పేదరికం నుంచి ఉన్నతస్థాయికి నందిని


Sun,August 26, 2018 11:10 PM

డబ్బుతో సంతోషాన్ని కొనలేమన్నది నిన్నటి సామెత. డబ్బులేనిదే ఇంటి నుంచి కాలు బయట పెట్టలేం అన్నది నేటి మాట. ఇప్పుడు డబ్బుచుట్టూ భూమి తిరుగుతున్నది. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు జీవితంలో ఎన్నో గుణపాఠాలను
నేర్పుతుందంటారు. నందిని కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నది. చిన్నప్పుడు పేదరికంలో మగ్గిపోయింది. డాక్టర్ కావాలని కలలు కనేది. అయితే డబ్బులు లేకపోవడంతో పదో తరగతిలోనే చదువు ఆపేయాల్సివచ్చింది. ఒకప్పుడు రెండు పూటలు భోజనం దొరికితే చాలనుకుంది. అలాంటిది నేడు నెలకు రెండు లక్షలు సంపాదిస్తుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఊబర్ దోస్త్ తన జీవితాన్ని మార్చేసిందంటున్న నందిని సక్సెస్‌మంత్ర.

NandiniUberDost
డిగ్రీలు.. పీజీలు చేసిన వారికే వారి చదువుకు తగ్గ జాబ్ లభించడం లేదు. దీంతో ఖాళీగా ఉండలేక ఏదో ఒక జాబ్‌తో నెట్టుకొస్తున్నారు. అలాంటిది కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదివిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి స్థితిలో ఉన్న మిగిలిన వారి సంగతేమోగానీ నందిని మాత్రం ఎవరూ ఊహించని ఉన్నత స్థాయిలో ఉంది. ఆటుపోట్ల వంటి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నారామె.

కుటుంబ నేపథ్యం

నందిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరానికి సమీపంలోని ఓ చిన్న గ్రామంలో ఉండేది. ఆమె తండ్రి దేవాలయంలో పూజారి. నందినికి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. కానీ కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండడంతో ఆమె 10వ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. ఈ క్రమంలో వయస్సు రాగానే ఆమెకు పెండ్లి చేశారు. ఆమె భర్త పేరు శ్రీకాంత శాస్త్రి పూజారి. వచ్చిన ఆదాయం తిండికి మాత్రమే సరిపోయేది. నందిని కొన్నాళ్లు గృహిణిగా ఉండిపోయింది. కానీ ఆమెకు సగటు ఇల్లాలిగా మిగిలిపోవడం ఇష్టం లేదు. ఏదో సాధించాలన్న తపన. అందుకే చిన్నాచితకా పనులు చేసి తన వంతుగా కుటుంబానికి ఎంతో కొంత ఇచ్చేది.

తండ్రి మరణంతో..

చిన్న చిన్న వ్యాపారాలు చేసి విజయం సాధించింది నందిని. ట్రావెల్ ఏజెన్సీ నడిపింది. పెయింటింగ్, హోమ్ ఇంటీరియర్ వర్క్స్ చేసింది. అప్పుడే పాప పుట్టింది. కొన్నాళ్లకు నందిని తండ్రి ఆకస్మికంగా చనిపోయారు. కష్టాలు ప్రారంభమయ్యాయి. తండ్రి మరణంతో తన చెల్లెలి బాధ్యత తనపైనే పడింది. ఆమె చదువు, పెండ్లితో.. నందిని అప్పుల్లోకి దిగబడిపొయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

NandiniUberDost2

ఇప్పుడు నేను నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్నాను. ఊబర్‌లో క్యాబ్‌లు తిప్పడం, మరోవైపు రిఫరల్స్‌ను చేర్పించడం చేస్తున్నాను. అందుకే ఇప్పుడు నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఏది ఏమైనా నేను పడిన శ్రమకు తగిన ఫలితం లభించింది. అయితే ఇప్పుడు నా మనస్సులో ఉన్న ఆశ ఒక్కటే. నేను ఎలాగూ డాక్టర్ కాలేకపోయాను. కనీసం నా కూతురునయినా డాక్టర్ను చేయాలని అనుకుంటున్నాను అంటూ తను కన్న కలను తన కూతురుతో పూర్తి చేస్తానని బలంగా చెబుతుంది నందిని.

ఊబర్‌తో దోస్త్

కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలోనే ఆమె బంధువుల్లో దగ్గరి వారైన కొందరు ఊబర్ సంస్థ గురించి చెప్పారు. అందులో క్యాబ్ నడిపిస్తే దాని వల్ల లాభం ఉంటుందనేసరికి ఆమె, ఆమె భర్త కలిసి తమ వద్ద ఉన్న నగలు తాకట్టు పెట్టి టయోటా కారు కొని ఊబర్‌లో తిప్పడం స్టార్ట్ చేశారు. అదే సమయంలో 2015లో ఆమెకు ఉబర్ దోస్త్ గురించి తెలిసింది. అందులో చేరి డ్రైవర్లను రిఫర్ చేస్తే డబ్బులొస్తాయని స్నేహితులు చెప్పారు. ఊబర్ రిఫరెల్ ప్రోగ్రాంకు తెలిసిన డ్రైవర్‌ను జస్ట్ రిఫర్ చేస్తే చాలు అతను ఊబర్ తరపున కొన్ని ట్రిప్స్ వేస్తే మనకు 3 వేల రూపాయలు వస్తాయి. సొంతకారు ఉన్నవారు ఊబర్‌లో పార్ట్‌టైం డ్రైవర్స్‌గా చేరవచ్చు. ఇదేదో బాగానే ఉందనిపించింది నందినికి.

భర్త సహకారంతో

భర్త సహకారం వల్లే తానిప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని చెబుతున్నది నందిని. కష్టాల్లో ఉన్నప్పుడల్లా భర్త సహకరించేవారని చెబుతున్నది. నేనున్న ఫీల్డ్‌లో చాలామంది అబ్బాయిలతో మాట్లాడాలి. వారితోనే కలిసి పనిచేయాలి. నా భర్త ఎప్పుడూ ఒక్కమాట కూడా అనలేదు. అందుకే నేను పూర్తిగా పనిమీద ధ్యాస పెట్టగలిగాను. మా అమ్మ నాతోనే ఉంటూ నా కుమార్తెను చూసుకుంటుంది. అదే నా విజయ రహస్యం అంటారామె. ఉబర్ సీఈఓ ట్రావిస్ కలానిక్‌ను ఎప్పుడో ఒకరోజు కలవాలన్నది నందిని డ్రీమ్. వ్యాపారాన్ని ప్రారంభించాలంటే చదువే అవసరం లేదని.. ధైర్యం, సహనం ఉంటే చాలు.. మహిళలు ఏ రంగంలోనైనా దూసుకుపోవచ్చు అంటున్నది నందిని.

600 మంది డ్రైవర్లకు ఉపాధి

NandiniUberDost1
ఊబర్లో చేరాక కాలం కలిసి వచ్చింది. తెలిసిన డ్రైవర్లను ఊబర్లో చేర్చింది. డ్రైవర్ జాబ్ కావాలా అంటూ.. సిటీలో పోస్టర్లు అంటించింది. తర్వా త ఫుల్ టైం డ్రైవర్స్ రిఫర్ చేసే కార్యక్రమం చేపట్టింది. నందిని పడ్డ కష్టం ఫలించింది. ఇప్పటివరకు 600 మంది డ్రైవర్లను రిఫర్ చేసింది. బెంగళూరులో చిన్న ఆఫీసు ఏర్పాటుచేసుకుంది. తనకు సహాయకులుగా కొంతమంది ఉద్యోగులను నియమించుకుంది. అడ్మినిస్ట్రేషన్, ఫీల్డ్ వర్క్‌లో వారు సాయం చేస్తుంటారు. ఇప్పుడు నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నది. అప్పులన్నీ తీర్చేసి బెంగళూరులో సొంత ఇల్లు కట్టుకుంది. తన కుమార్తెను ప్రఖ్యాత ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నది.

1767
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles