పెరుగు పచ్చళ్లు


Thu,April 24, 2014 04:13 AM

పచ్చడి అనగానే కారం ఘాటు ముక్కును అదరగొడుతుంది. పెరుగంటే.. చల్లదనం గుర్తొస్తుంది. ఈ రెండు కలిసి కాంబినేషన్‌లా మారితే..? ఈ మెనూకార్డ్‌లా ఉంటుంది. ఆ ఘాటు, ఈ కూల్‌ని జతచేసి వండి వడ్డిస్తున్నాం. ఆరగించేయండి మరి..

coconut-yogurt-chutney

కొబ్బరి పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలు :
కొబ్బరి - 1,
పెరుగు - ఒక కప్పు,
పచ్చిమిరపకాయలు - 2,
ఎండుమిర్చి - 1,
కారం - అర టీ స్పూన్,
ఆవాలు - ఒక టీ స్పూన్,
మినపప్పు - ఒక టీ స్పూన్,
శనగపప్పు - ఒక టీ స్పూన్,
అల్లం - చిన్న ముక్క,
నూనె - 2 టీ స్పూన్స్,
పసుపు - పావు టీ స్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం :
కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకొని కొద్దిగా నూనె పోయాలి. దీంట్లో ఆవాలు, శనగపప్పు, మినపప్పు, వేసి వేయించాలి. ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, పసుపు వేసి రెండుసెకన్లపాటు ఉంచి దించేయాలి. ఇప్పుడు కొబ్బరి పేస్ట్‌లో ఉప్పు, కారం, పెరుగు, పోపు వేసి బాగా కలపాలి. పైన కొత్తిమీరతో అలంకరించి వేడివేడి అన్నంతో లాగించేయొచ్చు.

cp-nice

కీరదోస పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలు :
కీరదోస - 1
పెరుగు - ఒక కప్పు
వెల్లుల్లిపాయలు - 2
పోపు గింజలు - ఒక స్పూన్
నిమ్మరసం - ఒక స్పూన్
కొత్తిమీర - అర కట్ట
మిరియాలపొడి - పావు టీ స్పూన్
నూనె, ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం :
కీరదోసను చిన్నముక్కలుగా కట్ చేసి వాటికి ఉప్పు పట్టించి పదినిమిషాలు అలాగే వదిలేయాలి. పెరుగును ఒక కాటన్ వస్త్రంలో చుట్టి పెట్టాలి. ఇలా చేయడం వల్ల పెరుగులో ఉన్న నీరు పోతుంది. కీరాలోని నీళ్లుపోయే విధంగా వంచేయాలి. వెల్లుల్లిపాయలను మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కీరదోస, వెల్లుల్లిపేస్ట్, చిక్కటి పెరుగు, నిమ్మరసం, మిరియాలపొడి వేసి కలపాలి. కడాయిలో నూనె పోసి పోపుగింజలు వేసి వేయించాలి. వీటిని కీరా మిశ్రమంలో వేసి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

aratikaya-perugu-pachadi

అరటికాయ పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలు :
అరటికాయలు - 2,
పెరుగు - పావు లీటర్,
పచ్చిమిరపకాయలు - 4,
ఎండుమిరపకాయ - 1,
ధనియాలు - 2 టీ స్పూన్స్,
ఆవాలు - అర టీ స్పూన్,
చింతపండు - 2షగా.,
వెలుల్లిపాయలు - 10బ్బలు,
జీలకర్ర - షగా.,
ఉల్లిగడ్డ - 1,
కరివేపాకు - 2 రెమ్మలు,
కొత్తిమీర - ఒక కట్ట, నూనె,
ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం :
అరటికాయల తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి ఉడకబెట్టాలి. ముక్కలు మెత్తగా అవ్వకుండా చూడాలి. కడాయిలో నూనె పోసి పచ్చిమిర్చి, ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించాలి. ఇప్పుడు అరటికాయ ముక్కలో చింతపండు, ఉప్పు, పచ్చిమిర్చి పోపు వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని పెరుగు కలపాలి. దీంట్లో ఉల్లిపాయలను సన్న ముక్కలుగా తరిగి వేయాలి. మళ్లీ కడాయి పెట్టి కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిలతో పోపు చేసి పచ్చడిలో కలపాలి. పై నుంచి కొత్తిమీర వేస్తే.. అరటికాయ పెరుగు పచ్చడి రెడీ!

vankaya

వంకాయ పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలు :
వంకాయలు - 2, పెరుగు - ఒక కప్పు,
పోపు గింజలు - ఒక స్పూన్,
ఎండుమిర్చి - 1,
కరివేపాకు - ఒక రెమ్మ,
కొత్తిమీర - అర కట్ట,
నూనె - 2 స్పూన్స్,
ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం :
ముందు వంకాయలను బాగా కడిగి తుడవాలి. వాటికి నూనె రాసి స్టౌ మీద కాల్చాలి. ఈ కాల్చిన వంకాయపై మాడిన పొట్టంతా తీసేయాలి. ఆ తర్వాత ఆ వంకాయలను చేతితో చిదమాలి. దీంట్లో ఉప్పు, పెరుగు కలపాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి పోపు గింజలు వేసి దోరగా వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి దించేయాలి. ఈ మిశ్రమాన్ని వంకాయ పచ్చడిలో కలిపి పై నుంచి కొత్తిమీర చల్లాలి. అంతే.. నోరూరించే వంకాయ పచ్చడి మీ ముందుంటుంది.

3696
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles