పాటే నడిపిస్తున్నది..


Wed,March 6, 2019 02:56 AM

ఆమె తన కాళ్ల మీద తాను నిల్చోలేదు. కానీ కష్టానికి తగ్గ ఫలితం ఆమెను జీవితంలో నిలబెట్టింది. తనకు తాను రెండు అడుగులు కూడా ముందుకు వేయలేదు.. కానీ విజయమే ఆమె కాళ్ల దగ్గరకు చేరింది.వీల్‌చైర్ లేనిదే నడవలేదు. కానీ.. పాటే ఆమెను జీవితంలో ముందుకు నడిపిస్తున్నది. ఎన్నో విషాదాలను ఎదుర్కొని ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో వెలుగుతున్న దివ్యాంగ గాయకురాలురాధా రాయ్ తన జీవిత విశేషాలను జిందగీతో ఇలా పంచుకున్నారు.
Radha
సాధించాలన్న సంకల్పం ఎలాంటి వారికైనా శక్తినిస్తుంది. ఆసక్తి, పట్టుదల ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించే దిశగా నడిపిస్తుంది. అకుంఠిత దీక్ష ఎంతటి పోటీనైనా, విషాదాన్నైనా తట్టుకునే ధైర్యాన్నిస్తుంది. అచ్చం ఇలాంటి పరిస్థితుల్లోనే గాయకురాలు రాధ తన జీవితాన్ని ప్రారంభించింది. వీల్‌చైర్‌నే వేదికగా మార్చుకుంది. పాటే ప్రాణంగా భావించింది. విజయం తనను ముద్దాడింది. పేరుగాంచిన శాస్త్రీయ గాయకులు పండిత్ అజయ్‌చక్రవర్తి, ఉస్తాద్ దిల్షద్‌ఖాన్, సర్ఫరాజ్ అహ్మద్‌ఖాన్‌ల దగ్గర శిక్షణ తీసుకుని ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో ప్రముఖ లైవ్ పర్ఫామెన్స్ సింగర్‌గా, సోలో సింగర్‌గా రాణిస్తున్నది.

ఎక్కడ?

రాధ పుట్టి, పెరిగింది కోల్‌కతాలో. అక్కడే లొరేటో కళాశాలలో ఇంటర్ చేసింది. అక్కడే రాజనీతి శాస్త్రంలో డిగ్రీ చదివింది.

ఏమిటి?

రాధకు చిన్నప్పటి నుంచి పాటలంటే ఆసక్తి. ఇంట్లో తనలో తాను పాడుకుంటూ సరదాగా గడిపేది. తల్లిదండ్రులు మరింత ప్రోత్సహించటంతో సంగీతం మీద ఆసక్తి మరింత పెరిగింది. కళాశాలలో వివిధ సంగీత కార్యక్రమాల్లో పాల్గొనేది. ఇలా సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభను నిరూపించుకుంది. తన పాటలతో, మధురమైన గొంతుతో స్నేహితులను, ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేది. అప్పుడే కొన్ని సందర్భాల్లో ప్లేబ్యాక్ సింగర్‌గా సంగీత ఉపాధ్యాయుల నుంచి మన్ననలు పొందింది.

ఆ తర్వాత ఏమైందంటే..

సంగీత సామ్రాజ్యంలో తన జీవితం కళకళలాడుతుంది అని కలలుగన్నది రాధ. కానీ అప్పుడే ఆమె జీవితంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కండరాల బలహీనత (న్యూరో మస్క్యులర్ డిజార్డర్) అనే అరుదైన వ్యాధి దాడి చేసింది. క్రమంగా అది తన కాళ్ల మీద ప్రభావం చూపింది. వైద్యపరీక్షలు చేయించిన తర్వాత ఆరోగ్యం కుదుటపడింది. కానీ లేవలేని స్థితికి చేరుకుంది. రెండు కాళ్లూ కదపలేని స్థితిలో వీల్‌చైర్‌కే పరిమితమైంది. అయినా ఆత్మస్థయిర్యాన్ని కోల్పోలేదు. పాటలు పాడడం మానాలన్న ఆలోచన రానీయలేదు. వీల్‌చైర్ నుంచే పాటలు పాడడం మొదలు పెట్టింది.
Radha1

సల్మాన్ సాయంతో..

తన లక్ష్యం సంగీతం. ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి కోల్‌కతా నుంచి ముంబైకి ప్రయాణమయింది. ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్‌గా తన జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నాలు షురూ చేసింది. ముంబైలోనే శిక్షణ తీసుకునేందుకు నిర్ణయించుకుంది. అనేకమంది మ్యూజిక్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సంగీత విద్వాంసులను కలిసింది. ఈ సమయంలో స్క్రాచ్ సాంగ్స్, జింగిల్స్‌తో తన ప్రతిభను నిరూపించుకున్నది. ఈ తరుణంలోనే బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను కలిసింది. ఆయన సాయంతో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియాను కలిసింది. ఆయన ఆధ్వర్యంలోనే మొదటిసారి ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. సల్మాన్ ఖాన్ నటించిన క్యోంకి ఇత్‌నా సినిమాలో క్యోం కె ఇత్‌నా ప్యార్ తుమ్‌సే పాటకు ప్లేబ్యాక్ సింగర్‌గా చేసింది. ఇలా తన సంగీత ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో సోలో సింగర్‌గా, లైవ్ పెర్ఫామెన్స్ సింగర్‌గా పేరు సంపాదించింది. ఈ క్రమంలోనే ఎన్నో ప్రశంసలు అందుకుంది. తర్వాత కొన్ని రోజులకు ఐబీఎన్7 సూపర్ ఐడల్స్ అవార్డును అందుకుంది. కలర్స్ ఫేమ్ గోకుల్ మ్యూజిక్ రియాల్టీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది.
radha3

విజయం మోకరిల్లింది..

మొదటి పాట క్యోం కి ఇత్‌నా ప్యార్‌కు వచ్చిన స్పందనతో తనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. తన గొంతును ప్రేక్షకులు అభిమానించారు. క్రమంగా ఏఆర్ రెహమాన్, శంకర్ మహదేవన్‌లతో కలిసి స్టేజీ షోలు చేసే అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలను హృదయానికి దగ్గరగా తీసుకుని బాధ్యతగా పూర్తిచేసింది. ఏఆర్ రెహమాన్‌తో లీడ్ సింగర్‌గా తను మొదటిసారి స్టేజ్‌ను పంచుకున్న సందర్బాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. అది నాకో అద్భుతమైన జ్ఞాపకమని చెపుతున్నదామె. ప్రఖ్యాత గాయని లతామంగేష్కర్ ఆదర్శంతో తను పాటలు పాడగలుగుతున్నానని, ఆమె ప్రభావం తనపై చాలా ఉందంటున్నది రాధ. ఇప్పుడు రాధ హిందీ గాయనిగా ప్రాచుర్యం పొందింది. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శంకర్ మహదేవన్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది. ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ ( ఎన్‌సీపీఏ) భారతదేశపు ప్రధాన సాంస్కృతిక సంస్థలో తరచూ ఆమె ప్రదర్శనలు ఇస్తుంటుంది. లీడ్ సింగర్‌గా, సోలో సింగర్‌గా, లైవ్ పర్ఫామెన్సుల్లో సంగీతం ఆలపిస్తుంది. వీటి ద్వారా తనకంటూ అభిమానులను పొందగలిగింది. కుటుంబం, అభిమానుల ప్రోత్సాహంతోనే తాను మరింత ఎదుగుతున్నానని, వారి అభిమానమే తనకు మనోధైర్యం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నది.

తెలుగు సినిమాల్లో..

మా నాన్న హైదరాబాద్‌లోనే పని చేస్తుంటారు. నేను తరచూ ఇక్కడికి వస్తుంటాను. హైదరాబాద్‌లో గడపడం నాకెంతో ఇష్టం. ఇది నా రెండో ఇల్లుగా భావిస్తాను. తెలుగు పాటలను పాడటం నాకున్న ఒక డ్రీమ్. ఎప్పటికైనా తెలుగు ప్రేక్షకుల కోసం నేను పాడతాను. తెలుగు సినిమాల్లో నా గొంతును వినిపిస్తాను. తెలుగు ప్రేక్షకులతో మంచి అనుబంధాన్ని కోరుకుంటున్నాను
Radha-22

షార్ట్‌కట్‌లు ఉండవు..

కళల గురించి కలలు కంటే ఎప్పటికైనా సాధించవచ్చు. ఎలాంటి ఇబ్బందులైనా, ఎంతటి కష్టాలైనా ఎదుర్కోవాలి. నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ లక్ష్యం మీద దృష్టి పెట్టాను. ఎవరైనా సరే మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని ప్రేమించండి, కష్టపడండి. అది మిమ్మల్ని జీవితంలో గొప్ప స్థాయిలో ఉంచుతుంది. ఈ ప్రయాణంలో షార్ట్‌కట్‌లు ఉండవు. మన లక్ష్యాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నాం, దాని కోసం ఎంత కష్టపడుతున్నాం అన్నదే మఖ్యం.
- రాధా రాయ్

-వినోద్ మామిడాల

635
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles