పార్కిన్‌సన్స్ వ్యాధి ఎందుకొస్తుంది?


Mon,February 18, 2019 01:10 AM

మా నాన్న వయసు 65 సంవత్సరాలు. ఇప్పటివరకు ఆయన ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోలేదు. కానీ ఈ మధ్య చాలా బలహీనంగా తయారయ్యారు. తరుచుగా చేతులు.. కాళ్లు వణుకుతున్నాయని అంటున్నారు. మాటల్లో స్పష్టత కూడా తగ్గింది. ఆయనకెంతో ఇష్టమైన వంటల్ని కూడా తినడం లేదు. పైగా రుచీ పచీ లేదు అంటున్నారు. డాక్టర్‌కు చూపిస్తే పార్కిన్సన్స్ డిసీజ్ అయుండొచ్చు అన్నారు. అసలీ పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏంటి? ఎందుకొస్తుంది? ఎలా తగ్గుతుంది? వివరంగా తెలియజేయండి.
- వీ గోపాల్‌రెడ్డి, నల్లగొండ

Councelling
పార్కిన్సన్స్ డిసీజ్ అనగా వణుకుడు వ్యాధి. మెదడులో డొపమైన్ అనే రసాయన లోపం కారణంగా ఈ వ్యాధి వస్తుంది. మెదడులోని వివిధ భాగాలు శరీరంలోని నాడీ వ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి కోసం ఈ డొపమైన్ తోడ్పడుతుంది. ఈ కీలకమైన రసాయనాన్ని తయారుచేసే కణాలు క్షీణించటం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీంతో చేతులు.. కాళ్లు.. తల వణుకుతాయి. ఈ వ్యాధికి ప్రధాన కారణం వయసు పైబడటమే. అరవై యేండ్ల వయసు పైబడినవారే ఈ వ్యాధికి గురవుతున్నారు. కొందరిలో ఇది వంశపారంపర్యంగానూ వస్తుంది. 15-25% వంశపారంపర్యంగా ఈ వ్యాధి వస్తుందనేది చాలా అధ్యయనాల ద్వారా రుజువైంది. పెరుగుతున్న కాలుష్యం.. ఆహార పదార్థాల కల్తీ.. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వల్ల వృద్ధుల్లో డొపమైన్ తయారీశక్తి మందగిస్తుంది. ప్రాథమికంగా ఆహారం రుచి.. వాసన గుర్తించటంలో లోపం ఏర్పడుతుంది. తర్వాత ముఖవళికలు మారిపోతాయి. దీనినే ఫేషియల్ మాస్కింగ్ అంటారు. కొందరిలో శరీరం వంగిపోతుంది. కదలికలు నెమ్మదిగా.. బిగుతుగా మారి వణుకుడు పుడుతుంది. ఫలితంగా నడవలేని స్థితి ఏర్పడుతుంది.


అప్పుడు ఆ వ్యక్తి అవయవాలపై అదుపు కోల్పోతాడు. ఈ లక్షణాలు కనిపించిన వారిలో దాదాపు 70% దాన్ని పార్కిన్సన్స్‌గానే గుర్తించాలి. వ్యాధి తీవ్రత.. శరీరతత్వాన్ని బట్టి మందులు.. ఫిజియోథెరపీ శస్త్ర చికిత్స చేస్తారు. ఎల్ డోపా అనే ఔషధం వాడితే వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. అయితే ఇది చాలా శక్తింతమైంది. కచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సిన అవసరం ఉంది. ఎల్ డోపా డోసేజ్‌లో లోపాలు ఉంటే దీని ప్రభావం వల్ల మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంది. అవయవాలు బిగుసుకుపోయి వణుకుడు తీవ్రమవుతుంది. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వల్ల కూడా వణుకుడు వ్యాధిని నివారించవచ్చు. గుండె పనితీరును మెరుగుపరిచేందుకు పేస్‌మేకర్ అమర్చినట్లుగానే ఈ చికిత్స ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్స్‌ను అమరుస్తారు. మెదడులోని కొన్ని కణాలను తొలగించటం.. ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వటం ద్వారా వ్యాధి ముదరకుండా చేసి డొపమైన్ తయారీని పునరుద్ధరించవచ్చు.
dr-anand

959
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles