పీఎంఎస్ సంపద సృష్టికి సరైన మార్గం


Sat,February 16, 2019 01:32 AM

portfolio-management
మనం సరిపడినంత పొదుపు లేదా మదుపు చేస్తున్నామా? సంపద పెరుగుతున్న కొద్దీ దాన్ని సమర్థంగా నిర్వహిస్తూ మరింత పెరిగేలా చేయడం అవసరం. అవునా? కానీ, ఈ యాంత్రిక ప్రపంచంలో మనకు సమయం దొరకడమే గగనం. సంపద నిర్వహణకు వ్యూహరచనలకు సమయం దొరకడం మరింత గగనం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నిపుణుల సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదే పోర్ట్ ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసులు(పీఎంఎస్). మీ తరపున మీ మదుపులను, సంపదను నిర్వహించేదే పీఎంఎస్. మీ ఆర్థిక లక్ష్యాలను, రిస్క్ సామర్థ్యానికి తగ్గట్టుగా మీకు సరిపడే ఆర్థిక సాధనాలను ఎంపిక చేసి మదుపు చేస్తారు. మీ పెట్టుబడులపై రాబడిని పెంచేందుకు మదుపు సాధనాల్లో రిస్క్‌లను తగ్గించడానికి పోర్టుఫోలియో మేనేజర్ ప్రయత్నిస్తుంటాడు. ప్రవాస భారతీయులు, సంపన్నులకు పీఎంఎస్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఎన్‌ఆర్‌ఐలు మాత్రం ఈక్విటీ సంబంధిత పీఎంఎస్‌లలో మాత్రమే మదుపు చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, పీఎంఎస్‌లు చూడడానికి ఒకే మాదిరిగా కనిపించినా రెండింటి మధ్య తేడాలున్నాయి.


మ్యూచువల్ ఫండ్లలో మనం మదుపు చేసిన మొత్తానికి యూనిట్లను పొందుతారు. కానీ, పీఎంఎస్, మదుపు చేసే అన్ని ఆర్థిక సాధనాలూ మీ పేరు మీదే మీ డీమ్యాట్ అకౌంట్‌లో ఉంటాయి. మీ ప్రాధాన్యతలు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మీ పోర్టుఫోలియోను మార్చుకునే వీలు ఉంటుంది. పీఎంఎస్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా మీరు పోర్ట్‌ఫోలియో మేనేజర్‌కు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా మీ తరపున మదుపు నిర్ణయాలను తీసుకునేందుకు అనుమతి ఇస్తారు. దాంతో మీ డీమ్యాట్ అకౌంట్‌ను నిర్వహించే బాధ్యతను పోర్టుఫోలియో మేనేజర్‌కు అప్పగించినట్టు అవుతుంది. పీఎంఎస్ సేవల్లో మళ్లీ రెండు రకాలు. ఒకటి డిస్క్రిషనరీ. ఈ పద్దతిలో అన్ని నిర్ణయాలను తీసుకునే అధికారాలను పీఎంఎస్ మేనేజర్ విచక్షణకే ఇచ్చేయడం. రెండోది, నాన్ డిస్క్రిషనరీ. ఈ పద్దతిలో ప్రతి నిర్ణయాన్ని మీ అనుమతి తీసుకున్న తర్వాతే పోర్టుఫోలియో మేనేజర్ అమలు చేస్తారు. దీని కింద ఇన్వెస్టర్‌కు పోర్టుఫోలియో మేనేజర్ సలహాలను ఇస్తారు. నిర్ణయాలు తీసుకోవడం పూర్తిగా ఇన్వెస్టర్ ఇష్టానుసారమే. మన దేశంలో దాదాపు 99 శాతం పీఎంఎస్ లు మొదటి కోవలోనే ఉన్నాయి. అలాగే పీఎంఎస్ లు చాలావరకు ఈక్విటీ ఆధారితమే అయినప్పటికీ చాలా పీఎంఎస్‌లు డెట్ మార్కెట్‌లో కూడా మదుపు చేస్తున్నాయి.


వ్యక్తిగత ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహం

ప్రతి ఇన్వెస్టర్ లక్ష్యాలు ఒకే రకంగా ఉండవు. అలాగే వారి వారి రిస్క్ సామర్థ్యాలు, పెట్టుబడులూ ఒకే రకంగా ఉండవు. అందువల్ల ఒక వ్యూహం అందరికీ పనిచేయదు. పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇన్వెస్టర్ రిస్క్ సామర్ధ్యాలకు అనుగుణంగా ఆర్థిక సాధనాలను ఎంపిక చేసి మదుపు చేస్తారు. ప్రతి ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోపై ప్రత్యేక ఫోకస్ ఉంటుంది. సాధారణంగా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీస్‌ను పొందాలంటే కనీసంగా రూ. 25 లక్షలను మదుపు చేయాల్సి ఉంటుంది. అయితే కంపెనీలు ఆఫర్ చేసే సేవలను బట్టి ఇందులో తేడాలు ఉండవచ్చు.


రీసెర్చి ఆధారిత నిర్ణయాలు

స్టాక్ మార్కెట్, షేర్లకు సంబంధించి సమగ్ర అధ్యయనం తర్వాత పోర్టుఫోలియో మేనేజర్లు ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలు తీసుకుంటారు. సాధారణంగా చాలా మంది ఇన్వెస్టర్లకు తమ పోర్టుఫోలియోలోని షేర్లను తరచుగా విశ్లేషించడానికి సమయం తక్కువగా ఉంటుంది కనుక ఆపనిని పోర్టుఫోలియో మేనేజర్లకు అప్పగిస్తే వారే చూసుకుంటారు. సరైన మార్గదర్శకత్వం, విశ్లేషణ లేకపోతే కొన్ని సందర్బాలలో మన ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలకు తర్వాత విచారించాల్సి వస్తుంది. పోర్టుఫోలియో మేనేజర్ల పూర్తిస్థాయి వ్యాపకమే మార్కెట్‌ను షేర్లను విశ్లేషించడం కాబట్టి వాటిని ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనే నిర్ణయాలను సమయస్పూర్తితో తీసుకోగలరు. ఇన్వెస్ట్‌మెంట్, వెల్త్ మేనేజ్‌మెంట్‌లో ఉండే ఒత్తిడికి మనం దూరంగా ఉండవచ్చు.


ఆర్థిక సాధనాల పునర్‌వ్యవస్థీకరణ

పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌లో ఆర్థిక సాధనాల పునర్‌వ్యవస్థీకరణ (అసెట్ రీ అలోకేషన్) చాలా ముఖ్యమైనది. మార్కెట్లలో మార్పు జరిగే కొద్దీ పోర్టుఫోలియోను కూడా అందుకనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం అవసరం. మీపోర్టుఫోలియో మీ రిస్క్ స్థాయిని మించిపోతే పోర్ట్ ఫోలియో మేనేజర్ అలాంటి సాధనాల నుంచి బయట పడి సురక్షితమైన ఆర్థిక సాధనాల్లోకి పెట్టుబడిని మళ్లిస్తారు. పోర్టు ఫోలియో మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా కాలానుగుణంగా మార్పులు చేర్పులను చేయడమే పోర్టుఫోలియో మేనేజర్ కర్తవ్యం.


రిస్క్ తగ్గించడం, రాబడిని పెంచడం

ఇదే పోర్ట్‌ఫోలియో మేనేజర్ ప్రథమ కర్తవ్యం. మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు గురవుతున్నప్పుడు రిస్క్ తగ్గించగలగాలి. పోర్టు ఫోలియోను వివిధీకరించడం, పెట్టుబడులను మార్చుతూ, రిస్క్‌ను తగ్గిస్తూ ఉండాలి. తద్వారా ఇన్వెస్టర్‌కు అధిక రాబడిని అందించగలగాలి.


పీఎంఎస్ సేవలకు ఫీజు

ఎంట్రీ లోడ్ కింద పీఎంఎస్ సేవలను కొనుగోలు చేసే సమయంలోనే 2 నుంచి 3 శాతం ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు ఆ తర్వాత వచ్చే లాభాల్లోనూ కొంత భాగాన్ని మినహాయించకుంటాయి. అలాగే కొన్న పీఎంఎస్‌లు ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీల కింద 1 నుంచి 3 శాతం ఫీజును ఛార్జి చేస్తాయి. మరికొన్ని పీఎంఎస్ సంస్థలు, క్యాపిటల్ గ్యారంటీ ఇస్తూ ఫీజును ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తాయి. అలాగే ఎగ్జిట్ లోడ్ కింద కూడా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. పీఎంఎస్ సేవలను పొందడంలో కొన్ని ప్రత్యేకతలున్నందున అందుకు డాక్యుమెంటేషన్ ప్రక్రియ కూడా చాలా సుదీర్ఘంగా ఉంటుంది. అయితే అన్ని పీఎంఎస్ స్కీములు తమ తమ రాబడులను బహిరంగంగా వెల్లడించవు. అందుకే పీఎంఎస్ సేవలను ఎంచుకునే ముందు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసి తీసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ కాలపరిమితిని బట్టి పీఎంఎస్ రాబడులు కూడా క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ పరిధిలోకి వస్తాయి. పీఎంఎస్ స్కీముల్లో రాబడులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే ఆర్థికంగా బాగా ఉన్నత స్థాయిలో ఉండి రిస్క్ తీసుకోగలిగిన ఇన్వెస్టర్లు తమ సంపదను పెంపొందించుకోవడానికి పీఎంఎస్ సేవలను పొందడం శ్రేయస్కరం.
jayathkumar

325
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles