మ చేతిలో పెట్టి ఉద్వేగానికి లోనైంది కమలాబాయి. ఆరోజు కోసం ఎన్నేండ్లు కష్టపడిందో.. ఎలా నిలిచి గెలిచిందో తనకే తెలుసు. తనకు మాత్రమే తెలుసు. ఆ ఆనందభరిత క్షణాలను తన జీవితంలో మర్చిపోలేనంటున్నది కమలాబాయి. ఆమె కష్టానికి కాలం కలిసొచ్చింది. బాలానగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వెళ్లింది. తర్వాత అంబర్‌పేట్ బదిలీ అయింది. అక్కడి నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్‌తో కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించింది. ఏఎస్సైగా ఇబ్రహీంపట్నం, మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లలో పనిచేసింది. 2018 అక్టోబర్‌లో ప్రమోషన్ మీద వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఎస్సైగా నేటికీ విధులు నిర్వర్తిస్తున్నది కమలాబాయి.

చెల్లెళ్లను తీర్చిదిద్దింది..!

ఊహ తెలిసిన దగ్గర్నుంచి చెల్లెళ్లు, తమ్ముళ్ల గురించే ఆలోచించేది కమలాబాయి. వాళ్లు జీవితంలో స్థిరపడే వరకూ పెండ్లి చేసుకోనని నిర్ణయించుకున్నది. ఈ క్రమంలో తల్లి, బంధువులు వారించడంతో కొన్ని నిబంధనల మేరకు పెండ్లి చేసుకున్నది. అయినా.. ముగ్గురు చెల్లెళ్లను, ఇద్దరు తమ్ముళ్లను ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కించింది. చెల్లెలు సరోజకు నర్సింగ్ ఫీల్డ్ ఇష్టమవడంతో ప్రస్తుతం నీలోఫర్ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నది. చిన్న చెల్లెళ్లు సరోజ, జ్యోతిలను కానిస్టేబుల్ ఉద్యోగానికి సిద్ధం చేసి.. జాబ్ కొట్టేలా దగ్గరుండి శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు వారిద్దరూ సర్వీస్ రూల్స్ ప్రకారం హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమ్ముడు నగేశ్ గతంలో హోంగార్డుగా చేశాడు. మరో తమ్ముడు రమేశ్ క్యాబ్ కొనుక్కొని డ్రైవర్‌గా నిలదొక్కుకున్నాడు. ఇలా అన్నీ తానై.. కుటుంబాన్నంతా జీవితంలో స్థిరపడేలా చేసింది కమలాబాయి. అంతేకాదు.. విధి నిర్వహణలోనూ ప్రజాపక్షమే. సమస్యలతో వచ్చిన పేదలను అక్కున చేర్చుకొని.. సమస్య పరిష్కరించడంలో కమలాబాయి ముందుంటుంది.

ఈ సంతోషం వెలకట్టలేనిది

కటిక పేదరికంలో ఉన్న మేము ఈ స్థాయికి రావడం చాలా గొప్ప విషయం. ఈ సంతోషం వెలకట్టలేనిది. నాన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు అండగా నిలిచారు. నా వాళ్లంతా ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డానో ఆ దేవుడికి, నాకే తెలుసు. ఇప్పుడు మా సమస్యలన్నీ తీరిపోయాయి. కష్టాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కునే వారే.. జీవితంలో ఉన్నతస్థానాలు చేరుకుంటారు. నన్ను నమ్మి.. నా దారిలో నడిచిన నా కుటుంబానికి రుణపడి ఉంటా.
- కమలాబాయి, ఎస్సై వనస్థలిపురం

అక్క నూరేండ్లు చల్లగుండాలి..

ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా అక్క దగ్గరకే వెళ్తాం. మేము అనుభవిస్తున్న సంతోషం, ఆనందం అంతా కమలక్క త్యాగమే. అక్క నూరేండ్లు చల్లగా బతకాలి. అక్కను ఆదర్శంగా తీసుకొని నేనూ కానిస్టేబుల్ అయ్యా. 2012లో హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ వచ్చింది. మేము ఎంత ఉన్నతస్థానానికి చేరుకున్నా.. అక్క త్యాగాన్ని, కష్టాన్ని మరువం.
- సుశీల, హెడ్ కానిస్టేబుల్, సరూర్‌నగర్ మహిళా పీఎస్

అక్కే మాకు అమ్మ..

Jyothi
జన్మనిచ్చింది సాలమ్మ అయినా.. మాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది మా కమలక్కే. ఆమె మాకు అమ్మతో సమానం. నా మొదటి శాలరీతో అక్కకు గిఫ్ట్ తీసుకెళ్లిన సందర్భం మర్చిపోలేనిది. హెడ్ కానిస్టేబుల్‌గా వేలాది మంది ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తుంటే.. నాకు సంతోషంగా ఉంది. మా కష్టాలను ఉదాహరణ చెప్పి విద్యార్థినులకు ప్రోత్సహిస్తున్నాం.
- జ్యోతి, షీ టీం హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్
-బండారి జార్జివిల్సన్ బి.సంజయ్‌చారి

1207
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles