పరమహంస ఉత్థానం!


Fri,February 15, 2019 01:40 AM

-అద్భుత ఆధ్యాత్మిక వేత్త శ్రీ రామకృష్ణుల జయంతి సందర్భంగా..
అగ్రగణ్యులైన అతికొద్ది మంది ఆధునిక భారతీయ యోగులలో విశిష్ఠ ప్రత్యేకతను సంతరించుకున్న పరమోత్కృష్టులు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస. ఆధ్యాత్మిక సాధనలో ఇంతటి నిష్ఠా గరిష్ఠులు అత్యంత అరుదు. మనుషులు వేరైనా మానవత్వ మొకటేనని, ఎందరు దేవుళ్లున్నా దైవత్వం ఒక్కటేనని అనుభవ పూర్వకంగా చాటిచెప్పిన మహానుభావుడాయన. వారి జయంతి సందర్భంగా ఈ వ్యాసం.

RamaKrishna
ఒక సామాన్య యువకుడు అసామాన్య స్థాయికి ఎలా చేరగలిగాడు? గదాధరుడు కాస్తా రామకృష్ణులుగా మారిన వైనం వెనుక అసలేం జరిగింది? అనితర సాధ్యమైన రీతిలో అద్భుత స్థాయికి చేరిన ఆయన తాత్వికతలోని గొప్పతనమేమిటి? నిర్వికల్ప సమాధి స్థితి సాధన కోసం సాక్షాత్ జగన్మాతనే పక్కన పెట్టేసేంత సుదృఢ సంకల్పానికి వారెలా రాగలిగారు? ఈ కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోగలిగితే పరమహంస ఉత్థాన రహస్యం మనకు తెలిసినట్లే.

సుసంపన్నమైన భారతీయ సంస్కృతి పట్టుకొమ్మల్లో ఒకటైన వంగదేశం (పశ్చిమ బెంగాల్)లోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో, కటిక పేదరికంలోనూ కఠోర ధార్మిక జీవనాన్ని సాగించే ఒకానొక పేద బ్రాహ్మణ కుటుంబంలో 183 సంవత్సరాల కిందట (1836 ఫిబ్రవరి 18న) జన్మించిన సామాన్యుడు ఆయన. బాలుడిగా గదాధరుడు (తల్లిదండ్రులు పెట్టిన పేరు) ఎంత సున్నితుడో అంత సుమనస్కుడు కూడా. సాంప్రదాయిక చదువులు, సుఖసంతోషాలు, సంపాదనల మీదికన్నా ప్రకృతి ఆరాధన, సాధువుల సత్సంగాల వైపు ఆయన మనసు వెళ్లేది. ఆ ఊరు మీదుగా పూరీకి తరలి వెళ్లే సన్యాసులు ఆగి, ప్రసంగించేటప్పుడు శ్రద్ధగా వినేవారు. తనకు కలిగే సందేహాలనూ వారిని అడిగి నివృత్తి చేసుకొనే వారు.

తొమ్మిదవ ఏట బాలుడైన గదాధరుని ఉపనయనానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ, ఉపయనం కాగానే తొలిబిక్షను తానొక బ్రాహ్మణేతర (కమ్మరి కులం) మహిళ దగ్గర పొందుతానని చెప్పారు. అందుకు ఆయన కుటుంబసభ్యులేకాదు, తోటి బ్రాహ్మణులూ అంగీకరించలేదు. ఆఖరకు తండ్రి మరణించాక తన పెద్దన్న (రాంకుమార్) దానికి అంగీకరించక తప్పలేదు. ధని అనే ఆ తల్లికి తాను ఇచ్చిన మాట ప్రకారం తొలిభిక్షను ఆయన స్వీకరించారు. ఇలా చిన్న వయసులోనే ఆయన సంప్రదాయాల సంకెళ్లను ఛేదించారు. ఆయనలోని మానవీయ దృక్పథానికి ఇదొక మచ్చుతునక. తన తమ్ముని మనసును అర్థం చేసుకోవడానికి రాంకుమార్‌కు కూడా కొంత సమయం పట్టక తప్పలేదు. తానేమిటో తెలిశాక అంత గొప్ప వ్యక్తిత్వం గల తమ్ముడు తనకున్నందుకు తాను గర్వించారు కూడా.

దక్షిణేశ్వర్ కాళీమాత గదాధరుణ్ణి తన కడకు రప్పించుకున్న విధానమూ తక్కువదేమీ కాదు. రాణీ రాస్మణి (ఆమె రాజ్యం లేని రాణి. పేద ప్రజలు ప్రేమతో ఆమెకిచ్చిన బిరుదు రాణి. నిజానికి ఆమె ఒక బెస్త కులానికి చెందింది. తన 44వ ఏట భర్తను కోల్పోయింది) అనే సంపన్న మహిళ కట్టించిన ఆ గుడికి కొన్నాళ్లు రాంకుమార్ పూజారిగా ఉన్నాడు. తమ్ముణ్ణి అమ్మవారి అలంకరణకు నియోగించాడు. అన్నకు సహాయంగా ఉంటూ, అమ్మవారికి సేవలు చేసేవారు. కాలగమనంలో రాంకుమార్ మరణం తర్వాత పూజారిగా పూర్తి బాధ్యతలు గదాధరునిపై పడ్డాయి. ఇక్కడే ఆయన జీవితం గొప్ప మలుపు తిరిగింది.

కాళికాదేవిది వట్టి విగ్రహమేనా? లేక నిజంగా దేవతేనా? దేవతే అయితే తాను పిలిస్తే ఎందుకు పలకదు?- ఇలా ప్రాథమిక స్థాయినుంచి మొదలైన భగవదన్వేషణ ఆయనను అనూహ్య స్థితికి చేర్చింది. అది ఎంతటి స్థితి అంటే అమ్మ చింతన తప్ప మరో ధ్యాసే లేనంత. ఎవరికీ కనిపించని అమ్మవారు ఆయనకు మాత్రం కళ్లు మూసినా, తెరిచినా దర్శనమిచ్చేది. చాలా చిత్రంగా ఒక మనిషికి చేసే సేవలన్నీ కాళికాదేవి విగ్రహానికి చేసేవారాయన. గదాధరుని విశిష్ఠ వ్యక్తిత్వం, గుణగణాలు, భక్తి తత్పరత ఒక్క హైందవులనే కాదు, మిగిలిన మతాల వారినీ ఆకట్టుకొన్నాయి.

పంజాబ్‌కు చెందిన ప్రఖ్యాత భారతీయ యోగి పుంగవుడు తోతాపురి మహరాజ్ శిష్యరికం గదాధరుణ్ణి అసాధారణ రీతిలో ఆధ్యాత్మిక పరిణతిని సాధించేలా చేసింది. ధ్యానంలో నిర్వికల్ప సమాధి సాధన అంత తేలికైన విషయం కాదు. కానీ, ఒక దశలో గదాధరుని సాధనా పటిమ తోతాపురి వారిని సైతం ఆశ్చర్యచకితుల్ని చేసింది. తోతాపురి దిగంబర యోగి. సన్యాస దీక్షవంటి కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఆత్మ సాధనకోసం ధ్యానానికి సిద్ధమయ్యారు గదాధరుడు. కళ్లు మూసుకొని కూర్చున్నా వారి మనసు ఒక పట్టాన నిలకడను సాధించలేదు. నిర్వికల్పం (ఆత్మసాక్షాత్కార స్థితి) కావడంలో తొలుత ఆయన కృతకృత్యుడు కాలేకపోయారు. ఎంతసేపూ దేదీప్యమానంగా వెలుగొందే జగజ్జనని రూపమే తన మనసులో కనిపించేది. సాధన నా వల్ల కావడం లేదు అన్న గదాధరునితో తోతాపురి వారి స్పందన ఎందరినో విచలితుల్ని చేసింది.

ఒక పగిలిన గాజుపెంకు సూదిమొనవంటి కొసతో గదాధరుని కనుబొమల మధ్య గుచ్చి, నీ మనస్సును ఈ బిందువుపై కేంద్రీకరించుమని ఆదేశించారు తోతాపురి మహరాజ్, చాలా సీరియస్‌గా. అప్పుడు ఆయనలో మొలకెత్తిన దృఢ సంకల్పం, అకుంఠిత నిబద్ధత, ఏకాగ్రతలు అన్నీ కలిసి తన మనసులో సాక్షాత్కరించిన అమ్మవారి రూపాన్ని సైతం పక్కకు జరిపేశాయి. తోతాపురి వారు గదాధరుడు ధ్యానానికి కూర్చున్న కుటీరం తలుపులు మూసేసి బయట కూర్చుండిపోయారు. ఏం జరిగిందో లోపల వున్న గదాయ్‌కే తెలియాలి. గంటలు, రాత్రి, పగలు, మళ్లీ రాత్రి పగలు.. ఇలా 3 రోజులు. తోతాపురి వారికి క్షణికాందోళన కలిగింది. మూడో రోజు ఉండబట్టలేక మూసిన తలుపులు తెరిచారు. అంతే! నిశ్చేష్టుడైనారు.

ఎలా కూర్చున్న మనిషి అలానే ఉన్నారు. కనీసం భంగిమలో కాసింతైనా కదలిక లేదు. గదాయ్ ముఖమండలం తేజోరాశిలా ప్రకాశిస్తున్నది. తోతాపురి మహరాజ్ అంతటి వారి కనుబొమలు ముడుచుకొన్నాయి. అసలు తనలో ప్రాణం ఉన్నదా? అన్న కాసింత శంకతో నాసికా రంధ్రాల వద్ద దేహానికి తగలకుండా గాలిలోనే చేయి పెట్టి పరీక్షించాడు. ఊపిరి తగలడంతో తృప్తి చెందారు. 40 ఏళ్ల కఠోర సాధనలో తాను సాధించిన దానిని ఈ మహాపురుషుడు కేవలం 3 రోజుల్లో సాధించాడు అని అంతటి గురువు తోతాపురి వారిచ్చిన ప్రశంసాపత్రం గురించి శ్రీ శారదానంద స్వామి (పరమహంస ప్రత్యక్ష శిష్యుడు) రాసిన జీవితచరిత్ర (శ్రీరామకృష్ణ పరమహంస: సమగ్ర సప్రామాణిక జీవితగాథ)లో ప్రస్తావించారు. గదాధరుడు రామకృష్ణులుగా మారడానికి దోహదపడిన అత్యంత ప్రభావవంతమైన సన్నివేశాలలో ఇదొకటి.

రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక సాధనలో కీలకాంశం ధ్యానంలో వారు సాధించిన అనూహ్యమైన నిర్వికల్ప సమాధి స్థితి. దీని సాధనే ఒక మహోత్కృష్టమంటే ఆ గురుదేవులు అందులోనే పరిపూర్ణంగా జీవించారు. ఒక్కోసారి సమాధి స్థితిలోకి వెళ్లిన వారి శరీరంలో మృత్యు లక్షణాలు గోచరించేవి. దీంతో అందరూ భయపడిపోయేవారు. ఆఖరకు వారి సతీమణి శ్రీమతి శారదాదేవి సైతం తాను సమాధి నుండి ఎప్పుడు మేల్కొంటారా అని ఎదురు చూసేవారు. చెవిలో భగవన్నామ స్మరణ వినిపిస్తే తప్ప ఈ ప్రపంచంలోకి వచ్చేవారు కాదు. ఇదీ ఆ మహనీయుని ఉత్థానస్థితి!

ఇంతటి యోగిపుంగవుని జయంతి (ఫిబ్రవరి 18) భారతీయులకే కాదు, సమస్త మానవాళికీ ఒక పండుగ రోజు. ఎంతటి వ్యక్తి ముగింపుకైనా ఏదో ఒక శారీరక అనారోగ్య కారణమే ఎక్కువగా ఉంటుంది. భగవాన్ రామకృష్ణుల వారిని సైతం క్యాన్సర్ భూతం కబళించింది. 50 ఏండ్ల వయసులోనే 1886 ఆగస్టు 16న వారు మహాసమాధిని పొందారు.
Main-box

ఆమెలోనే కాళికాదేవి!

కట్టుకున్న భార్యలోనే జగన్మాతను దర్శించేంత ఉదాత్త సంస్కారం ఉన్నవాళ్లు ఈ కాలంలో చాలా అరుదు. శ్రీరామకృష్ణ పరమహంస ఆ కోవలోకి చెందిన వారే. అయిదేళ్ల వయసులోనే శారదాదేవికి వారితో పెండ్లి నిశ్చయమైంది. ఆశ్చర్యకరంగా ఆమెనే ఆయనకు మొదటి శిష్యురాలు. దీంతో తాను గురువుల వద్ద నేర్చుకొన్న ఆధ్యాత్మిక విద్యలన్నీ ఆమెకు నేర్పించారు. ఆమె గ్రహణశక్తి అసాధారణం. దీనిని గుర్తించారు కనుకే, రామకృష్ణులు ఆమెను సాక్షాత్ కాళికాదేవిలానే భావించి ఆరాధించారు. ఒక భార్యాభర్తలు ఇంత ఆధ్యాత్మిక సాన్నిహిత్యాన్ని కలిగి ఉండడం అత్యంత అరుదు.
-దోర్బల బాలశేఖరశర్మ

1214
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles