పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్‌కు ఆస్కార్


Tue,February 26, 2019 01:52 AM

-మెరిసిన భారతీయ డాక్యుమెంటరీ
-అట్టహాసంగా 91వ ఆస్కార్ ప్రదానోత్సవం
-బోహేమియాన్ రాప్సోడీ చిత్రానికి 4 అవార్డులు
-ఆ నాలుగు రోజులకు అరుదైన గౌరవం
-రుతు రాగం
మనిషి పుట్టుకకు మూలం.. ఆ నాలుగు రోజుల తర్వాత మొదలవుతుంది.. మానవ పరిణామ క్రమమే దానితో ముడిపడి ఉంది.. అలాంటి రుతుక్రమం.. నిన్నటి వరకు ఒక నిషేధ పదం. గుసగుసల నడుమ ఆలపించిన మౌనరాగం.. ఇప్పుడా రాగం.. నిషేధాజ్ఞల సంకెళ్లు తెంచుకొని ఉద్యమ గీతమై నగారా మోగిస్తున్నది. నిర్భయంగా మాట్లాడుకోవడం.. ఎన్నో చైతన్య కార్యక్రమాలు, అవగాహనా ర్యాలీలూ నడిచాయి. ఓ అడుగు ముందుకు పడి ప్యాడ్‌మన్ లాంటి సినిమాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే మరో ప్రయత్నంగా పీరియడ్ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించారు ఇద్దరు మహిళలు. వారు ఆలపించిన రుతురాగాన్ని ఆస్కార్ వరించింది. ఇది మహిళల ఆ నాలుగు రోజులకు దక్కిన అరుదైన గౌరవం. ఆ కథ వెనుక కథ.. అవార్డు వెనుక శ్రమ మీకోసం..
oscar-award-india
మనం గెలిచాం. భూమి మీదున్న ప్రతీ ఆడపిల్ల తనను తాను దేవతలా భావించాలి అని అవార్డు వచ్చిన వెంటనే నిర్మాత మోంగా ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టింది.


ఓ మై గాడ్.. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యల గురించి నేను డాక్యుమెంటరీ తీస్తే దానికి ఆస్కార్ వచ్చింది. నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను అంటూ ఉద్వేగానికి లోనయింది దర్శకురాలు రేకా.


పీరియడ్.. ఎండ్ ఆఫ్ సెంటెన్స్ డాక్యుమెంటరీకి ఆస్కార్ వచ్చిన సందర్భంగా దర్శక, నిర్మాతల అభిప్రాయాలు ఇవి. తెరముందు లక్షల మందిని ఆకట్టుకున్న ఈ చిత్రం కథ వెనుక అనేక మలుపులున్నాయి. చరిత్రను తవ్వి చూస్తే మహిళలు కేవలం ఐదుసార్లు మాత్రమే బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో నామినేట్ అయ్యారు. ఈసారి పీరియడ్ సినిమాకు గాను దర్శకురాలు రేకా నామినేట్ అయింది. దర్శకుల విభాగంలో అవార్డు రాకపోయినా ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా మహిళలకు అవార్డు దక్కింది. ఒక భారతీయ మహిళ నిర్మించిన చిత్రం ఆస్కార్ అందుకోవడం అనేది భారతీయులందరూ గర్వపడాల్సిన సందర్భం. రియల్ లైఫ్ ప్యాడ్‌మ్యాన్ అరుణాచలం మురుగనాథం కథ ఈ డాక్యుమెంటరీ చిత్రీకరించడానికి ఒక కారణంగా చెప్తున్నారు.

oscar-award


పీరియడ్స్.. ఎండ్ ఆఫ్ సెంటెన్స్.. డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అందుకున్న భారతీయ చిత్రం. నిజ జీవితం, కొన్ని అనుభవాలు, సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ ఒక భారతీయ మహిళ జీవితంలో జరిగిన కథ. మన దేశపు కథ, వెనుకబాటుతనం వెలికి తీసిన మన కాలపు కథ. కొన్ని పనులకు గుర్తింపు లభిస్తుంది. ఆ గుర్తింపు అవార్డులు, రివార్డుల రూపంలో ఉంటుంది. వాస్తవానికి వాటిని పోల్చలేం. వాటితో సరిపెట్టలేం. కానీ, ఆ ప్రయత్నానికి ఇచ్చే సత్కారంగా భావించవచ్చు. పీరియడ్స్ కథ కూడా అంతే. ఇదొక మహిళా జీవితంలోని ప్రక్రియ. పరిణామక్రమం. అందులోని కొన్ని అంశాలను స్పృశిస్తూ చిత్రీకరిస్తే వచ్చిన ఒకరకమైన దృశ్యం. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు కేవలం ఈ చిత్రానికి లభించింది కాదు. ప్రపంచంలోని ప్రతి మహిళకూ దక్కిన గౌరవం. 91 ఏండ్ల ఆస్కార్ చరిత్రలో భారతీయ చలనచిత్రాలెన్నో ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. కానీ అందులో ఎలిమినేట్ అయినవే ఎక్కువ. ప్రతిసారి అవార్డుల విషయంలో భారతీయ సినిమాలకు నిరాశే మిగులుతున్నది. అలాంటిది ఓ డాక్యుమెంటరీ చిత్రం ఈసారి ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ను సాధించింది. ఒక భారతీయ యువతి కథకు ఆస్కార్ తలవంచింది. కథలో ఉన్న ప్రతిభకు ముగ్ధమయ్యింది. ఆస్కార్ వేదికపై భారతీయతను మెరిపించింది.

oscar-award3


ఏముంది కథలో..?

ఆడవాళ్లు నెలసరి సమయలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సవాళ్లను కళ్లకు కట్టినట్టు చూపించారు. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ ఫిలింలో శానిటరీ నాప్కిన్స్ అవసరాన్ని, వాటి మీద మహిళలకు ఉండే అపోహల వంటి ఎన్నో అంశాలను ప్రస్తావించారు. ఈ సినిమాకు కథా వస్తువు మహిళ. కేవలం పుష్పవతి అయ్యేదాకా ఆడవాళ్ల జీవితంలో ఇలాంటి రోజు ఒకటుంటుందని.. ప్రతీ నెలా ఆ ఇబ్బంది ఎదుర్కొంటారని తెలియని ఒక అమ్మాయి కథ. దీన్నే మనసుకు హత్తుకునేలా తీయాలనుకున్నారు నిర్మాత గునీత్ మోంగా, దర్శకురాలు రేకా బెహ్ తాబ్బి. ఇరానియన్ అమెరికన్ అయిన దర్శకురాలు రేకా ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఎన్నో అందుకున్నది. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్ న్యాప్‌కిన్లు ఎలా తయారు చేస్తారో నేర్చుకుంటారు. వాటిని ఇతర మహిళలకు తక్కువ ధరకు అమ్ముతూ ఎలా సాయపడ్డారన్న అంశాన్ని ఈ డాక్యుమెంటరీ కథలో చెప్పారు.


కథ వెనుక కథ

దేశంలో చాలా ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. అక్కడి మనుషులు కూడా అంతే. మహిళల నెలసరి గురించి మాట్లాడడం తప్పుగా భావించే సమాజంలో ఇలాంటి చిత్రం రూపొందడం, అది ఆస్కార్ అందుకోవడం ఒక ముందడుగు. అపవిత్రమని భావించే వారికి ఇదొక కనువిప్పు. సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంచడం మొదలు ఆ నాలుగు రోజులు వాళ్లను అంటరాని వాళ్లలా చూసే వాళ్ల ఆలోచనలు మార్చే చిత్రమిది. ఉత్తరప్రదేశ్‌లోని కతికెరా గ్రామానికి చెందిన స్నేహ్ ఈ డాక్యుమెంటరీలో కథానాయిక. స్నేహ్ జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా కథను రూపొందించారు. ఆ గ్రామ శివారులో ఉన్న పంటపొలాల్లో, గ్రామ పాఠశాలలోని తరగతి గదుల్లో ఈ డాక్యుమెంటరీ తీశారు. అప్పటి వరకు అపోహల మధ్య పెరిగిన స్నేహ్ జీవితంలో రజస్వల అయ్యాక మార్పు వచ్చింది.


యాక్షన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ స్నేహ్ గ్రామంలో శానిటరీ ప్యాడ్ల తయారీ కేంద్రానికి వస్తుంది. ఆ తర్వాత ఆ ఊరిలో మార్పు మొదలవుతుంది. డిగ్రీ పూర్తి చేసి ఢిల్లీలో పోలీస్‌గా పనిచేయాలని కలలు కన్న స్నేహ్ గ్రామంలో శానిటరీ ప్యాడ్ తయారు చేసే ఫ్యాక్టరీలో పనికి కుదురుతుంది. అప్పుడు స్నేహ్ వయస్సు ఇరవై రెండేళ్లు. ఫ్యాక్టరీలో పని చేస్తానని అనుకున్నప్పుడు ఇంట్లో తల్లికి చెప్తే తండ్రిని అడగమని సలహా ఇస్తుంది. ధైర్యం చేసి తండ్రిని అడుగాలనుకుంటుంది. ఆ సంస్థ గురించి, ఫ్యాక్టరీలో తయారుచేసే ప్యాడ్స్ గురించి తండ్రితో చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. చిన్నపిల్లల డైపర్లు తయారుచేసే కంపెనీ అని అబద్ధం చెప్పి పనిలో చేరుతుంది. తాను చేరాక ఎంతోమంది చేరి.. కొన్నాళ్లకే ఆ పని మానేయడం చూస్తుంది. అయినా స్నేహ్ మాత్రం ఆ పని మానుకోలేదు.


మార్పు మొదలు..

రెండు గదుల్లో నిర్వహిస్తున్న ఈ ఫ్యాక్టరీ వల్ల ఇప్పుడు ఆ గ్రామ ప్రజలు నెలసరి అంశాన్ని చర్చించగలుగుతున్నారు. ఈ అంశం మీద అవగాహన కూడా పెరిగింది. పాతగుడ్డలు, పాత చీరల ముక్కలు వాడే గ్రామంలో ఇప్పుడు 70 శాతానికి పైగా శానిటరీ ప్యాడ్లు వాడుతున్నారు. గ్రామంలో పూర్తిగా మార్పు వచ్చింది. దాచి పెట్టే స్థాయి నుంచి బహిరంగంగా మాట్లాడే వరకు వచ్చారంటే ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అంశాలన్నింటి మేళవింపుతో రూపొందించిన డాక్యుమెంటరీ పీరియడ్. నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ డాక్యుమెంటరీ బెస్ట్‌షార్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ సాధించింది. అరవై కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటేనే ఆలోచించే స్నేహ్.. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లింది. ఇప్పుడు స్నేహ్‌ని చూసి ఆ గ్రామం గర్వపడుతున్నది. ఆ గ్రామం నుంచి విదేశానికి వెళ్లిన మొదటి వ్యక్తిగా గౌరవాన్ని పొందుతున్నది.


director-producer
మహిళల చేత, మహిళల కొరకు, మహిళలే రూపొందించుకున్న చిత్రం పీరియడ్. సమస్యలున్నాయని చెప్పుకోవడానికి వెనుకడుగు వేసే ఆ మహిళల జీవితాలు, అవే సమస్యలను కథగా మారి కథనంగా తయారు చేసిన చిత్రంగా రూపొంది ప్రపంచ ప్రఖ్యాత, ప్రతిష్టాత్మక ఆస్కార్‌ను గెలువడం విశేషం. కూరగాయలు కోసి వంట చేయడమే కాదు.. ఖండాంతరాలు దాటి అవార్డులు కూడా సాధించగలమని భారతీయ మహిళ కథ రుజువు చేసింది. కథలెప్పుడు ఆలోచనల నుంచి, అనుభవాల నుంచి పుడతాయి. ఆలోచనల నుంచి పుట్టిన కథలు బాగున్నా వాస్తవికతకు దూరంగా ఉంటాయి. అనుభవం నుంచి పుట్టిన కథ వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. అందులో జీవం ఉంటుంది. ఆ జీవం ఆలోచింపజేస్తుంది. మహిళా జీవితం నుంచి పుట్టిన పీరియడ్ కథలో కూడా జీవం ఉంది. అందుకే అవార్డు అందుకోగలిగింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.


oscar-award2

వాస్తవికతకు దగ్గరగా..

ఆడవాళ్లు నెలసరి సమయలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సవాళ్లను కండ్ల్లకు కట్టినట్టు చూపించారు. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ ఫిలింలో శానిటరీ నాప్కిన్స్ అవసరాన్ని, వాటి మీద మహిళలకు ఉండే అపోహల వంటి ఎన్నో అంశాలను ప్రస్తావించారు. ఈ సినిమాకు కథా వస్తువు మహిళ.


-అజహర్ షేక్

1278
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles