పెద్ద ఆఫీసరు.. పెద్ద మనసు


Tue,January 1, 2019 10:50 PM

ఉద్యోగ బాధ్యతలు అతనికి అసలు సమస్య ఎక్కడ ఉందో తెలియజెప్పింది. ఐఏఎస్ హోదాలో సబ్‌డివిజన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయన క్షేత్రస్థాయిలో కనిపించిన సమస్యలను చూసి చలించాడు. తనిఖీలలో కనిపించిన పాఠశాలలు ఆయనకు ఆలోచింపజేశాయి. తర్వాత అతను ఇంకేం చేశాడో చూడండి..
Swapnil
మేఘాలయలోని గారేహిల్స్ జిల్లా దండెగిరి సబ్‌డివిజన్ ఆఫీసర్ స్వాప్నిల్ తాంబె.. 2015 సంవత్సరం అసోం కేడర్ బ్యాచ్.. గిరాహిల్స్‌లోని దండెగిరిలో ఎస్‌డీఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అతను ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయాలనుకున్నాడు. వాటి దీన పరిస్థితిని చూసి రూపు మార్చేయాలనుకున్నాడు. తన పరిధిలోని స్కూళ్లకు కళ తేవాలని కంకణం కట్టుకున్నాడు. పాఠశాలల బాగుకోసం తన జీతాన్ని విరాళంగా ఇచ్చి, మరింత ఫండ్‌తో కొత్త కళ తెచ్చి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాడు. అందుకోసం ప్రతి రోజు ఉదయాన్నే అందుబాటులో ఉన్న పాఠశాలలను, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసేవాడు. ఈ క్రమంలో అతనికి దయనీయ పరిస్థితులు కనపించాయి. కొన్ని లోయర్ ప్రయిమరీ స్కూల్స్ రెండు, మూడు రూమ్‌లతో ఇరుకుగా ఉండేవి. 30 నుంచి 40 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉండేవారు. గోడలన్నీ శిథిలావస్థలో చేరిన పాఠశాలలో విద్యార్థులంతా ఒకే రూంలో ఇబ్బందులు పడేవారు. అయితే ఈ విద్యా విధానంలో మార్పులు తేవాలనుకున్నాడు. వెంటనే ఆ జిల్లా డిప్యూటి కమిషనర్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ స్టార్‌ను మొదలుపెట్టాడు.


swapnil2
ఆ పేరుతో అందుబాటులో ఉన్న వనరులతో పాఠశాలలను అభివృద్ధి చేయొచ్చని ప్రచారం చేశాడు. మొదట తన పరిధిలోని అంగన్‌వాడీని ఎంచుకున్నాడు. దాన్ని అభివృద్ధి చేయాలని తన రెండు నెలల సాలరీ లక్షన్నర రూపాయలను దానికి కేటాయించాడు. దీంతో పాటు మిలాప్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా క్రౌడ్ ఫండింగ్‌కు శ్రీకారం చుట్టాడు. వచ్చిన విరాళాలతో శిథిలావస్థలో ఉన్న పాఠశాలను పునరుద్ధరించాడు. విద్యార్థులను పాఠశాలలకు రప్పించడానికి అవగాహన కార్యక్రమాలు, చుట్టూ గోడలను నిర్మించి వాటికి కళాత్మకమైన చిత్రాలు వేయించి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించాడు. అలా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాడు. ఈ ఐఏఎస్ అఫీసర్ ప్రయత్నాన్ని చూసిన ఉన్నతాధికారులు కూడా స్పందించారు. మరింత ఫండింగ్‌తో పాఠశాలలను, అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నాడు. వీటితో పాటు గ్రామాల్లోనూ మౌలిక వనరుల కల్పనకు స్వాప్పిల్ కృషి చేస్తున్నాడు.

862
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles