పరీక్షలకి సిద్ధమేనా?


Sun,March 3, 2019 12:43 AM

ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. టెన్త్ పరీక్షలు రాసిన వారికి పబ్లిక్ పరీక్షల మీద కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ముందుగా ప్రిపేర్ అవుతారు. మరి పదో తరగతి చదివే విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు రాయడం ఇదే మొదటిసారి. వారికంటే చిన్న తరగ తుల వారికి ఎవరు సలహాలిస్తారు? తల్లిదండ్రులే ఈ ప్రధాన బాధ్యతను తీసుకోవాలి. పరీక్షా సమయం పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా అని గుర్తించాలి. ఈ పరీక్షా కాలంలో పిల్లలు, పెద్దలు ఈ విధంగా ప్రిపేర్ అయితే తప్పక పాసవుతారు.
allri
పిల్లలు ఇంటి వద్ద శ్రద్ధగా చదువుకోవాలంటే అందుకు తల్లిదండ్రులు కూడా కొంత బాధ్యత వహించాలి. మాకేం సంబంధం అనకుంటారేమో. వీరి భవిష్యత్తు తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది. పిల్లలు చదువుకోవడానికి ఇంట్లో మంచి ప్రదేశం ఉండాలి. ఆ వాతావరణం వారికి నచ్చేలా ఉండాలి. ఆ ప్రదేశంలో కూర్చోగానే వారికి చదువుకోవాలన్న ఆలోచన కలుగాలి. ఇంటి ఆవరణలో ఇష్టమైన వాతావరణమే పిల్లల జీవితానికి పునాది. క్లాస్ రూంలో పాఠాలు ఎలా చెబుతున్నారు. అర్థమవుతున్నాయా లేదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. పరీక్షా సమయంలో ఆరా తీస్తే లాభం ఉండదు. అర్థంకాని విషయాలను క్షుణ్ణంగా తెలియపరుచాలి. అప్పుడే పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్య రిలేషన్‌షిప్ బాగుంటుంది.

భయాన్ని పోగొట్టాలి

పరీక్షలకు సిద్ధమయ్యేటప్పడు ఎలాంటి ఒత్తిడినీ దరికి చేరనివ్వకూడదు. దీంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆయిల్ ఫుడ్‌కి కాస్త దూరంగా ఉండాలి. సబ్జెక్ట్‌కి తగినట్టుగా సమయం కేటాయించుకోవాలి. సులువుగా ఉండే సబ్జెక్ట్‌కి టైం తగ్గించి కష్టంగా ఉండే వాటికి ఎక్కువ సమయం తీసుకోవాలి. కొంతమందికి ఒక్కో సబ్జెక్ట్ కష్టంగా ఉంటుంది. దాంట్లో ఫెయిల్ అవుతామేమోనన్న సందేహం ఎక్కువ ఉండి మరింత టెన్షన్‌కి లోనవుతుంటారు. ఎలాంటి ఆందోళన చెందకుండా నువ్వు పాస్ అవుతావని భరోసా కల్పించాలి తల్లిదండ్రులు. వారికి అర్థంకాని వాటిని దగ్గరుండి వివరించాలి. వారిలో ఉండే భయాలను పోగొట్టాలి. తోటి విద్యార్థులతో మీ వాడిని పోల్చకూడదు. ఎవరి ముందు పిల్లల్ని చులకనగా చూడకూడదు. అలా చేస్తే వారు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. చదువుతో పాటు నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర తక్కువయితే చదివింది సరిగా గుర్తుండదు. పరీక్షల సమయంలో ఇంటికి బంధువులను ఆహ్వానించకూడదు. పిల్లలు ఒంటరిగా చదువడం కంటే గ్రూప్ స్టడీకి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అదే మంచిది కూడా. వారికి వచ్చిన సందేహాలను టీచర్ల కంటే తోటి విద్యార్థి చెబితేనే తొందరగా బుర్రకెక్కుతుంది. చదువుకునేటప్పుడు వారికి ఎలాంటి పనులు అప్పచెప్పకూడదు. లేదంటే వారి మైండ్‌లో వేరు ఆలోచనలు మొదలవుతాయి.

ఇలా చదువాలి

యూనిట్ పరీక్షలకి చదువుతారు. పబ్లిక్ పరీక్షలకు చదువుతారు. ఏవైనా పరీక్షలే కదా అనుకుంటారు. యూనిట్ పరీక్షలకి ప్రిపేర్ అయినట్లు పబ్లిక్‌కి చదివితే పాస్ అవ్వడం కష్టమే. దీనికీ ఓ టెక్నిక్ ఉంది. పిక్యుఆర్‌ఆర్‌ఆర్‌ఆర్(PQRRRR) పద్ధతి. పి అంటే (ప్రివ్యూ) : సులువుగా ఉండే పేజీలు ఒకవైపు, కష్టంగా ఉన్న పేజీలు ఒకవైపు పెట్టుకోండి. క్యు : అంటే ఏ ప్రశ్నలైతే త్వరగా పూర్తి చెయ్యగలరో అంచనా వేసుకోండి వాటిని ఎంచుకోండి. ఆర్ : వాటినే ముందుగా చదువాలి. ఆర్ (రిఫ్లెక్ట్) : ప్రతి జవాబుకి ఒక డయాగ్రామ్ ఉంటుంది. బొమ్మని చూసి జవాబుని అర్థం చేసుకుంటే బుర్రలో గుర్తుండిపోతుంది. ఆర్ (రీసైట్) : మీరు చదివింది ఎదుటి వారికి వర్ణించండి. ఆర్ (రివ్యూ) : చదివిన జవాబులన్నింటినీ ప్రశ్నలతో సహా రాసి, వీలైనంతవరకు తప్పుల్ని సరిచేసుకోవాలి. తర్వాత ఎగ్జామ్ హాల్‌లో అడుగు పెట్టేటప్పడు టెన్షన్ పడకుండా రిలాక్స్‌డ్‌గా ఉండాలి. క్వశ్చన్ పేపర్‌ని మూడుసార్లు చదువాలి. సరిగా వచ్చిన క్వశ్చన్‌ని టిక్ చేసుకొని వాటినే ముందుగా మొదలుపెట్టాలి. ప్రశ్నలకి ఇచ్చిన టైంలో పూర్తి చేయాలి. జవాబు మధ్యలో గుర్తు రాకుంటే కొన్ని నీళ్లు తాగి రిలాక్స్‌డ్‌గా ఆలోచించండి. పరీక్ష పూర్తయిన తర్వాత ఒకసారి అన్ని రాశారో లేదో చెక్ చేసుకోండి.

సూచనలు

allri1
పరీక్ష ముందురోజు చదువడం పూర్తి చేసుకొని తొందరగా నిద్రపోవాలి. చిట్టీలు పెట్టి రాయాలనుకునే ఉద్దేశం ఉంటే మానుకోండి. అలాంటి సక్సెస్ కొన్ని రోజలు మాత్రమే. ప్రతి ప్రశ్నని మూడుసార్లు చదివి తర్వాత పాజిటివ్ మైండ్‌తో జవాబు రాయాలి. మనసులో ఉన్న భయాన్ని తరిమికొట్టండి. ప్రతి ప్రశ్నకి ఇచ్చిన సమయంలోనే పూర్తి చేయాలి. రాని ప్రశ్నలను పక్కన పెట్టి వచ్చిన వాటిని అర్థవంతంగా రాయండి. ఎటువంటి కొట్టివేతలు రాకుండా చూసుకోండి. చివరగా అన్ని ప్రశ్నలు రాశారో లేదో చెక్ చేసుకుంటే చాలు.

సుజాత రాజమణి
కన్సల్టెంట్ సైకోథెరపిస్ట్
కిమ్స్ హాస్పిటల్

771
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles