అతనికొక కొడుకు, కూతురు ఉన్నారు. తమకు ఆడుకునేందుకు బొమ్మలు కావాలని మారాం చేసేవారు. అయితే, వారికొక ప్రత్యేక బహుమానం ఇస్తానని మాటిచ్చాడు ఆ తండ్రి. కొన్ని నెల్లలోనే సుందరి అనే బొమ్మను బహుమానంగా ఇచ్చాడు. ఇంతకీ సుందరి అంటే ఏంటో తెలుసా?

తన పిల్లల కోసం ఓ తండ్రి చేసిన అద్భుత ఆవిష్కరణ ఇది. కేరళలోని ఇడుక్కి ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ పురుషోత్తమన్ తన పిల్లల కోసం మినీ ఆటోను తయారు చేశాడు. దీని పేరే సుందరి. 1990లో విడుదలైన మలయాళం చిత్రం అయే ఆటో సినిమా స్ఫూర్తితో ఆటో తయారీ మొదలుపెట్టాడు. ఆ సినిమాలో హీరో ఆటోను సుందరి అని పిలుస్తాడు. దీంతో అరుణ్ కూడా తన మినీ ఆటోకు సుందరి అని పేరు పెట్టాడు. అరుణ్ ఇడుక్కి జిల్లా ఆసుపత్రిలో స్టాఫ్నర్సుగా పనిచేస్తున్నాడు. తన కొడుకు, కూతురు పిల్లలు బొమ్మలు కావాలంటూ నిత్యం మారం చేస్తుండడంతో తానే స్వయంగా ఏదైనా తయారు చేయాలని భావించాడు. ఖరీదైన బొమ్మలు కొనే బదులు.. అందుబాటులో ఉండే వస్తువులతో తన పిల్లలు ఆడుకునేందుకు వీలుగా మినీ ఆటోను తయారు చేయాలని నిర్ణయించాడు. డిష్ టీవీలకు ఉపయోగించే గొడుగులతోనే ఆటో బాడీని సిద్ధం చేశాడు అరుణ్. చెక్కలతోనే చక్రాలు తయారు చేశాడు. దీని తయారీకి 7 నెలలు పట్టింది. రూ.15వేలు ఖర్చు చేశాడు. గతంలో మినీ జీపు, త్రీవీలర్ బైక్ కూడా తయారు చేశాడు అరుణ్.