పిచ్చుకల రాణి !


Mon,April 15, 2019 01:03 AM

నేటి తరం జీవనశైలిలో వచ్చిన మార్పు పిచ్చుకపై బ్రహ్మాస్ర్తాలుగా పరిణమించాయి. ఈ మార్పుల వల్ల చివరికి పిచ్చుక జాతే అంతరించే ప్రమాదంలో పడింది. పలు కారణాలతో వాటి జాతి కనుమరుగవుతున్నది. పిచ్చుకలను సంరక్షించేందుకు ఓ మహిళ శ్రీకారం చుట్టింది.
sparrow
పొద్దున లేవగానే పక్షుల కిలకిలా రావాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇది పట్టణీకరణ జరుగక ముందు సంగతి. నగరాల్లోనే కాదు పల్లెల్లోనూ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పిచ్చుకలు బతికేందుకు అనువైన వాతావరణం లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని గ్రహించిన సాధన వాటి సంరక్షణ కోసం ప్రయత్నిస్తున్నది. సాధన రాజ్‌కుమార్ పుట్టింది చెన్నైలోనే అయినా, పెరిగింది అంతా ముంబైలోనే. అక్కడ ఆమె తాతయ్య వాళ్ల ఇంటి వద్దనే ఉండి చదువును పూర్తి చేసింది. వృత్తి పరంగా పౌష్టికాహారనిపుణురాలైన ఆమె పిచ్చుకల సంఖ్యను పెంచాలని సంకల్పించింది. అందుకోసం ఇప్పటికే దేశ, విదేశాల్లో ఆ జాతి సంరక్షణ కోసం ఎటువంటి విధానాలను అనుసరిస్తున్నారో తెలుసుకున్నది. చెట్లు తగ్గిపోవడం వల్ల అవి మనుగడ సాగించేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికిప్పుడు వాటిని తీసుకురాలేకపోయినా సాధనా రాజ్‌కుమార్ వాటికి ప్రత్యామ్నాయాలను చూపింది.

ప్రస్తుతం అపార్ట్‌మెంట్ కల్చర్‌లోనూ పిచ్చుకలను పెంచి పోషించేందుకు ఉపాయాన్ని కనుగొన్నది. పిచ్చుకలను సంరక్షించేందుకు జనాల్లో అవగాహన కల్పించడానికి వేదికగా ఆమె చెన్నైలోని మెరీనా బీచ్‌ను ఎంచుకున్నది. అక్కడకు వచ్చిన సందర్శకులకు మట్టితో తయారు చేసిన పిచ్చుక గూళ్లను అందిస్తూ వారిలో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నది. సాధన చేస్తున్న ఈ ఉద్యమానికి నెమ్మదిగా జనాల నుంచి స్పందన లభిస్తున్నది. ఆమె చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి మట్టి కుండలు తయారు చేసే పెరుమాల్ తన వంతు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చాడు. దీంతో చెన్నైలోని పలు ఊళ్లలో సాధన అనుకున్న లక్ష్యాన్ని నెమ్మదిగా చేరుకుంటున్నది. ఇప్పుడు ఆమె చేసిన కృషి వల్లనే పెరంబూర్, తోన్‌దిర్‌పేట్, సంతోమే, మైలాపూర్ వంటి ప్రాంతాల్లో పిచ్చుకల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ ప్రాంతవాసులంతా సాధన రాజ్‌కుమార్‌ను పిచ్చుకల రాణి అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు.

476
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles