పబ్‌జీ.. వద్దు బుజ్జీ!


Wed,February 6, 2019 01:54 AM

PUBG
నమస్కారం.. ప్రధానమంత్రి గారూ.. నా పేరు మధుమిత. నా బిడ్డ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అంతకు ముందు బాగా చదివేవాడు. ఈ మధ్య చదువు మీద అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు. ఆన్‌లైన్ గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మొన్న జరిగిన పరీక్షా పర్ చర్చ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీని ఓ తల్లి అడిగిన ప్రశ్న ఇది. ఆమె ప్రశ్న పూర్తి కాగానే.. మోడీ స్పందిస్తూ.. యే.. పబ్‌జీ వాలా హే క్యా అన్నారు. వెంటనే సభలో నవ్వులు పూశాయి. నిజమే.. చాలామంది పిల్లలు పబ్‌జీ మత్తులో పడి చదువు, భవిష్యత్తు, ఆరోగ్యం నాశనం చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పబ్‌జీ గేమ్ అంత ప్రమాదకరమైనదా? ఆన్‌లైన్ గేమ్‌ల విజృంభణ దేనికి సంకేతం.. ఈ వారం సంకేతలో చర్చిద్దాం..


ముంబైలో..

రోజూ మొబైల్‌లో పబ్‌జీ గేమ్ ఆడాడు. క్రమంగా ఆ ఆటకు బానిస అయ్యాడు. అప్పుడు వాడుతున్న మొబైల్‌లో పబ్‌జీ గేమ్ కాస్త స్లోగా రావడంతో తల్లిదండ్రులను కొత్త మొబైల్ కావాలని అడిగాడు. వాళ్లు రూ. 20 వేలు ఇస్తామన్నారు. కానీ.. ఆ కుర్రాడు రూ. 37 వేల రూపాయాల విలువైన ఫోన్ కావాలని పట్టుబట్టాడు. దీంతో ఆ పేరెంట్స్ అంత డబ్బు పెట్టి ఫోన్ కొనివ్వడం కుదరదని తెగేసి చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన 18 ఏండ్ల కుర్రాడు ఫ్యాన్‌తో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఇది ముంబైలోని నెహ్రూనగర్‌లో జరిగిన వాస్తవ సంఘటన.


ఢిల్లీలో..

చదువు పక్కనపెట్టి స్నేహితులతో నిత్యం పబ్‌జీ గేమ్‌లో మునిగిపోతున్న తమ్ముడిని చూసి ఓ అక్క తట్టుకోలేకపోయింది. ఏ పని చెప్పినా చేయకపోవడం, సమయానికి తిండి కూడా తినకుండా గేమ్‌లోనే మునిగిపోవడం చూసి ఆందోళన చెందింది. ఫ్రెండ్స్‌తో కలిసి గేమ్‌లో మునిగిపోయిన తమ్ముడిని ఆ గేమ్ ఆడకు అని చెప్పినందుకు క్షణికావేశంలో ఆ అక్కను కత్తితో పొడిచి చంపేశాడు ఆ కుర్రాడు. ఇది దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన. పబ్‌జీ గేమ్‌కి బానిసై అక్క ప్రాణాలు తీసిన ఆ కుర్రాడు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.


జమ్మూలో..

అందరికీ ఫిజికల్ ఫిట్‌నెస్ పాఠాలు చెప్పే ఫిట్‌నెస్ ట్రైనర్ ఆయన. సరదాగా పబ్ జీ గేమ్ ఆడడం మొదలుపెట్టాడు. క్రమంగా దానికి బానిసై పిచ్చివాడైపోయాడు. ఫిట్‌నెస్ ట్రైనర్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. కత్తితో తనను తాను గాయపరుచుకున్నాడు. ఇదొక పర్యవసానం.


అరేయ్.. ఏడున్నవ్ రా? ఇంట్లనే ఉన్నరా ఆన్‌లైన్‌కి రా.. పబ్‌జీ ఆడుదాం అవును.. ఏ ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నా ఇప్పుడు ఇదే సంభాషణ. నేరుగా ఆయితే మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. ఓన్లీ పబ్‌జీ. పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఎవరు పిలుస్తున్నారో వినిపించుకోరు. కదిలిస్తే చాలు.. జై పబ్‌జీ.. అంటూ ఊగిపోతారు. అవును.. సరదాగా ఆడుకునే గేమ్‌లే ప్రాణాంతకం అవుతున్నాయి. మొన్నటి వరకు పోకెమన్, నిన్న బ్లూవేల్, ఇప్పుడు డేంజరస్ పబ్‌జీ. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ ఆన్‌లైన్ గేమ్‌లు చాలా ప్రమాదం. రోజురోజుకి మనుషుల ప్రాణాలు మింగేస్తున్న భూతాల్లా తయారవుతున్నాయి. పిల్లల్లో హింసాత్మక ధోరణి పెరిగేలా రెచ్చగొడుతున్నాయి. అవతల మనతో గేమ్ ఆడుతున్న వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా ఆటలో మునిగిపోయేలా చేయడం, ఒళ్లు తెలియకుండా గేమ్‌లో లీనమయ్యేలా రూపొందిస్తున్న ఈ గేమ్ వల్ల లాభమా? నష్టమా?


సమస్యేంటంటే..

సరదాగా, టైమ్‌పాస్ కోసం ఆటలు, ఆన్‌లైన్ గేమ్స్ ఆడొచ్చు. కానీ దాన్ని వ్యసనంగా మార్చుకుంటే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. ఇలాంటి ఆన్‌లైన్ గేమ్‌లకు అడిక్ట్ అయి, గేమ్ ఆడుతున్న సమయంలో ఎవరినీ పట్టించుకోరు. గేమ్ నుంచి పక్కకు చూస్తే గేమ్‌లో శత్రువులు మన మీద దాడి చేసి చంపేస్తారనే భయంతో పరిసరాలను సైతం మరిచిపోయి ఆటలో మునిగిపోతున్నారు. ఫోన్ చేసినా ఎత్తరు, పిలిచినా పట్టించుకోరు. డిస్టర్బ్ చేస్తే.. అసహనం ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో అయితే కోపంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తారు. ఆటలో మునిగిపోయి ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల కంటిచూపు మీద ప్రభావం, నిద్రలేమి సమస్యలు వస్తాయి. ఒకేచోట కూర్చొని ఎక్కువసేపు కదలకుండా ఉండడం వల్ల నరాల సంబంధ వ్యాధితో బాధపడాల్సి వస్తుంది. గేమ్‌లో శత్రువులను చంపడం అనేది నిజ జీవితంలో ఒక లక్షణంగా మారిపోయి హింసాప్రవృత్తి పెరిగిపోతుంది. అటు చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది.. ఆరోగ్యం దెబ్బతింటుంది.. ఇంట్లోవాళ్లతో, స్నేహితులతో గడిపే టైమ్ వేైస్టయితుంది.. అందుకే.. పబ్ జీ.. వద్దురా బుజ్జీ!

PUBG1

పబ్‌జీ అంటే ఏంటి?

ఈ ప్రశ్న పబ్‌జీ గేమ్ ఆడేవారిని అడిగి చూడండి. నూటికి ఒకరో, ఇద్దరో సరైన సమాధానం చెప్తారు. అవును.. గేమ్ పూర్తి పేరు కూడా తెలియకుండానే చాలామంది గేమ్‌లో మునిగిపోతున్నారు. ఇంతకీ పబ్ జీ అంటే ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్ (Pubg) అన్నమాట. ఇది దక్షిణ కొరియాలోని పబ్ జీ కార్పోరేషన్ అనే గేమింగ్ సంస్థ రూపొందించిన ఆన్‌లైన్ గేమింగ్ యాప్. 2017 సంవత్సరాంతంలో విడుదలైన ఈ గేమ్‌ని ప్రస్తుతం ఈ ఆటను ప్రపంచవ్యాప్తంగా 20కోట్ల మంది ఆడుతున్నారు. కనీసం నాలుగు కోట్లమంది ఆన్‌లైన్ ప్లేయర్స్ నిత్యం యాక్టీవ్‌గా ఉంటున్నారు.

PUBG2

ఎందుకు అడిక్ట్ అవుతున్నారు?

కంప్యూటర్‌లో గానీ, మొబైల్‌లో గానీ ఈ ఆట ఆడొచ్చు. ఒక్కరుగా ఆడొచ్చు. లేదంటే స్నేహితులతో కలిసి ఆడొచ్చు. మొత్తం గేమ్‌లో వందమంది ఉంటారు. ఒంటరిగా ఆడితే.. 99మందిని గెలువాలి. ఈ ఆటలో భాగంగా గేమ్‌లో బాంబులు, తుపాకులు, కత్తులు, ఈటెలు, ఇతర ఆయుధాలు ఉపయోగించి ఎదుటివారిని చంపేయాలి. అలా చంపేస్తూ చివరి వరకు ఎవరు మిగులుతారో వారే విజేత. ఒక్కరే ఈ ఆట ఆడితే పెద్దగా మజా ఉండదు. ఎందుకంటే ఆట చాలా త్వరగా ముగించేయాల్సి వస్తుంది. కానీ.. స్నేహితులతో కలిసి జట్టుగా గేమ్‌లోకి ఎంటరైతే ఒకరికొకరు సహకరించుకుంటూ మనకు తెలియనివారిని చంపేస్తూ ఆట చివరి వరకు కొనసాగవచ్చు. జట్టుగా ఆడినవారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులతో కలిసి ఆడడం, ఎవరో తెలియని వ్యక్తులతో కత్తులు, బాంబులు, తుపాకులతో దాడి చేసి చంపడం వంటి టాస్క్‌లు ఉండడంతో గేమ్ ఆడుతుంటే మజా వస్తుంది. స్నేహితులతో గుంపులు గుంపులుగా కూర్చొని ఆడవచ్చు. మనకు తెలియకుండానే ఫుల్ టైమ్‌పాస్. అందుకే యువత ఈ గేమ్‌కి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. ఆడడం, గెలవడం, ఆయుధాలు, చంపడాలు అంతా గేమ్ వరకే. కానీ.. యువత ఆ విషయం వదిలేసి.. గేమ్‌ని సీరియస్‌గా తీసుకుంటుంది. ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది.


- ప్రవీణ్‌కుమార్ సుంకరి

1331
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles