శరీరంలో క్లోమ గ్రంథికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగం ఎంజైమ్‌లను ఉత్పత్తి చేసి చిన్న పేగులో ఆహారాన్ని జీర్ణం చేయటానికి పనిచేస్తుంది. దీన్ని ఎక్సోక్రైన్ పాంక్రియాస్ అంటారు. ఇందులో ముఖ్యమైన ఎంజైమ్‌లు ఆమైలేజ్-పిండిపదార్థాలను, లైపేజ్ - కొవ్వు పదార్థాలను, ట్రిప్సిన్ - మాంసకృత్తులను జీర్ణం చేస్తాయి. రెండో విభాగాన్ని ఎండోక్రైన్ పాంక్రియాస్ అంటారు. ఈ విభాగం అనేక రకాల హార్మోన్లను ఉత్పత్తి చేయటం ద్వారా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. ఈ విభాగంలోని ఇబ్బందులే డయాబెటిస్‌కు కారణం కావచ్చు.
సమస్యలేమిటి?
పాంక్రియాస్లో సమస్యలంటే అందరికి మధుమేహం మాత్రమే గుర్తోస్తుంది. గ్లూకోజ్‌ను నియంత్రించడంలో తలెత్తే ఈ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. ఇది కాకుండా పాంక్రియాస్ వాపు, రాళ్లు ఏర్పడడం, కణితులు రూపుదిద్దుకోవడం వంటి సమస్యలు వస్తుంటాయి.
పాంక్రియాస్లో వాపు- పాంక్రియాస్లో రాళ్లుండడం వల్ల లేదా మద్యం ఎక్కువగా తీసుకునే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మందుల వాడకం కానీ, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం కారణంగా కూడా రావచ్చు. ఈ సమస్య ఉన్నవారికి కడుపులో తీవ్రమైన నొప్పి రావడం, కడుపుబ్బరం, శ్వాసలో ఇబ్బంది, మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సమస్య తీవ్రంగా ఉన్నపుడు కామెర్లు రావడం, శరీరంలో ఇన్ఫెక్షన్ పెరగటం, రోగి అపస్మారక స్థితిలొకి వెళ్లడం వంటి తీవ్రమైన పరిణామాలు ఉండొచ్చు.
గుర్తించే విధానం
రక్త పరీక్షలు, సీరం అమైలేజ్, అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా సమస్యను తొలిదశలోనే గుర్తించవచ్చు. అవసారాన్ని బట్టి ఈఆర్సీపీ పరీక్ష కూడా చేయ్యాల్సి రావచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి హాస్పిటల్లో చేరాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో మందుల ద్వారా సమస్యకు పరిష్కారాన్ని కనుగొనవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ బాగా ముదిరినపుడు పాంక్రీయస్లో దెబ్బ తిన్న భాగాన్ని పాంక్రియాటిక్ నెక్రోసెక్టమీ ఆపరేషన్ ద్వారా తొలగించి సమస్యను పరిష్కరించవచ్చు.
పాంక్రియాస్లో రాళ్లు
రాళ్లు ఏర్పడినపుడు కడుపు పై భాగంలో నొప్పి రావడం, ఆ నొప్పి వెన్నుపూసలోకి కూడా వ్యాపించినట్టు ఉంటుంది. సమస్య ముదురుతున్నకొద్దీ నొప్పి తీవ్రత పెరగటం, తరచు నొప్పి రావడం జరుగుతుంది. పాంక్రియాస్ కుంచించుకు పోవడం, దీని మూలంగా విరేచనంలో నూనె, జిగురు పడడం అదే విధంగా మధుమేహం చిన్న వయసులోనే రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సమస్య తీవ్రమైయ్యే కొద్దీ కామెర్లు రావడం, బరువు తగ్గడం కూడా జరగవచ్చు. ఇది ఎక్కువగా మద్యం తీసుకునే వారిలో కనిపిస్తుంది. కొన్ని సార్లు జన్యుపరమైన కారణాలతో లేదా ఆహారలోపాల కారణంగా కూడా రావచ్చు దీన్ని ట్రాపికల్ పాంక్రీయాటైటిస్ అంటారు. ఈ సమస్య చాలా చిన్న వయసులోనే బయటపడొచ్చు.
గుర్తించే విధానం- చికిత్స
అల్ట్రాసౌండ్ పరీక్ష చేయటం ద్వారా పాన్‌క్రియాస్ గొట్టంలో వాపును రాళ్లు చేరటాన్ని గమనించవచ్చు. రోగ తీవ్రతను బట్టి పాంక్రియాస్ గొట్టంలో వాపును, రాళ్లు చేరటాన్ని గమనించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎమ్‌ఆర్‌సీపీ పరీక్ష లేదా ఆర్సీపీ పరీక్ష అవసరం పడొచ్చు. పాంక్రియాస్ ఎంజైమ్ సప్లిమెంట్ మందులు వాడడం, నొప్పి తగ్గించే మందులు వాడడం ద్వారా సమస్యను అదుపులో ఉంచడం సాధ్యపడుతుంది. రాళ్లు ఎక్కువగా ఉన్నపుడు వీటిని లిథోట్రిప్సి, ఎండోస్కోపీ విధానం ద్వారా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. పాంక్రియాస్లో రాళ్ల పరిమాణం పెద్దగా ఉన్నా... పాంక్రియాస్ గొట్టం ఆరు మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ పొడవున్నా ఎల్పీజే సర్జరీ ద్వారా శాశ్వత పరిష్కారం అందించడం సాధ్యపడుతుంది.
పాంక్రియాస్ క్యాన్సర్
చాలా సార్లు పాంక్రియాస్ డక్ట్‌లో క్యాన్సర్ మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో పాంక్రియాస్ గ్రంథి భాగంలో కానీ, పాంక్రియాస్‌లోని ఎండోక్రైన్ భాగంలో కానీ క్యాన్సర్ రావచ్చు. కడుపునొప్పితో పాటు కామెర్లు రావడం, బరువు తగ్గడం, విరేచనం నల్లగా కావడం ప్రధాన రోగ లక్షణాలుగా గుర్తించవచ్చు. పాంక్రియాస్ గ్రంథి చివరి భాగంలో క్యాన్సర్ తలెత్తినపుడు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే క్యాన్సర్ ముదిరిపోవచ్చు.